kantilal Dande
-
కోర్టు ధిక్కార కేసులో అధికారులకు జైలు శిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే (ప్రస్తుతం రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి)కు హైకోర్టు రూ.2 వేల జరిమానా విధించింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎస్.శ్రీనివాస్‌కు 2 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ శుక్రవా రం తీర్పు వెలువరించారు.వారిద్దరినీ రిజి స్ట్రార్ (జ్యుడీషియల్) ముందు లొంగిపోవాలని ఆదేశించారు. ఈ తీర్పు వెలువడగానే, దీనిని సవాలు చేస్తూ కాంతిలాల్ దండే, శ్రీనివాస్‌లు వేర్వేరుగా ధర్మాసనం ముందు కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును రెండు వారాలు నిలిపేసింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.పదోన్నతినివ్వడం లేదంటూ పిటిషన్..తన సుదీర్ఘ సర్వీసు ఆధారంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పదోన్నతినివ్వడం లేదంటూ గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) బి.వసంత 2021లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు నాలుగు నెలల్లో ఏఈలు, ఏఈఈలు, డీవైఈఈల సీనియారిటీ జాబితా ఖరారు చేయాలని 2022లో అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయడంలేదంటూ వసంత కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 1న మరోసారి విచా రణకు రాగా.. న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరావు అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ ఈ నెల 9న తీర్పు ఇచ్చారు. కోర్టుకు హాజరైన ఇరువురు అధికారులు కోర్టు ఆదేశాల అమలుకు మరింత గడువు కోరారు. దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల అమలును మూడు వారాలు నిలిపివేశారు. తిరిగి ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. గతంలో శిక్ష విధించిన నేపథ్యంలో వెంటనే రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఇరువురినీ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
గిరిజనుల స్వయం ఉపాధికి సర్కార్ కృషి
డుంబ్రిగుడ/అరకులోయ రూరల్: అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజనుల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు జీసీసీ గోడౌన్లో కొర్రాయి వీడీవీకే ఏర్పాటు చేసిన బిస్కెట్ తయారీ కేంద్రాన్ని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, అరకు ఎమ్మెల్యే ఫాల్గుణతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కృషితో కేంద్ర ప్రభుత్వం 350 వన్‌ధన్ వికాస కేంద్రాలను ఏపీకి మంజూరు చేసిందన్నారు. సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటవీ ఉత్పతులకు అదనపు విలువ జోడించి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వీటిని కాటేజీ పరిశ్రమ కిందకు మారిస్తే విద్యుత్ రాయితీ పొందవచ్చని సూచించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తగిన సహకారం అందిస్తోందన్నారు. అనంతరం కాంతీలాల్ దండే కుటుంబ సమేతంగా అరకులోయను సందర్శించారు. గిరి గ్రామదర్శినిలో కాంతిలాల్ దంపతులకు గిరిజన సంప్రదాయ దుస్తులు వేసి మరోసారి పెళ్లి తంతు జరిపించారు. సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో గిరి గ్రామదర్శిని నిర్వహణ అభినందనీయమన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చట్టారి జానకమ్మ, ఎంపీపీ బాక ఈశ్వరి, సర్పంచ్ శారద పాల్గొన్నారు. -
జ్ఞానబుద్ధ పుష్కరఘాట్‌లో కూలిన టెంట్లు
- ఇనుప రాడ్దులు తగిలి భక్తులకు గాయాలు అమరావతి(గుంటూరు జిల్లా) కృష్ణా పుష్కరాల్లో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనపడుతోంది. గుంటూరు జిల్లా అమరావతిలోని జ్ఞానబుద్ధ పుష్కరఘాట్‌లో ఆదివారం భక్తుల రద్దీ అధికం కావటంతో శనివారం సాయంత్రమే టెంట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11-12గంటల మధ్య ఘాట్లలో తీవ్రంగా గాలులు వీయటంతో ఒక్కసారిగా రెండు టెంట్లు పడిపోయాయి. పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పాటించకపోవటంతో 24 గంటలు తిరగముందే టెంట్ కుప్పకూలింది. దీనితో ఇనుపరాడ్డులు తగిలి భక్తులు గాయాలపాలయ్యారు. ఒక్కసారిగా జరిగిన హాఠాత్ పరిణామానికి భక్తులు భయాందోళన చెందారు. ఒంగోలుకు చెందిన సీహెచ్ ప్రసన్నకు తలకు, గుంటూరు నల్లచెరువుకు చెందిన సాయిలిఖిత, సంగడిగుంటకు చెందిన బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో అక్కడే ఉన్న వారి బంధువులు, రెడ్‌క్రాస్ తరుఫున వచ్చిన విద్యార్థులు హుటాహుటిన క్షత్రగాత్రులను తీసుకుని కమాండ్ కంట్రోల్‌రూమ్ వద్ద ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ఒక్క అధికారి లేరు.... సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఒక్క అధికారి కూడా లేరని బాధితులు చెబుతున్నారు. కనీసం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే సమయంలో కూడా ఏ ఒక్కరూ తోడు రాలేదని ఆరోపించారు. అధికారులు ఏర్పాట్లు సక్రమంగా చేసి ఉంటే ఇటువంటి పరిస్ధితి వచ్చి ఉండేది కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు బాధితులను పరామర్శించారు. -
24న గుంటూరులో రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు
హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష గుంటూరు ఈస్ట్: ఈనెల 24న రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా జరిగే ఇఫ్తార్‌విందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరుకు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 24వ తేదీ సాయంత్రం 6.47గంటలకు సన్నిధి కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొనేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకే సీఎం విచ్చేసే అవకాశముందని, నమాజ్,ఇఫ్తార్ విందు కార్యక్రమాలతో పాటు మత పెద్దలతో సమావేశమయ్యే అవకాశముందని తెలిపారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా మొత్తం సుమారు 2 వేల మంది హాజరుకానున్నారని చెప్పారు. అలాగే 25వ తేదీ ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి తుళ్ళూరుకు విచ్చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ 6 వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ఎన్.టి.ఆర్. క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని, అనంతరం రైతులకు ప్లాట్లు పంపిణీ చేస్తారని చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు కలెక్టర్‌తో అంచనాల కమిటీ భేటీ
గుంటూరు : గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేతో అసెంబ్లీ అంచనాల కమిటీ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ అంచనాలపై సమీక్ష నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అయిదుగురు ఎమ్మెల్యేలతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఎయిమ్స్ శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష
ఈ నెల 19న గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ శంకస్థాపన జరగనున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ కాంతీలాల్‌దండే, జేసీ శ్రీధర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి తదితరులు రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు సహా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
మళ్లీ పాము కలకలం..
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి పాము కలకలం సృష్టించింది. దీంతో జిల్లా కలెక్టర్ మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లాల్లోని 52 శాఖల అధికారులు హాజరయ్యారు. సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్రచికిత్స గదిలోకి పాము చొరబడింది. దీంతో సిబ్బంది ఆ పామును చంపేసి ఎవరికీ తెలియకుండా కాల్చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కాంతీలాల్‌దండే మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యగా మారిన పాములు, ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానంపై అన్ని శాఖల అధికారుల నుంచి సూచనలు తీసుకోనున్నట్టు తెలిసింది. -
నేరుగా రంగంలోకి బాబు..!
13న రాజధాని గ్రామాల్లో పర్యటించే అవకాశం సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంత గ్రామాల్లో జరుగుతున్న భూసమీకరణ తీరును సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేలు గురువారం రాత్రి గుంటూరులోని జిల్లా పరిషత్ సభా భవనంలో సమీక్షించారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో ఈ నెల 13న సీఎం పర్యటించే అవకాశం ఉందనీ, ఆ లోపు భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనీ ఆదేశించారు. సీఎం ప్రతిరోజూ సంబంధిత అధికారులతో నేరుగా ఉదయం 9.30 నుంచి 10 గంటలలోపు మాట్లాడే అవకాశముందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. సమాచారాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి రెండ్రోజులకో మారు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందనీ ఫోన్లు ఎవరూ స్విచ్ ఆఫ్ చేయకుండా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇలావుండగా రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలు కొన్నిచోట్ల తక్కువగా రావడం, మరికొన్నిచోట్ల అసలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై కమిషనర్, కలెక్టర్లు ఆరా తీశారు. ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజూ 100 నుంచి 200 ఎకరాలకు తగ్గకుండా రైతులను చైతన్యవంతుల్ని చేసి అంగీకారపత్రాలు స్వీకరించాలని సూచించారు. గ్రామాల్లో రైతుల ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత నోటీసులు అందజే యాలన్నారు. ఇతరప్రాంతాల్లో ఉన్నవారు అఫిడవిట్లు, తమ హక్కు పత్రాలను ఆన్లైన్లో ఉంచినా సరిపోతుందని చెప్పారు. అందిన దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 11 నుంచి ఎంజాయ్మెంట్ సర్వేను నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన ప్రచారం నిమిత్తం పెద్దపెద్ద ఫ్లెక్సీలను, బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లిలో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదని వెంటనే ప్రారంభమయ్యే దిశగా అధికారులను నియమిస్తామన్నారు. సీఆర్డీఏ టోల్ ఫ్రీ నంబర్ రైతులకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు సీఆర్డీఏ టోల్ ఫ్రీ నంబర్ 18004258988 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూ సమీకరణకు సంబంధించి మొత్తం 25 ఎస్డీసీ కార్యాలయాలను గుంటూరు మార్కెట్ యార్డులోని మార్కెటింగ్ శాఖ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఇసుక ధరలకు కళ్లెం
సాక్షి, గుంటూరు : ఇసుక కృత్రిమ కొరత, అధిక ధరలకు కళ్లెం వేసే దిశగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రత్యేక దృష్టి సారించారు. ఇసుక అక్రమ రవాణా, ధరల నియంత్రణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇసుక విధానంలో సమూల మార్పులకు జేసీ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఇసుక కొనుగోళ్లు పారదర్శకంగా ఉండేలా నవంబరు 26వ తేదీ నుంచి మీ-సేవకు అప్పగించారు. ఈ విధానం రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రారంభించారు. ఇసుక కావాలని బుక్ చేసుకోగానే కొనుగోలుదారు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా ఓ విధానానికి రూపకల్పన చేశారు. రీచ్ నుంచి ఇసుక లారీ బయలు దేరగానే కొనుగోలుదారు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. లారీ ఏ సమయంలోగా రానుందో, కొనుగోలుదారు ఇంటికి ఇసుక చేరిన తరువాత లారీ వచ్చినట్టుగా కూడా మెసేజ్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుక తవ్వే విధంగా మార్గదర్శకాలు రూపొందించారు. రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు. గతంలో గుంటూరులో 6 క్యూబిక్ మీటర్ల ఇసుక లారీ ధర రూ.15 వేలు ఉండగా దాన్ని ఇప్పుడు రూ. 6,412లకే కొనుగోలుదారుకు చేరేలా చర్యలు తీసుకొన్నారు. అలాగే ఇసుక కోసం లారీలు రీచ్‌ల వద్ద మూడురోజులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితిని అధిగమించి త్వరితగతిన నింపే ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఆరు ఇసుక రీచ్‌లు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తుండగా, మరో తొమ్మిది పాట ద్వారా నడుస్తున్నాయి. ఇవి కూడా జనవరి నెలాఖరుకు డ్వాక్రా సంఘాల పరిధిలోకి రానున్నాయి. రెండవ దశలో... ఇసుక కొత్త పాలసీని పటిష్టంగా అమలు చేసే చర్యల్లో భాగంగా జిల్లాలో ప్రయోగాత్మకంగా వేబ్రిడ్జిలు, తేమశాతం కొలిచే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నిర్ధేశించిన ప్రమాణాల్లో ఇసుక కొనుగోలుదారుకు చేరనుంది. ఇసుక రవాణా చేసే వాహనాలను జీపీఎస్ విధానానికి అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల ఇసుక లారీ ఎక్కడ ఉంది, నిర్ధేశిత మార్గంలో వస్తుందా లేదో కూడా తెలుసుకోవచ్చు. వాహనాన్ని దారి మళ్లిస్తే వెంటనే జిల్లా ఎస్పీ ,ఆర్డీఓకు మెసేజ్ వెళుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమవుతారు. ప్రస్తుతం రోజుకు జిల్లాలో దాదాపు 12వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయిస్తున్నారు. క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ. 650గా నిర్ణయించారు. ఇసుక బుక్ చేసుకొనేందుకు వీలుగా అన్ని వివరాలతో ప్రత్యేకంగా సమాచారాన్ని మీసేవా కేంద్రంలో పొందుపరిచారు. ఏవైనా సందేహాలు, ఫిర్యాదుల కోసం 18001212020 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇసుక ధరల నియంత్రణలో జేసీ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తనదైన శైలిలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. -
తుపాను బాధితులకు మరింత మిరప పొడి
గుంటూరు ఈస్ట్: హుదూద్ తుపాను బాధితులకు మరో 235 టన్నుల మిరప పొడిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటివరకు 415 టన్నుల మిరప పొడిని విశాఖపట్నానికి తరలించామని చెప్పారు. సోమవారం మూడు ట్రక్కుల్లో కూర గాయలు పంపామని చెప్పారు. మంగళవారం సాయంత్రానికి మరో నాలుగు ట్రక్కుల్లో కూరగాయలు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అందిన వెంటనే సరఫరా చేసేందుకు కందిపప్పును సిద్ధం చేయూలని సూచించారు. పంపిన సరుకులు విశాఖలోని సంబంధిత శాఖలకు అందాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. తుపాను బాధితుల కోసం సహాయ సామగ్రిని పంపుతున్న సంస్థలు, సంఘాలు, వ్యక్తులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్, డీఆర్వో నాగబాబు, ఆర్డీవోలు, జిల్లా స్థారుు అధికారులు పాల్గొన్నారు. -
మేము సైతం..
సాక్షి, గుంటూరు తుపాను విలయంలో చిక్కుకున్న అభాగ్యులను చూసి మానవత్వం స్పందించింది. ఆకలితో అలమటిస్తూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు చేయూతనందించేందుకు జిల్లా నుంచి సహాయక బృందాలు విశాఖకు కదిలాయి. హుదూద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ముఖ్యంగా సుందరనగరం విశాఖ కకావికలమైంది. ఈ నేపథ్యంలో సాటివారిని ఆదుకునేందుకు జిల్లా ప్రజలు, అధికార యంత్రాంగం మానవత్వంతో స్పందించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాల మేరకు జేసీ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, కూరగాయలు విశాఖకు తరలించారు. 15 రెవెన్యూ బృందాలు, 30 జన్మభూమి బృందాలు తరలి వెళ్లాయి. ఒక్కో రెవెన్యూ బృందంలో ఓ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు తహశీల్దార్లు, నలుగురు వీఆర్వోలు ఉన్నారు. దీంతో పాటు కార్పొరేషన్, మెడికల్ సిబ్బంది తరలివెళ్లారు. జిల్లా నుంచి తరలిన పదార్థాలు... సోమవారం ఉదయం 40 వేల భోజన ప్యాకెట్లు, 50 వేల మజ్జిగ ప్యాకెట్లను తరలించారు. మధ్యాహ్నం తరువాత రెండు లారీల కూరగాయలు, రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు, 20 వాటర్ ట్యాంకులను పంపించారు. దీంతో పాటు రెఢీ టు ఈట్ కింద ఒక ట్రక్కు బిస్కెట్లు, ఒక ట్రక్కు కేకులను పంపారు. మెడికల్ బృందాలు సైతం 6 లక్షల విలువైన అత్యవసర మందులను తీసుకొని తరలివెళ్లాయి. దీంతో పాటు సోమవారం రాత్రి 200 మంది విద్యుత్తు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లారు. కార్పొరేషన్ నుంచి... గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఏసుదాసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విశాఖకు వెళ్లాయి. ఇందులో పర్యావరణ శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ రాయల్ బాబు, ఏఈ రవీంద్రతో పాటు 400 మంది శానిటేషన్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లారు. వీరు వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, కొంత నగదు తీసుకెళ్లారు. హుదూద్ బాధితులకు ఇతోధిక సహాయం అందేలా చర్యలు తీసుకోవడంలో జిల్లా కలెక్టర్, జేసీ విశేషంగా కృషి చేస్తున్నారు. దీంతో పాటు అన్నిశాఖల సిబ్బంది, దాతల సహకారంతో మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖకు 23 మంది ఎంపీడీవోల పయనం పాతగుంటూరు : హుదూద్తుపాను బాధితుల సహాయక చర్యల కోసం జిల్లా నుంచి 23 మంది ఎంపీడీవోలను విశాఖపట్నం పంపినట్లు జిల్లా పరిషత్ సీఈవో బి.సుబ్బారావు సోమవారం తెలిపారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు వీరిని పంపినట్టు వివరించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ఎంపీడీవోలు అక్కడే ఉంటారని పేర్కొన్నారు. -
గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గుంటూరు: హుదూద్ తుపాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. జిల్లాలో తుపాన్ వల్ల ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన 0863 -2234070, 2234301 నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష నిర్వహించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. నిజాంపట్నం ఓడరేవులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
నేడు సీఎం రాక
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. వినుకొండ, రేపల్లె నియోజకవర్గాల్లో జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం శావల్యాపురంలో పరిశీలించారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటులో గుంటూరు జిల్లా కీలకం కానున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సైతం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం సీఎం చంద్రబాబు జిల్లాకు రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించి భూసేకరణపై స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని జిల్లాప్రజలు ఆశగాఎదురు చూస్తున్నారు. టెక్స్టైల్ పార్కు నిమిత్తం యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభమే కాలేదు. స్పైసెస్ పార్కు పనులు పూర్తయినప్పటి కీ ప్రారంభానికి నోచుకోలేదు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు సూచిస్తున్నారు. రుణ మాఫీపై రైతులు, మహిళలు, చేనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయ పనిముట్లు, ప్రోత్సాహాలు సైతం ప్రభుత్వం నుంచి సరిగా అందకపోవడంతో అందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 15 వేల మందికి పైగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి పర్యటించే వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు, బొల్లాపల్లి, నూజెండ్లలో ఫ్లోరిన్ సమస్యతో అక్కడి ప్రజలు సతమతమవుతున్నారు. ఆప్రాంత వాసులు మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు చేసిన ప్రకటన కార్య రూపం దాల్చలేదు. రేపల్లె నియోజకవర్గంలో ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధికి కొన్ని ఏళ్ల కిందటే రూ. 200 కోట్లతో జెట్టి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అటవీ అనుమతులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో పనులు ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారుల సంక్షేమం సైతం అటకెక్కింది. తమిళనాడు తరహాలో ప్యాకేజీని ఇవ్వాలని ఇక్కడి మత్స్యకారులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి హార్బర్లను అభివృద్ధి చేయాలని వేడుకుంటున్నారు. రేపల్లె పట్టణం పేరుకు మున్సిపాలిటీ అయినప్పటికీ అక్కడ వర్షం వస్తే నగరం నడిబొడ్డులో సైతం మోకాలి లోతు నీరు నిలిచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనతో పట్టణానికి ఏమైనా వరాలు కురిపిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా కొండవీడు, అమరావతి, వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తే బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనుల నత్తనడకన సాగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జిల్లా వ్యాప్తంగా నత్తనడకన జరుగుతున్న జలయజ్ఞం పనుల్లో కదలిక తెచ్చి ఆయకట్టును అభివృద్ధి చేస్తారేమోనన్న ఆశ జిల్లా ప్రజల్లో కనిపిస్తుంది. గుంటూరు నగరాన్ని మెగా సిటీగా ప్రకటించాలని నగర వాసులు కోరుకుంటున్నారు. -
సీఎం చంద్రబాబు రాక
సాక్షి, గుంటూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 23న ప్రత్తిపాడులో డ్వాక్రా సదస్సు, 24న పెదకూరపాడులో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటనపై మంగళవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు... = ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు. = 23న ప్రత్తిపాడులో జరిగే డ్వాక్రా సదస్సుకు 30 వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని ఆదేశించారు. = అదే రోజు సాయంత్రం గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశ మంది రంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అధికారులు విధిగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్‌కు సిద్ధం కావాలన్నారు. = సీఎం పర్యటన ముగిసే వరకు వారం రోజులపాటు ఉద్యోగులకు సెలవు మంజూరు చేయవద్దని ఆదేశించారు. = ఈ సదస్సు ముఖ్య బాధ్యతలను డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ ఢిల్లీరావు, గుంటూరు ఆర్డీఓ భాస్కర నాయుడులకు అప్పగించినట్టు తెలిపారు. పెదకూరపాడులో రైతు సదస్సు = 24న పెదకూరపాడులో రైతు సదస్సు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ను ఆదేశించారు. = ఇక్కడ కూడా 30 వేల మందికి తగ్గకుండా రైతులను సమీకరించాలన్నారు. సదస్సు నిర్వహణకు తగిన స్థలాన్ని ఎంపిక చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. = బహిరంగవేదికకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి 23వ తేదీ రాత్రి గుంటూరులో బస చేసే అవకాశం ఉందన్నారు. = {పత్తిపాడు, పెదకూరపాడు సదస్సుల ఆవరణల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. = రెండు సదస్సుల్లో, ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. = ఆ రెండు రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. = ముఖ్యమంత్రి పర్యటించే మార్గమధ్యలో వివిధ శాఖల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. సదస్సుల్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. = పెదకూరపాడు సదస్సు సమన్వయకర్తగా ఆర్డీవో మురళికి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, డీఆర్వో నాగబాబు, అన్ని శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ సుజల స్రవంతిపై 27లోగా ప్రణాళిక
కొరిటెపాడు(గుంటూరు): గ్రామీణ ప్రజలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం క్రింద రక్షిత తాగునీరు అందించేందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను ఈ నెల 27వ తేదీలోగా తమకు అందించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. పథకం అమలుపై కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో అధికారులకు గురువారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి పథకం అమలు ప్రారంభమవుతుందని తెలిపారు. దీనిద్వారా 20 లీటర్ల శుద్ధ జలాన్ని కేవలం రెండు రూపాయలకే అందిస్తామని చెప్పారు. సమస్యాత్మకమైన ఆవాస ప్రాంతాలను గుర్తించి ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు సిఫారసు చేయాలని ఆర్డ బ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మండల స్థారుులో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ప్రత్యేకాధికారులు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో విస్తృత స్థాయి సర్వే నిర్వహించి నీటి వనరులను గుర్తించి వాటి నమూనాలను సేకరించాలన్నారు. అవసరమైన చోట ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ నీటి పారుదల శాఖ ఇప్పటికే 48 శాతం ఆవాస ప్రాంతాలను గుర్తించిందని తెలిపారు. ప్రధానంగా నరసరావుపేట, తెనాలి డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్డీవోలు తమ పరిధిలోని పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ గ్రూపులతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి బ్యాంక్ బ్రాంచి ఒక గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందించేలా చూడాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను కోరారు. బోరు బావులున్న హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. పంచాయతీల్లో పరిస్థితిపై జిల్లా పంచాయతీ అధికారి దృష్టి సారించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏజేసీ కె.నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వేణు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సోలార్ విద్యుత్తు ప్రాజెక్టు కోసం భూముల పరిశీలన
తుమృకోట (రెంటచింతల): తుమృకోట గ్రామ సమీపంలో ఉన్న అన్ సర్వే లాండ్ పోరంబోకు భూములను శుక్రవారం గురజాల ఆర్డీవో అరుణబాబు, జిల్లా సర్వే అధికారి కెజియాకుమారి, తహశీల్దార్ ఎన్వీ ప్రసాద్, అటవీ అధికారులు సందర్శించారు. సుమారు 1500ఎకరాల్లో సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకుగాను కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాల మేరకు ఈ భూములను పరిశీలించారు. గ్రామపరిసరాల్లో సుమారు రెండు వేల ఎకరాలు సర్వే చేయకుండా ఉన్న భూములను నలుగురు సర్వేయర్లు, మరో నలుగురు అటవీ సిబ్బందితో కలసి రెండు బృందాలుగా ఏర్పడి మూడు రోజుల్లో ఆ భూములను కొలిపించి నివేదిక అందించాలని ఆర్డీవో కోరారు. సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసినట్లయితే మండలంలోని అన్ని గ్రామాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించవచ్చన్నారు. ఈ ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఈ ఏడాది పంటలను సాగు చేయవద్దని గ్రామంలో దండోరా వేయించారు. భారీ ప్రాజెక్టును ఇక్కడే ఏర్పాటు చేసినట్లయితే మండల ంతోపాటు పలనాడు ప్రాంతానికి మేలు జరిగే అవకాశం ఉంది. కార్యక్రమంలో వీఆర్వో ఎస్విఎన్ మల్లికార్జునరావు, సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
సోలార్ పవర్ రీజియన్‌గా జిల్లా
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో గుంటూరు జిల్లా ‘సోలార్ పవర్ రీజియన్’గా మారబోతోంది. ఈ మేరకు నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాయలంలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సదస్సు వివరాలను వెల్లడించారు. అవి... * సోలార్‌పవర్ రీజియన్‌ను గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు గురజాల- రెంటచింతల మధ్యలో ప్రభుత్వ భూములను గుర్తించాలి. * ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ లింక్ చేయాలి. * మీ సేవల్లో మొత్తం 283 సేవలుండగా ఇందులో 112 సేవలను అసలు ప్రజలు వినియోగించుకోవడం లేదు. మీసేవల్లో అందే అన్ని సేవలను సద్వినియోగం చేసుకొనేలా ప్రణాళికలు రూపొందించాలి. * పట్టాదారు పాసుపుస్తకాల జారీ, పాసుపుస్తకాల్లో మార్పులు, చేర్పులు, టైటిల్ డీడ్స్ జారీ చేయడంలో జిల్లా పదవ స్థానంలో ఉంది. దీన్ని మెరుగుపరుచుకొని త్వరితగతిన పాసు పుస్తకాలు జారీ అయ్యేలా చూడాలి. * జిల్లాలో వరి, పత్తి పంటలను అభివృద్ధి చేయాలి. అలాగే మిరప, అరటి, చేపల పెంపకం, పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్నారు. * నాగార్జునసాగర్ నీటిని తాగు, సాగుకు వినియోగించుకోవాలని సూచించారు. * పులిచింతలప్రాజెక్టులో 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా చూడాలి. * పులిచింతల నిర్వాసితులకు పరిహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. * అలాగే నగరాలు, పట్టణాల్లో సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్, తాగునీరు, పచ్చదనం వంటి అంశాలపై దృష్టి సారించాలి. * గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటిగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. * మంచినీటి సమస్య, పారిశుధ్యం, అండర్‌గ్రౌండ్‌డ్రైనేజీ వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. * జిల్లాలో టూరిజంను సర్వీస్సెక్టారుగా పెట్టుకొని అందుకోసం కొన్ని భూములను గుర్తించాలి. అమరావతిలో బుద్ధస్తూపంతో పాటు, బీచ్ రీసార్ట్స్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. * నిజాంపట్నం ఓడరేవును పోర్టుగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. * జిల్లాలో ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు వీలుగా భూములు గుర్తించాలి. * జిల్లాలో టెండర్లు నిర్వహించిన రెండురీచ్లు మినహా మిగతా వాటిని డ్వాక్రా గ్రూపులకు అప్పగించి కలెక్టర్, ఎస్పీలు వారికి సపోర్టుగా ఉండాలి. * చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిని పది లేన్లుగా విస్తరించేందుకు భూసేకరణ చేపట్టాలి. * సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించినట్టు కలెక్టర్ కాంతిలాల్‌దండే వివరించారు. -
కలెక్టర్ బదిలీపై కేంద్రమంత్రి అశోక్ అసంతృప్తి
హైదరాబాద్ : విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే బదిలీపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంతిలాల్ దండేనే విజయనగరం జిల్లా కలెక్టర్‌గా కొనసాగించాలని వారు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావును కోరారు. కాగా కాంతిలాల్ దండే గుంటూరు కలెక్టర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కలెక్టర్ గా ముదావత్ ఎం.నాయక్ నియమితులయ్యారు. దండే తనదైన శైలిలో జిల్లా అధికార యంత్రాంగాన్ని నడిపించారు. పలు కీలక సమయాల్లో సమర్థంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే వచ్చిన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, సాధారణ ఎన్నికలను చాకచక్యంగా నిర్వహించగలిగారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో చెలరేగిన నిరసనల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించారు. ముఖ్యంగా కర్ఫ్యూ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. -
సమన్వయంతో పని చేయండి
విజయనగరం కంటోన్మెంట్:ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. సోమవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మం డల సమావేశాలు నిర్వహించినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించాలన్నారు. డీఆర్డీఏ ద్వారా అమలవుతున్న ఎన్‌హెచ్‌జీ గ్రూపుల వివరాలు, వాటి పనితీరు, శిక్షణలు, బ్యాంకు లింకేజి, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, స్త్రీనిధి, ఆమ్ ఆద్మీ, బంగారు తల్లి, జన శ్రీ పథకాలపై డీఆర్డీఏ పీడీ టి.జ్యోతి పవర్ పాయింట్ ప్రజం టేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ 1999 నుంచి ఇప్పటివరకు జిల్లాలో బ్యాంక్ లింకేజి కింద రూ.212.2 కోట్లు పంపిణీ చేశామన్నారు. 2014-15కు వార్షిక ప్రణాళిక కింద రూ.552 కోట్లను వివిధ పద్దుల కింద పంపిణీ చేయడానికి లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. నిరుపేద ల సమగ్రాభివృద్ధి పథకం కింద రూ.130 కోట్లను వస్తువులు, యం త్రాల రూపంలో అందించామన్నారు. ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం డీఆర్డీఏ ద్వారా 183 ఎన్డీసీసీలను నడిపిస్తున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి అనేకమంది గ్రామీణ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. బంగారు తల్లి పథకం కింద ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే వరకూ వివిధ దశల కింద రూ.1,55,500 లక్షలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకూ 10,186 మంది ఈ పథకం కింద నమోదైనట్టు చెప్పారు. చిన్నారులకు పూర్వ విద్యను అందించేందుకు 60 బాల బడులను నినర్వహిస్తున్నామని, వాటిలో 1036 మంది పిల్లలు పూర్వ వి ద్యను అభ్యసిస్తున్నారని దీని పర్యవేక్షణ శోధన అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోందన్నారు. ఇంటితో పాటు మరుగుదొడ్డి తప్పనిసరి గృహ నిర్మాణాలు చేపట్టేటపుడు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా చూడాలని మంత్రి మృణాళిని ఆదేశించారు. ఈ సం దర్భంగా జిల్లాలోని గృహ నిర్మా ణ శాఖ ప్రగతిని పీడీ కుమార్ వివరించారు. ఇప్పటివరకు 6,03,320 గృహాలను మంజూరు చేశామన్నారు. ఇందులో 4,90,000 పూర్తయ్యాయని, 1,13,000పైగా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. గ్రా మీణ ప్రాంతాల్లో ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.లక్షా 5వేలు చొప్పున నిర్మాణ వ్యయాన్ని అందిస్తున్నామన్నారు. ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 వేలు, పట్టణ ప్రాంతాలల్లో రూ.80వేలను అందిస్తున్నట్టు తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ పరిధిలో ఆర్ఆర్ ప్యాకేజి కింద 3,920 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.50వేలు, మరుగుదొడ్డి కోసం మూడు వేలు, అందిస్తున్నట్టు తెలిపారు.ఈ సమీక్షలో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, పార్వతీపురం, ఎస్.కోట ఎమ్మెల్యేలు బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, జేసీ రామారావు, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. రాత్రి పది తర్వాత మద్యం షాపుల బంద్ మద్యం దుకాణాలను ఉదయం 11 గంటల నుంచి ప్రారంభించి రాత్రి పదిగంటలకు మూసేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని చెప్పారు. సోమవారం ఆమె డీఆర్డీఏ సమావేశ మందిరం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్ట్ షాపులు ఇంకా కొన్ని చోట్ల నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతోందనీ, వాటిపై కొరడా ఝళిపిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్టు షాపులు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధికి కృషి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలు నత్తనడకన సాగుతున్నాయని. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, యంత్రాంగం కష్టపడి పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పనిచేసే చోటే ప్రభుత్వ సిబ్బంది నివాసం ఉండాలన్నారు. చెరుకు రైతులకు సీతానగరం సుగర్ ఫ్యాక్టరీ చెల్లింపులు చేయడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌కు సూచించామన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా సబ్ స్టేషన్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని భరో సా ఇచ్చారు. చెన్నైలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. వలసల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని సాక్షి విలేకరి ప్రశ్నించగా.. వలసలు వెళ్లకుండా నిరోధించాలని గ్రామ సర్పంచ్‌లు, పెద్దల ద్వారా ప్రచారం కల్పించనున్నామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చెన్నైలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి లో ఆరుగురికి జిల్లా నిధుల నుంచి రూ.5లక్షల చొప్పున పరిహా రం అందించామన్నారు. మిగిలిన వారికి వ్యక్తిగత చెక్కులు తయారుచేసి పంపిస్తామని కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారన్నారు. గాయపడిన వారికి రూ.50వేలు, ప్రతి కుటుంబానికీ వేతన నష్టం కింద మరో రూ.25వేలు అందిస్తామని చెప్పారు. చెన్నై ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల పరిహారం తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు. -
‘సార్వత్రిక’ నోటిఫికేషన్ రేపు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: లోక్‌సభ, శాసనసభల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 12న విడుదల చేస్తున్నట్టు కలెక్ట ర్ కాంతిలాల్ దండే తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ఐదు రోజులపాటు నామినేషన్ల్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్‌తో పాటు అఫిడవిట్ సమర్పించాలన్నారు. ఎంపీ అభ్యర్థి రూ.25 వేలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చేయూల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో సగమే చెల్లించాలన్నారు. నామినేషన్‌కు ముందురోజు ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించి ఎన్నికల వ్యయాన్ని ఆ ఖాతా ద్వారా ఖర్చు చేయాలన్నా రు. మే 5లోగా ప్రచారం పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకూ 49 రకాల కోడ్ ఉల్లంఘనలు జరిగాయన్నారు. ఎక్కడైనా కోడ్ ఉల్లంఘ న జరిగితే 1070 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారమందించవచ్చని తెలిపారు. ర్యాలీలు, సమావేశాల కు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి నెలాఖరు వరకూ ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని పేర్కొన్నా రు. ఓటరు స్లిప్పుల పంపిణీపై అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటరు స్లిప్పు లు లేనంత మాత్రాన ఓటింగ్‌కు అనుమతించకూడదనే నిబంధన లేదన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 21 గుర్తింపు కార్డులకు అదనంగా ఈ స్లిప్పులను ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. రాజకీయ నాయకులు కూడా ఓటరు స్లిప్పులు ఇవ్వవచ్చన్నారు. పార్టీ అభ్యర్థి, చిహ్నం, గుర్తులు, జెండాల వంటివి ముద్రించకూడదన్నారు. పోలింగ్ రోజున పార్టీ ల గుర్తులు, జెండాలు కనిపించకూడదని స్పష్టం చేశా రు. సమావేశంలో జేసీ రామారావు, ఏజేసీ నాగేశ్వరరా వు, డీఆర్వో హేమసుందర్, జెడ్పీ సీఈఓ మోహనరా వు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
శతశాతం ఓటర్ల నమోదు లక్ష్యం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో శతశాతం ఓటరు నమోదు జరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ కాంతిలాల్‌దండేతో కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఓటరు నమోదు, చేర్పులు మార్పులకు సంబంధించి వీఎల్ఓలు రసీదులు తప్పని సరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఓటు తొలగించేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత వ్యక్తికి సమాచారం అందించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలను రేషన్ డిపోలతోపాటు, పంచాయతీ, పోలింగ్ కేంద్రాలు, పాఠశాలల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎవరి ఒత్తిళ్లకైనా తలొగ్గి తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తప్పవన్నారు. ఉపాధ్యాయులకు, బీఎల్ఓలకు ఫారం -6, 7, 8, 8ఏలపై శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రధానంగా చనిపోయిన, రెండు సార్లు నమోదైన వారి ఓట్లు లేకుండా ఇంటింట సర్వే చేపట్టాలని సూచించారు. అర్హుల పేర్లు తప్పినట్లు ఫిర్యాదు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించాలని చెప్పారు. కొత్త ఈవీఎంలు.. ఈ సారి కొత్త ఈవీఎంలను అందజేస్తామని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. మొదటి స్థాయి పరిశీలన రాజకీయపార్టీ ప్రతినిధుల సమక్షంలో చేపట్టి వీడియోగ్రఫీ చేయించాలని సూచించారు. నాలుగు సంవత్సరాలు పైబడి జిల్లాలో పని చేస్తున్న తహశీల్దార్లు, ఎస్సైలకు ఎన్నికల విధులు కేటాయించరాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు సహకరించాలి... శతశాతం ఓటరు నమోదుకు సహకరించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. జనవరి 25 తరువాత నమోదైన 45 వేల మందికి ఎపిక్ కార్డులు అందజేస్తామన్నారు. ప్రధానంగా జిల్లావ్యాప్తంగా ఉన్న 2,083 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులను నియమించాలని సూచించారు. కళాశాలల్లో ఉన్న 18 ఏళ్లు నిండి న వారందరూ ఓటరుగా నమోదయ్యేలా విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని కోరారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ జిల్లాలో 23.42 లక్షల మంది జనాభా ఉన్నారని, అందులో 16.19 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జనాభా ప్రకారం 18 ఏళ్లు దాటిన యువకులు 53 వేల మంది ఉండగా.. కేవలం 15వేల మంది ఓటర్లుగా నమోదయ్యారని వివరించారు. ఎన్నికలకు సం బంధించి నమోదైన కేసులపై తీసుకున్న చర్యలను వివరించా రు. ఈ సమావేశంలో జేసీ పి.ఎ.శోభ, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, ఐటీడీఏ పీఓ రజిత్కుమార్సైనీ, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్ఓ బి. హేమసుందర వెంకట రావు, ఆర్డీఓ జె. వెంకటరావులతో పాటు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
కుదుటపడుతున్న విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విశాఖపట్నం : ఆందోళనలతో అట్టుడికిన విజయనగరం క్రమేపీ కుదుటపడుతోంది. కర్ఫ్యూ నీడ కొనసాగుతోంది. పట్టణంలో గురువారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. గురువారం ఉ. 7 నుంచి 9 వరకు, మ. 2 నుంచి 4 వరకు కర్ఫ్యూను సడలించారు. మరోవైపు పట్టణంలోని రైతుబజార్లన్నింటినీ మూసేసి సిబ్బంది, రైతులు నిరసన తెలపడంతో కర్ఫ్యూ సడలించినా ప్రజలకు ఉపయోగంలేకుండా పోయింది. కూరగాయల ధరలు నింగినంటడంతో అవస్థలు పడ్డారు. శుక్రవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూను సడలిస్తున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండె, ఎస్పీ కార్తికేయ తెలిపారు. ముగ్గురు సీఐల సరెండర్ : విజయనగరంలో సమైక్య నిరసనలను అదుపు చేయడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఐలు డి. లక్ష్మణరావు, వెంకట అప్పారావు, రమణమూర్తిలను బాధ్యులుగా చేస్తూ డీఐజీ కార్యాలయానికి సరెండర్ చేసి వారి స్థానంలో మరో ముగ్గురిని తాత్కాలికంగా నియమిస్తూ విశాఖ రేంజ్ డీఐజీ ఉమాపతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. -
విజయనగరంలో కర్ఫ్యూ ఎత్తేయాలి: వైఎస్సార్ సీపీ
విజయనగరం: విజయనగరంలో కర్ఫ్యూ ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్మత్స సాంబశివరాజు, అవనపు విజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం సమర్పించారు. ఆస్తుల విధ్వంసం కేసులో అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల సూచన మేరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. సమైక్య విద్యార్థి జేఏసీ నేతలపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయలేదని, కనీసం కేసు కూడా పెట్టలేదని తెలిపారు. ఈ అంశంలో న్యాయం చేయమని కలెక్టర్‌ను కోరామని పెన్మత్స సాంబశివరాజు, అవనపు విజయ్ తెలిపారు. -
ప్రజలు సహకరిస్తే కర్ఫ్యూ ఎత్తివేత : కాంతిలాల్ దండే
విజయనగరం: ప్రజలు సహకరిస్తే కర్ఫ్యూ ఎత్తివేస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. రేపు ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తామన్నారు. ఈరోజు కర్ఫ్యూ సడలింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. రేపు మరో గంట అదనంగా కర్ఫ్యూ సడలిస్తామన్నారు. ప్రజలు ఇలాగే సహకరిస్తే త్వరలోనే కర్ఫ్యూ ఎత్తివేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈరోజు రాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోతేనే రేపు సడలింపు సమయం అమలౌతుందని ఎస్పి కార్తికేయ చెప్పారు. ఆస్తుల విధ్వంసం, పోలీసు వాహనాల ధ్వంసంకు సంబంధించి 110 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మరో 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పి చెప్పారు.