Packing covers
-
Khushboo Gandhi: బీ గుడ్.. డూ గుడ్!
మనదేశంలో ఏడాదికి 9,400 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ కాలువలు, నదుల్లోకి చేరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాకింగ్‌కు ఉపయోగించినదే ఉంటోంది. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఓ చిన్న హెయిర్ ఆయిల్ బాటిల్‌ని ప్యాక్ చేయడానికి దానికంటే నాలుగురెట్లు బరువున్న ప్యాకింగ్ మెటీరియల్‌ని ఉపయోగిస్తారు. అందులో కాగితంతో చేసిన అట్టపెట్టె ఉంటుంది. బాటిల్ పగలకుండా ప్లాస్టిక్ బబుల్ రేపర్ ఉంటుంది. కాగితం ఇట్టే మట్టిలో కలిసిపోతుంది. దాంతో ఇబ్బంది ఉండదు. మరి ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్ ఎన్నేళ్లకు మట్టిలో కలుస్తుంది. ‘వస్తువులు రవాణాలో పగలకుండా ఉండాలంటే బబుల్ ర్యాపర్ ప్లాస్లిక్తోనే చేయాలా? కొబ్బరిపీచుతో బబుల్ ర్యాప్ చేసాను చూడండి’ అంటూ కుషన్‌ను పోలిన కాయిర్ పౌచ్‌ను చూపించింది ఖుష్బూ గాంధీ. అలాగే కాయిర్ బోర్డ్‌లో ఒక పొరలోకి గాలిని చొప్పించి బుడగలు తెప్పించింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఖుష్బూ గాంధీ నిఫ్ట్‌లో మెటీరియల్ డెవలప్మెంట్ కోర్సు చేసింది.‘గో డూ గుడ్’ స్టార్టప్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్‌ని తయారు చేస్తోంది. ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఉద్యమిస్తోన్న ఖుష్బూ... ‘ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి’ అని మైకులో గొంతుచించుకుంటే సరిపోదు, ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం చూపిస్తే ఆటోమేటిగ్గా ప్లాస్టిక్‌ని దూరం పెట్టేస్తారు’ అంటోంది. ఇంకా...‘నా ప్రయోగాలు నాకు లాభాలను తెచ్చిపెడతాయో లేదో తెలియదు, కానీ సస్టెయినబుల్ లైఫ్ స్టయిల్ వైపు సమాజాన్ని నడిపించడంలో మాత్రం విజయవంతం అవుతాను’ అంటోంది ఖుష్బూ గాంధీ. ఎకో ఫ్రెండ్లీ సిరా!‘‘ప్లాస్టిక్ బబుల్ ర్యాపరే కాదు, పేపర్ మీద ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్ కూడా అంత త్వరగా నేలలో ఇంకదు. పైగా మట్టిని కలుషితం చేస్తుంది. సీ వీడ్ (సముద్ర నాచు), నాచురల్ కలర్ పిగ్మెంట్స్తో ఇంకు తయారు చేశాం. ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్‌కు బదులు వ్యవసాయ వ్యర్థాలతో ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం చె΄్పాలి. ఒకసారి వాడిపారేసే పేపర్ ప్లేట్లు, గ్లాసులకు ల్యామినేషన్తో కోటింగ్ వేస్తుంటారు. నేను దానికి కూడా ప్రత్యామ్నాయం కనుక్కున్నాను. ఎకో ఫ్రెండ్లీ కోటింగ్ చేస్తున్నాం. ‘గో డూ గుడ్’ ద్వారా మేము పది టన్నుల ప్లాస్టిక్ వాడకాన్ని నివారించగలిగాం. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇంక్‌తో ఒకటిన్నర లక్షల ఉత్పత్తులు అక్షరాలద్దుకున్నాయి. ఏడు టన్నుల బయో డీగ్రేడబుల్ బబుల్ ర్యాపర్లను వాడుకలోకి తెచ్చాం. ఈ ప్రయత్నంలో ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వినియోగంలోకి వచ్చాయి. లధాక్‌లో ప్లాస్టిక్ వేస్ట్! నేను ఈ రంగలోకి అడుగు పెట్టడానికి కారణం పదేళ్ల కిందటి లధాక్ పర్యటన. మారుమూల ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్నాయి. షాంపూ సాషే నుంచి లేస్ ర్యాపర్ వరకు అవీ ఇవీ అనే తేడా లేకుండా ప్రతి పదార్థమూ ప్లాస్టిక్‌లోనే ప్యాక్ అవుతోందని నాకు తెలిసిందప్పుడే. ఆ చెత్త కాలువల్లోకి చేరకుండా అంతటినీ ఒకచోట పోగు చేసి తగలబెడుతున్నారు. వాళ్లకు చేతనైన పరిష్కారం అది. ఇంతకంటే పెద్ద పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలని అప్పుడు అనిపించింది. ఆ తర్వాత నేను మెటీరియల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం స్పెయిన్కెళ్లాను. కోర్సు పూర్తయ్యేలోపు నా ఆలోచనకు ఒక స్పష్టమైస రూపం వచ్చింది. బయోడీగ్రేడబుల్ వస్తువులతో ప్లాస్టిక్‌కి సమాధానం చెప్పవచ్చనే ధైర్యం వచ్చింది. పీజీ పూర్తయి తిరిగి ఇండియాకి రాగానే మా తమ్ముడు, మా వారితో కలిసి పూణేలో నా డ్రీమ్ ్రపాజెక్ట్ ‘గో డూ గుడ్’కు శ్రీకారం చుట్టాను. ఇది విజయవంతంగా నడుస్తోంది’’ అని వివరించిందామె. ఖుష్బూ పేరుకు తగినట్లు పరిమళభరితంగా తన విజయ ప్రస్థానాన్ని రాసుకుంటోంది. మరి... మనం మన చరిత్రను ఏ సిరాతో రాసుకుందాం... మట్టిని కలుషితం చేసే ఇంకుతోనా లేక మట్టిలో కలిసిపోయే ఇంకుతోనా. మనమే నిర్ణయించుకోవాలి. -
ఫుడ్ ప్యాకేజింగ్.. వంటింట్లో ఈ సీలర్ ఉండాల్సిందే
ఈ రోజుల్లో పిండి, నూక దగ్గర నుంచి నట్స్, స్నాక్స్ వరకు అన్నీ ప్యాకెట్స్‌లోనే దొరుకుతున్నాయి. ఒకసారి కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత.. మరోసారి వాడేలోపు పాడవకుండా, పురుగు పట్టకుండా.. మెత్తబడకుండా ఈ సీలర్ను ఇంట్లో పెట్టుకోవాల్సిందే. ఇది చార్జింగ్‌తో నడుస్తుంది. అల్యూమినియం ఫాయిల్ హీట్ సీలింగ్ బ్యాగ్‌లు, ప్లాస్టిక్ స్నాక్ బ్యాగ్‌లు, వాక్యూమ్ ఫుడ్ స్టోరేజ్ బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ బ్యాగ్‌లు ఇలా చాలా వాటికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇందులో మినీ చాకు కూడా ఉంటుంది. దాని సాయంతో కవర్ని కట్ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచుకోవడానికి వెనుక మ్యాగ్నెటిక్తో పాటు ఒకవైపు చిన్న హ్యాంగర్ బెల్ట్ కూడా ఉంటుంది. దాంతో ఇనుప వస్తువుకు అటాచ్ చేసుకోవచ్చు లేదా హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు. ధర కూడా తక్కువే. ఈ సీలర్ ధర12 డాలర్లు (రూ.997) . -
సంక్రాంతిలో సడేమియా!
నాసిరకం సరుకులు అంటగట్టేందుకు రంగం సిద్ధం 4 రోజులు.. 6 సరుకులు.. జిల్లాకు అరకొర సరఫరా ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం.. అధికారుల్లో అయోమయం జిల్లా అంతటా 12 నాటికి ఉచిత రేషన్ పంపిణీ ప్రశ్నార్థకమే! పచ్చ బ్యాగులో గిఫ్ట్‌ప్యాక్ కర్నూలు : సందట్లో సడేమియా అన్న చందంగా సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్‌లో లబ్ధిదారులకు నాసిరకం సరుకులు కట్టబెట్టేందుకు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా కందిపప్పు, శనగలు, బెల్లం నాసిరకానివి సిద్ధం చేసినట్లు సమాచారం. కర్నూలు గోదాముకు వచ్చిన రెండు లారీల కందిపప్పును టెక్నికల్ ఆఫీసర్ పరిశీలించగా.. నాసిరకం అని తేలింది. దీంతో ఆయన కందిపప్పును వెనక్కి పంపినట్లు తెలిసింది. ఇక శనగలు, బెల్లంను పరిశీలించలేదు. కార్డుదారులకు నాసిరకం సరుకులు అంటగట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. పామాయిల్, నెయ్యి, గోధుమపిండి మినహా మిగతా మూడు సరుకులు విడిగా ఇస్తున్నారు. వాటిని కాటా వేసి ప్యాకెట్లుగా తయారు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న దుకాణాల్లో ప్యాకింగ్ చేయడానికే రెండు రోజుల సమయం పడుతుంది. ఇప్పటివరకు ప్యాకింగ్ కవర్లు కూడా చౌకదుకాణాలకు చేరలేదు. దీంతో పండుగకు ఎంత మందికి సరుకులు చేరుతాయనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. సంకటస్థితి.. సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్‌ను లబ్ధిదారునికి చేరవేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. సమయం తక్కువగా ఉండటం, అవసరమైన సరుకులు ఇంకా గోదాములకు చేరకపోవడంతో మండల స్థాయి అధికారులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. పండుగ సమీపిస్తుండటంతో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ కత్తిమీద సాములా మారింది. పండుగ లోపు సరుకులు ఇవ్వకపోతే విమర్శలొస్తే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. జాయింట్ కలెక్టర్ కన్నబాబు పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ కావడం, రెగ్యులర్ డీఎస్ఓ లేకపోవడం, సీఎం విజయవాడలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరు కావడం వంటి కారణాలతో ఉచిత రేషన్ సరుకుల పంపిణీ గందరగోళంగా మారింది. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రూ. 220 విలువ గల ఆరు సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తేదీలోపు సరుకులు లబ్ధిదారులకు అందించాలని సీఎం స్వయంగా అధికారులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఒత్తిడి పెంచడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. అయితే పూర్తి స్థాయి సరుకులు జిల్లాకు రావడానికి మరో రెండుమూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలో 10.39 లక్షల కార్డుదారులకు అమలు చేయనున్నారు. అమ్మ హస్తం బ్యాగ్ తరహాలో సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్ కోసం ‘పచ్చ’బ్యాగులు సిద్ధమయ్యాయి. అవి ఇంకా జిల్లా కేంద్రానికి చేరలేదు. వస్తువులన్నీ ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో దుర్వినియోగం కాకుండా గట్టి చర్యలకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన ఉచిత సరుకులు.. వైజాగ్ కేంద్రీయ భాండార్ నుంచి బెల్లం రవాణా చేస్తున్నారు. 518 టన్నులకు గాను ఇప్పటి వరకు 88 టన్నులు జిల్లాకు చేరింది. అలాగే నెయ్యి కూడా వైజాగ్ కేంద్రీయ భాండార్ నుంచి సరఫరా చేస్తున్నారు. 103 కిలోలకు గాను కేవలం 13.5 కిలోలు మాత్రమే ఇప్పటి వరకు జిల్లాకు సరఫరా చేశారు. అలాగే వినుకొండ పూజిత దాల్మిల్ నుంచి కందిపప్పు సరఫరా అవుతుంది. 518 టన్నులకు గాను 176 టన్నులు గోదాములకు చేరాయి. కాకినాడ ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి పామాయిల్‌ను సరఫరా చేస్తున్నారు. 518 కిలో లీటర్లకు గాను 125 కిలోలీటర్లు గోదాములకు చేరాయి. అలాగే చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి శనగలు సరఫరా చేస్తున్నారు. 1036 టన్నులకు గాను 116 టన్నులు గోదాములకు చేరాయి. గోధుమ పిండి కాకినాడ గోదావరి ఫ్లోర్‌మిల్ నుంచి సరఫరా చేస్తున్నారు. 1036 టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 824 టన్నులు గోధుమ పిండి గోడౌన్లకు చేరింది. మిగిలిన సరుకులు వచ్చినవి వచ్చినట్లుగా చౌక డిపోలకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. ఒకటి ఒకసారి, మరోకటి ఒకసారి వస్తే తీసుకెళ్లడం పంపిణీ చేయడం చాలా కష్టమని డీలర్లు వాదిస్తున్నారు.