శతశాతం ఓటర్ల నమోదు లక్ష్యం | The target of 100% to register voters | Sakshi
Sakshi News home page

శతశాతం ఓటర్ల నమోదు లక్ష్యం

Published Sat, Nov 23 2013 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

The target of 100% to register voters

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:  జిల్లాలో శతశాతం ఓటరు నమోదు జరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ కాంతిలాల్‌దండేతో కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఓటరు నమోదు, చేర్పులు మార్పులకు సంబంధించి వీఎల్‌ఓలు రసీదులు తప్పని సరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఓటు తొలగించేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత వ్యక్తికి సమాచారం అందించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలను రేషన్ డిపోలతోపాటు, పంచాయతీ, పోలింగ్ కేంద్రాలు, పాఠశాలల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎవరి ఒత్తిళ్లకైనా తలొగ్గి తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తప్పవన్నారు.

ఉపాధ్యాయులకు, బీఎల్‌ఓలకు ఫారం -6, 7, 8, 8ఏలపై శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రధానంగా చనిపోయిన, రెండు సార్లు నమోదైన వారి ఓట్లు లేకుండా ఇంటింట సర్వే చేపట్టాలని సూచించారు. అర్హుల పేర్లు తప్పినట్లు ఫిర్యాదు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించాలని చెప్పారు.
 కొత్త ఈవీఎంలు..
 ఈ సారి కొత్త ఈవీఎంలను అందజేస్తామని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. మొదటి స్థాయి పరిశీలన రాజకీయపార్టీ ప్రతినిధుల సమక్షంలో చేపట్టి వీడియోగ్రఫీ చేయించాలని సూచించారు. నాలుగు సంవత్సరాలు పైబడి జిల్లాలో పని చేస్తున్న తహశీల్దార్లు, ఎస్సైలకు ఎన్నికల విధులు కేటాయించరాదని స్పష్టం చేశారు.
 రాజకీయ పార్టీలు సహకరించాలి...
 శతశాతం ఓటరు నమోదుకు సహకరించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. జనవరి 25 తరువాత నమోదైన 45 వేల మందికి ఎపిక్ కార్డులు అందజేస్తామన్నారు. ప్రధానంగా జిల్లావ్యాప్తంగా ఉన్న 2,083 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులను నియమించాలని సూచించారు. కళాశాలల్లో ఉన్న 18 ఏళ్లు నిండి న వారందరూ ఓటరుగా నమోదయ్యేలా విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని కోరారు.

ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
 కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ జిల్లాలో 23.42 లక్షల మంది జనాభా ఉన్నారని, అందులో 16.19 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జనాభా ప్రకారం 18 ఏళ్లు దాటిన యువకులు 53 వేల మంది ఉండగా.. కేవలం 15వేల మంది ఓటర్లుగా నమోదయ్యారని వివరించారు. ఎన్నికలకు సం బంధించి నమోదైన కేసులపై తీసుకున్న చర్యలను వివరించా రు. ఈ సమావేశంలో జేసీ పి.ఎ.శోభ, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్‌సైనీ, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్‌ఓ బి. హేమసుందర వెంకట రావు, ఆర్డీఓ జె. వెంకటరావులతో పాటు, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement