పట్టా కట్టి మరీ మట్టి తరలిస్తున్న దృశ్యం
మట్టి అక్రమ తరలింపునకు బ్రేక్ పడటం లేదు. పత్రికల్లో కథనాలు వచ్చిన రెండు రోజుల పాటు అధికారులు హడావుడి చేయడం.. ఆనక మిన్నకుండి పోతుండటంతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు అన్న భేదం లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల కొద్దీ మట్టిని యథేచ్ఛగా తరలి స్తోంది. నిత్యం వాహనాల సంచారంతో సమీప గ్రామాల రహదారులు గుల్ల అవుతున్నాయి. ప్రజలు కూడా దుమ్ము, ధూళిని తట్టుకోలేకపోతున్నారు. రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలకు కంటి నిండా కునుకు సైతం తీయలేని దుస్థితి ఏర్పడిందని వారు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, మచిలీపట్నం : బందరు మండల పరిధిలోని బుద్దాలపాలెం, పెడన నియోజకవర్గం కాకర్లమూడి పరిసర ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు నిత్యకృత్యంగా మారింది. ఇటీవల మట్టి అక్రమ రవాణాపై ‘తవ్వుకో.. దోచుకో’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు మట్టి తరలించే ప్రదేశానికి ఓ వీఆర్వోను పంపి నిఘా ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల అనంతరం తిరిగి యథారాజా.. తథాప్రజ అన్న ప్రక్రియ మొదలైంది. ప్రతి రోజూ వందకుపైగా ట్రాక్టర్, టిప్పర్, లారీల్లో మట్టి తరలింపు సాగుతోంది. అధికారులు మట్టి అక్రమ రవాణా జోలికెత్తే.. టీడీపీ ప్రజా ప్రతినిధులతో వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతున్నా శాశ్వత చర్యల దిశగా అడుగులు పడకపోవడం దారుణం. మట్టిని తవ్వేస్తుండటంతో భూముల్లో ఎక్కడ చూసినా గోతులే దర్శనమిస్తున్నాయి.
రోజూ ఇదే తంతు..
బుద్దాలపాలెం, కాకర్లమూడి చుట్టుపక్క గ్రామాల నుంచి పొలాల నుంచి ప్రతి రోజూ దాదాపుగా 100 ట్రాక్టర్లు, 50 టిప్పర్లు, లారీలతో మట్టి తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.600 నుంచి రూ.1000 పలుకుతోంది. ఒక్కో టిప్పర్ రూ.3,500 నుంచి రూ.4,000 దూరాన్ని బట్టి ధర వసూలు చేస్తున్నా రు. ఇలా ప్రతి రోజూ సుమారు రోజుకు రూ.3 లక్షలకుపైగా, నెలకు రూ.90 లక్షల వరకు అక్రమార్కులు తమ జేబు ల్లో వేసుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment