నేడు సీఎం రాక
సాక్షి, గుంటూరు :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. వినుకొండ, రేపల్లె నియోజకవర్గాల్లో జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం శావల్యాపురంలో పరిశీలించారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటులో గుంటూరు జిల్లా కీలకం కానున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సైతం ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం సీఎం చంద్రబాబు జిల్లాకు రావడం ఇదే తొలిసారి.
ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించి భూసేకరణపై స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని జిల్లాప్రజలు ఆశగాఎదురు చూస్తున్నారు.
టెక్స్‌టైల్ పార్కు నిమిత్తం యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభమే కాలేదు.
స్పైసెస్ పార్కు పనులు పూర్తయినప్పటి కీ ప్రారంభానికి నోచుకోలేదు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు సూచిస్తున్నారు.
రుణ మాఫీపై రైతులు, మహిళలు, చేనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు.
దీనికి తోడు వ్యవసాయ పనిముట్లు, ప్రోత్సాహాలు సైతం ప్రభుత్వం నుంచి సరిగా అందకపోవడంతో అందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 15 వేల మందికి పైగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
ముఖ్యమంత్రి పర్యటించే వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు, బొల్లాపల్లి, నూజెండ్లలో ఫ్లోరిన్ సమస్యతో అక్కడి ప్రజలు సతమతమవుతున్నారు. ఆప్రాంత వాసులు మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
వెనకబడిన పల్నాడు ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు చేసిన ప్రకటన కార్య రూపం దాల్చలేదు.
రేపల్లె నియోజకవర్గంలో ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధికి కొన్ని ఏళ్ల కిందటే రూ. 200 కోట్లతో జెట్టి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అటవీ అనుమతులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో పనులు ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మత్స్యకారుల సంక్షేమం సైతం అటకెక్కింది. తమిళనాడు తరహాలో ప్యాకేజీని ఇవ్వాలని ఇక్కడి మత్స్యకారులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి హార్బర్లను అభివృద్ధి చేయాలని వేడుకుంటున్నారు.
రేపల్లె పట్టణం పేరుకు మున్సిపాలిటీ అయినప్పటికీ అక్కడ వర్షం వస్తే నగరం నడిబొడ్డులో సైతం మోకాలి లోతు నీరు నిలిచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనతో పట్టణానికి ఏమైనా వరాలు కురిపిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో ముఖ్యంగా కొండవీడు, అమరావతి, వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తే బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది.
నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనుల నత్తనడకన సాగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
జిల్లా వ్యాప్తంగా నత్తనడకన జరుగుతున్న జలయజ్ఞం పనుల్లో కదలిక తెచ్చి ఆయకట్టును అభివృద్ధి చేస్తారేమోనన్న ఆశ జిల్లా ప్రజల్లో కనిపిస్తుంది.
గుంటూరు నగరాన్ని మెగా సిటీగా ప్రకటించాలని నగర వాసులు కోరుకుంటున్నారు.