సాక్షి, గుంటూరు : ఇసుక కృత్రిమ కొరత, అధిక ధరలకు కళ్లెం వేసే దిశగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రత్యేక దృష్టి సారించారు. ఇసుక అక్రమ రవాణా, ధరల నియంత్రణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇసుక విధానంలో సమూల మార్పులకు జేసీ శ్రీకారం చుట్టారు.
దీనిలో భాగంగా ఇసుక కొనుగోళ్లు పారదర్శకంగా ఉండేలా నవంబరు 26వ తేదీ నుంచి మీ-సేవకు అప్పగించారు. ఈ విధానం రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రారంభించారు. ఇసుక కావాలని బుక్ చేసుకోగానే కొనుగోలుదారు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా ఓ విధానానికి రూపకల్పన చేశారు.
రీచ్ నుంచి ఇసుక లారీ బయలు దేరగానే కొనుగోలుదారు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. లారీ ఏ సమయంలోగా రానుందో, కొనుగోలుదారు ఇంటికి ఇసుక చేరిన తరువాత లారీ వచ్చినట్టుగా కూడా మెసేజ్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.
రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుక తవ్వే విధంగా మార్గదర్శకాలు రూపొందించారు. రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు.
గతంలో గుంటూరులో 6 క్యూబిక్ మీటర్ల ఇసుక లారీ ధర రూ.15 వేలు ఉండగా దాన్ని ఇప్పుడు రూ. 6,412లకే కొనుగోలుదారుకు చేరేలా చర్యలు తీసుకొన్నారు.
అలాగే ఇసుక కోసం లారీలు రీచ్‌ల వద్ద మూడురోజులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితిని అధిగమించి త్వరితగతిన నింపే ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో ఆరు ఇసుక రీచ్‌లు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తుండగా, మరో తొమ్మిది పాట ద్వారా నడుస్తున్నాయి. ఇవి కూడా జనవరి నెలాఖరుకు డ్వాక్రా సంఘాల పరిధిలోకి రానున్నాయి.
రెండవ దశలో...
ఇసుక కొత్త పాలసీని పటిష్టంగా అమలు చేసే చర్యల్లో భాగంగా జిల్లాలో ప్రయోగాత్మకంగా వేబ్రిడ్జిలు, తేమశాతం కొలిచే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నిర్ధేశించిన ప్రమాణాల్లో ఇసుక కొనుగోలుదారుకు చేరనుంది.
ఇసుక రవాణా చేసే వాహనాలను జీపీఎస్ విధానానికి అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల ఇసుక లారీ ఎక్కడ ఉంది, నిర్ధేశిత మార్గంలో వస్తుందా లేదో కూడా తెలుసుకోవచ్చు. వాహనాన్ని దారి మళ్లిస్తే వెంటనే జిల్లా ఎస్పీ ,ఆర్డీఓకు మెసేజ్ వెళుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమవుతారు.
ప్రస్తుతం రోజుకు జిల్లాలో దాదాపు 12వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయిస్తున్నారు. క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ. 650గా నిర్ణయించారు.
ఇసుక బుక్ చేసుకొనేందుకు వీలుగా అన్ని వివరాలతో ప్రత్యేకంగా సమాచారాన్ని మీసేవా కేంద్రంలో పొందుపరిచారు. ఏవైనా సందేహాలు, ఫిర్యాదుల కోసం 18001212020 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
మొత్తం మీద ఇసుక ధరల నియంత్రణలో జేసీ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తనదైన శైలిలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇసుక ధరలకు కళ్లెం
Published Sat, Dec 6 2014 7:07 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement