సంక్రాంతిలో సడేమియా!
నాసిరకం సరుకులు
అంటగట్టేందుకు రంగం సిద్ధం
4 రోజులు.. 6 సరుకులు.. జిల్లాకు అరకొర సరఫరా
ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం.. అధికారుల్లో అయోమయం
జిల్లా అంతటా 12 నాటికి ఉచిత రేషన్ పంపిణీ ప్రశ్నార్థకమే!
పచ్చ బ్యాగులో గిఫ్ట్‌ప్యాక్
కర్నూలు : సందట్లో సడేమియా అన్న చందంగా సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్‌లో లబ్ధిదారులకు నాసిరకం సరుకులు కట్టబెట్టేందుకు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా కందిపప్పు, శనగలు, బెల్లం నాసిరకానివి సిద్ధం చేసినట్లు సమాచారం. కర్నూలు గోదాముకు వచ్చిన రెండు లారీల కందిపప్పును టెక్నికల్ ఆఫీసర్ పరిశీలించగా.. నాసిరకం అని తేలింది. దీంతో ఆయన కందిపప్పును వెనక్కి పంపినట్లు తెలిసింది. ఇక శనగలు, బెల్లంను పరిశీలించలేదు. కార్డుదారులకు నాసిరకం సరుకులు అంటగట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. పామాయిల్, నెయ్యి, గోధుమపిండి మినహా మిగతా మూడు సరుకులు విడిగా ఇస్తున్నారు. వాటిని కాటా వేసి ప్యాకెట్లుగా తయారు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న దుకాణాల్లో ప్యాకింగ్ చేయడానికే రెండు రోజుల సమయం పడుతుంది. ఇప్పటివరకు ప్యాకింగ్ కవర్లు కూడా చౌకదుకాణాలకు చేరలేదు. దీంతో పండుగకు ఎంత మందికి సరుకులు చేరుతాయనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.
సంకటస్థితి..
సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్‌ను లబ్ధిదారునికి చేరవేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. సమయం తక్కువగా ఉండటం, అవసరమైన సరుకులు ఇంకా గోదాములకు చేరకపోవడంతో మండల స్థాయి అధికారులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. పండుగ సమీపిస్తుండటంతో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ కత్తిమీద సాములా మారింది. పండుగ లోపు సరుకులు ఇవ్వకపోతే విమర్శలొస్తే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. జాయింట్ కలెక్టర్ కన్నబాబు పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ కావడం, రెగ్యులర్ డీఎస్‌ఓ లేకపోవడం, సీఎం విజయవాడలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరు కావడం వంటి కారణాలతో ఉచిత రేషన్ సరుకుల పంపిణీ గందరగోళంగా మారింది. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రూ. 220 విలువ గల ఆరు సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
12వ తేదీలోపు సరుకులు లబ్ధిదారులకు అందించాలని సీఎం స్వయంగా అధికారులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఒత్తిడి పెంచడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. అయితే పూర్తి స్థాయి సరుకులు జిల్లాకు రావడానికి మరో రెండుమూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలో 10.39 లక్షల కార్డుదారులకు అమలు చేయనున్నారు. అమ్మ హస్తం బ్యాగ్ తరహాలో సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్ కోసం ‘పచ్చ’బ్యాగులు సిద్ధమయ్యాయి. అవి ఇంకా జిల్లా కేంద్రానికి చేరలేదు. వస్తువులన్నీ ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో దుర్వినియోగం కాకుండా గట్టి చర్యలకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఇప్పటి వరకు జిల్లాకు చేరిన ఉచిత సరుకులు..
వైజాగ్ కేంద్రీయ భాండార్ నుంచి బెల్లం రవాణా చేస్తున్నారు. 518 టన్నులకు గాను ఇప్పటి వరకు 88 టన్నులు జిల్లాకు చేరింది. అలాగే నెయ్యి కూడా వైజాగ్ కేంద్రీయ భాండార్ నుంచి సరఫరా చేస్తున్నారు. 103 కిలోలకు గాను కేవలం 13.5 కిలోలు మాత్రమే ఇప్పటి వరకు జిల్లాకు సరఫరా చేశారు. అలాగే వినుకొండ పూజిత దాల్‌మిల్ నుంచి కందిపప్పు సరఫరా అవుతుంది. 518 టన్నులకు గాను 176 టన్నులు గోదాములకు చేరాయి. కాకినాడ ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి పామాయిల్‌ను సరఫరా చేస్తున్నారు. 518 కిలో లీటర్లకు గాను 125 కిలోలీటర్లు గోదాములకు చేరాయి. అలాగే చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి శనగలు సరఫరా చేస్తున్నారు. 1036 టన్నులకు గాను 116 టన్నులు గోదాములకు చేరాయి. గోధుమ పిండి కాకినాడ గోదావరి ఫ్లోర్‌మిల్ నుంచి సరఫరా చేస్తున్నారు. 1036 టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 824 టన్నులు గోధుమ పిండి గోడౌన్లకు చేరింది. మిగిలిన సరుకులు వచ్చినవి వచ్చినట్లుగా చౌక డిపోలకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. ఒకటి ఒకసారి, మరోకటి ఒకసారి వస్తే తీసుకెళ్లడం పంపిణీ చేయడం చాలా కష్టమని డీలర్లు వాదిస్తున్నారు.