మనదేశంలో ఏడాదికి 9,400 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ కాలువలు, నదుల్లోకి చేరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాకింగ్‌కు ఉపయోగించినదే ఉంటోంది. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఓ చిన్న హెయిర్ ఆయిల్ బాటిల్‌ని ప్యాక్ చేయడానికి దానికంటే నాలుగురెట్లు బరువున్న ప్యాకింగ్ మెటీరియల్‌ని ఉపయోగిస్తారు. అందులో కాగితంతో చేసిన అట్టపెట్టె ఉంటుంది.
బాటిల్ పగలకుండా ప్లాస్టిక్ బబుల్ రేపర్ ఉంటుంది. కాగితం ఇట్టే మట్టిలో కలిసిపోతుంది. దాంతో ఇబ్బంది ఉండదు. మరి ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్ ఎన్నేళ్లకు మట్టిలో కలుస్తుంది. ‘వస్తువులు రవాణాలో పగలకుండా ఉండాలంటే బబుల్ ర్యాపర్ ప్లాస్లిక్‌తోనే చేయాలా? కొబ్బరిపీచుతో బబుల్ ర్యాప్ చేసాను చూడండి’ అంటూ కుషన్‌ను పోలిన కాయిర్ పౌచ్‌ను చూపించింది ఖుష్బూ గాంధీ.
అలాగే కాయిర్ బోర్డ్‌లో ఒక పొరలోకి గాలిని చొప్పించి బుడగలు తెప్పించింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఖుష్బూ గాంధీ నిఫ్ట్‌లో మెటీరియల్ డెవలప్‌మెంట్ కోర్సు చేసింది.‘గో డూ గుడ్’ స్టార్టప్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్‌ని తయారు చేస్తోంది.
ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఉద్యమిస్తోన్న ఖుష్బూ... ‘ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి’ అని మైకులో గొంతుచించుకుంటే సరిపోదు, ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం చూపిస్తే ఆటోమేటిగ్గా ప్లాస్టిక్‌ని దూరం పెట్టేస్తారు’ అంటోంది. ఇంకా...‘నా ప్రయోగాలు నాకు లాభాలను తెచ్చిపెడతాయో లేదో తెలియదు, కానీ సస్టెయినబుల్ లైఫ్ స్టయిల్ వైపు సమాజాన్ని నడిపించడంలో మాత్రం విజయవంతం అవుతాను’ అంటోంది ఖుష్బూ గాంధీ.
ఎకో ఫ్రెండ్లీ సిరా!
‘‘ప్లాస్టిక్ బబుల్ ర్యాపరే కాదు, పేపర్ మీద ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్ కూడా అంత త్వరగా నేలలో ఇంకదు. పైగా మట్టిని కలుషితం చేస్తుంది. సీ వీడ్ (సముద్ర నాచు), నాచురల్ కలర్ పిగ్మెంట్స్‌తో ఇంకు తయారు చేశాం. ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్‌కు బదులు వ్యవసాయ వ్యర్థాలతో ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం చె΄్పాలి.
ఒకసారి వాడిపారేసే పేపర్ ప్లేట్‌లు, గ్లాసులకు ల్యామినేషన్‌తో కోటింగ్ వేస్తుంటారు. నేను దానికి కూడా ప్రత్యామ్నాయం కనుక్కున్నాను. ఎకో ఫ్రెండ్లీ కోటింగ్ చేస్తున్నాం. ‘గో డూ గుడ్’ ద్వారా మేము పది టన్నుల ప్లాస్టిక్ వాడకాన్ని నివారించగలిగాం. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇంక్‌తో ఒకటిన్నర లక్షల ఉత్పత్తులు అక్షరాలద్దుకున్నాయి. ఏడు టన్నుల బయో డీగ్రేడబుల్ బబుల్ ర్యాపర్‌లను వాడుకలోకి తెచ్చాం. ఈ ప్రయత్నంలో ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వినియోగంలోకి వచ్చాయి.
లధాక్‌లో ప్లాస్టిక్ వేస్ట్!
నేను ఈ రంగలోకి అడుగు పెట్టడానికి కారణం పదేళ్ల కిందటి లధాక్ పర్యటన. మారుమూల ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్నాయి. షాంపూ సాషే నుంచి లేస్ ర్యాపర్ వరకు అవీ ఇవీ అనే తేడా లేకుండా ప్రతి పదార్థమూ ప్లాస్టిక్‌లోనే ప్యాక్ అవుతోందని నాకు తెలిసిందప్పుడే. ఆ చెత్త కాలువల్లోకి చేరకుండా అంతటినీ ఒకచోట పోగు చేసి తగలబెడుతున్నారు. వాళ్లకు చేతనైన పరిష్కారం అది. ఇంతకంటే పెద్ద పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలని అప్పుడు అనిపించింది. ఆ తర్వాత నేను మెటీరియల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం స్పెయిన్‌కెళ్లాను.
కోర్సు పూర్తయ్యేలోపు నా ఆలోచనకు ఒక స్పష్టమైస రూపం వచ్చింది. బయోడీగ్రేడబుల్ వస్తువులతో ప్లాస్టిక్‌కి సమాధానం చెప్పవచ్చనే ధైర్యం వచ్చింది. పీజీ పూర్తయి తిరిగి ఇండియాకి రాగానే మా తమ్ముడు, మా వారితో కలిసి పూణేలో నా డ్రీమ్ ్రపాజెక్ట్ ‘గో డూ గుడ్’కు శ్రీకారం చుట్టాను. ఇది విజయవంతంగా నడుస్తోంది’’ అని వివరించిందామె. ఖుష్బూ పేరుకు తగినట్లు పరిమళభరితంగా తన విజయ ప్రస్థానాన్ని రాసుకుంటోంది. మరి... మనం మన చరిత్రను ఏ సిరాతో రాసుకుందాం... మట్టిని కలుషితం చేసే ఇంకుతోనా లేక మట్టిలో కలిసిపోయే ఇంకుతోనా. మనమే నిర్ణయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment