మేము సైతం..
సాక్షి, గుంటూరు
తుపాను విలయంలో చిక్కుకున్న అభాగ్యులను చూసి మానవత్వం స్పందించింది. ఆకలితో అలమటిస్తూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు చేయూతనందించేందుకు జిల్లా నుంచి సహాయక బృందాలు విశాఖకు కదిలాయి. హుదూద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ముఖ్యంగా సుందరనగరం విశాఖ కకావికలమైంది.
ఈ నేపథ్యంలో సాటివారిని ఆదుకునేందుకు జిల్లా ప్రజలు, అధికార యంత్రాంగం మానవత్వంతో స్పందించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాల మేరకు జేసీ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, కూరగాయలు విశాఖకు తరలించారు. 15 రెవెన్యూ బృందాలు, 30 జన్మభూమి బృందాలు తరలి వెళ్లాయి. ఒక్కో రెవెన్యూ బృందంలో ఓ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు తహశీల్దార్లు, నలుగురు వీఆర్వోలు ఉన్నారు. దీంతో పాటు కార్పొరేషన్, మెడికల్ సిబ్బంది తరలివెళ్లారు.
జిల్లా నుంచి తరలిన పదార్థాలు...
సోమవారం ఉదయం 40 వేల భోజన ప్యాకెట్లు, 50 వేల మజ్జిగ ప్యాకెట్లను తరలించారు. మధ్యాహ్నం తరువాత రెండు లారీల కూరగాయలు, రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు, 20 వాటర్ ట్యాంకులను పంపించారు. దీంతో పాటు రెఢీ టు ఈట్ కింద ఒక ట్రక్కు బిస్కెట్లు, ఒక ట్రక్కు కేకులను పంపారు. మెడికల్ బృందాలు సైతం 6 లక్షల విలువైన అత్యవసర మందులను తీసుకొని తరలివెళ్లాయి.
దీంతో పాటు సోమవారం రాత్రి 200 మంది విద్యుత్తు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లారు.
కార్పొరేషన్ నుంచి... గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఏసుదాసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విశాఖకు వెళ్లాయి. ఇందులో పర్యావరణ శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ రాయల్ బాబు, ఏఈ రవీంద్రతో పాటు 400 మంది శానిటేషన్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లారు.
వీరు వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, కొంత నగదు తీసుకెళ్లారు. హుదూద్ బాధితులకు ఇతోధిక సహాయం అందేలా చర్యలు తీసుకోవడంలో జిల్లా కలెక్టర్, జేసీ విశేషంగా కృషి చేస్తున్నారు. దీంతో పాటు అన్నిశాఖల సిబ్బంది, దాతల సహకారంతో మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
విశాఖకు 23 మంది ఎంపీడీవోల పయనం
పాతగుంటూరు : హుదూద్‌తుపాను బాధితుల సహాయక చర్యల కోసం జిల్లా నుంచి 23 మంది ఎంపీడీవోలను విశాఖపట్నం పంపినట్లు జిల్లా పరిషత్ సీఈవో బి.సుబ్బారావు సోమవారం తెలిపారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు వీరిని పంపినట్టు వివరించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ఎంపీడీవోలు అక్కడే ఉంటారని పేర్కొన్నారు.