Cherukuri Sridhar
-
చంద్రబాబు రైతుల భూములు లాక్కున్నారు.. సాక్ష్యాలు ఇవిగో: ఎమ్మెల్యే ఆర్కే
-
అమరావతి భూ కుంభకోణం: కీలకసాక్షిగా చెరుకూరి శ్రీధర్
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో చెరుకూరి శ్రీధర్ కీలకసాక్షిగా మారుతున్నారు. కాగా ఆదివారం ఏపీ సీఐడీ అధికారులు శ్రీధర్‌ను విచారించగా రెవెన్యూ రికార్డుల మాయంపై వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. '' 2015లో ల్యాండ్ పూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్‌లో తుళ్లూరు మండలం రెవెన్యూ రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారు. తిరిగి ఒరిజినల్స్‌ను తుళ్లూరు ఎమ్మార్వోకు ఇవ్వాల్సి ఉన్నా.. వాటిని గుంటూరు కలెక్టరేట్లోనే ఉంచారు. అనంతరం ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన గత ప్రభుత్వం రాజధాని నగర పరిధిని నిర్ణయించడం కోసం సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్.. గుంటూరు కలెక్టర్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించారు. 2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ పథకం ప్రక్రియ పారంభమైంది. అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41ని తీసుకొచ్చారు. మాజీమంత్రి నారాయణ పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింది. ఏపీ అసైన్డ్ లాండ్ యాక్ట్ 1977కి విరుద్ధంగా ఉన్న అంశాలను.. మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లా. చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదు. జీవో జారీకి ముందే కొన్ని ప్రతిపాదనలు.. చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు మంత్రి నారాయణకు తెలిపా.అధికారులు నిర్ణయాధికారులు కాదు.. మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న ఇతర అధికారులు మాత్రమే.. నిర్ణయాలను అమలు చేస్తారని మంత్రి నారాయణ అన్నారు. ఆ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగింది.'' అని తెలిపారు. కాగా విచారణలో కీలక విషయాలు బయటపెట్టడంతో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తుంది. హైకోర్టులో విచారణకు అనుమతి కోరుతూ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. -
‘అసైన్డ్’ స్కామ్‌లో సీఐడీకి కీలక ఆధారాలు!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణంపై విచారణ నిర్వహిస్తున్న సీఐడీ దర్యాప్తు అధికారులు తాజాగా కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఫిర్యాదుదారైన ఆర్కే, అప్పటి గుంటూరుæ జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్‌ను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. అసైన్డ్ భూముల కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీలు ఉన్నట్లు సీఐడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో దీన్ని ఎత్తివేసేలా ప్రాథమిక ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయడంపై సీఐడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు సేకరించిన పలు ఆధారాలను కూడా న్యాయస్థానానికి నివేదించనుంది. హైకోర్టు స్టే ఉత్తర్వులను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు రెండు రోజులుగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కేసులో క్షుణ్నంగా దర్యాప్తు జరిపేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
బంగారు చీర కానుకపై సీబీఐ ఆరా!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ సంస్థ ఖాతాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇతర ఖాతాలకు నిధులు మళ్లించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఎంత డబ్బు రుణాల రూపంలో వచ్చింది.. వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఏయే ఖాతాలకు ఎంతెంత మళ్లించారు? అలా మళ్లించిన వాటిలో విదేశీ ఖాతాలు కూడా ఉన్నాయా? తదితర విషయాల గురించి ఆరా తీస్తున్నారని సమాచారం. ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సంస్థకు పోలవరం పనులు కట్టబెట్టడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. 2015లో ఖాతాను స్తంభింపజేసినా.. ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, 2015లోనే బ్యాంకుల కన్సార్షియం సదరు సంస్థ ఖాతాను ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ – నిరర్థక ఖాతా)గా ప్రకటించింది. దీంతో ఇతర ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణ లున్నాయి. దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. ఇతర ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించారని సీబీఐ అనుమానిస్తోంది. రూ.264 కోట్ల నిధుల మళ్లింపుపై యూనియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న క్రమంలో ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్నట్లు తెలిసింది. అంత బంగారం ఎక్కడిది.? ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ పలుమార్లు ఇచ్చిన విరాళాలపైనా సీబీఐ దృష్టి సారించినట్లు సమాచారం. 2012 నవంబర్ 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన బంగారు చీరను కానుకగా సమర్పించారు. ఆ బంగారు చీర తయారీకి ఎనిమిది కిలోల బంగారం (8086.97 గ్రాములు), 879.438 గ్రాముల వజ్రాలు, పగడాలు ఉపయోగించడం గమనార్హం. 2013 డిసెంబర్ 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.3.42 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులు వారికి ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. కాగా, 2013కు ముందు ఈ సంస్థ ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్ షీట్లను కూడా పరిశీలించనున్నారని సమాచారం. -
సీఆర్డీఏ కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(ఏపీ సీఆర్డీఏ) కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్ నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న శ్రీధర్‌ను సీఆర్డీఏ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తు తం ఆ స్థానంలో ఉన్న నాగులాపల్లి శ్రీకాంత్‌ను సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మేరకు మొత్తం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ముదావతు ఎం.నాయక్‌ను తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(విశాఖపట్నం) సీఎండీగా బదిలీ చేశారు. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. శ్రీధర్ నియామకం చట్టం విరుద్ధం! సాక్షి, విజయవాడ బ్యూరో: సీఆర్డీఏ కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్ నియామకం చట్టవిరుద్ధమని అధికార వర్గాల్లో గుప్పుమంటోంది. సీఆర్డీఏ కమిషనర్ (సీఈవో)గా నియమితుడయ్యే అధికారికి అంతకుముందు రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలని 2014 సీఆర్డీఏ చట్టం సెక్షన్ 21(1)లో స్పష్టంగా పేర్కొన్నారు. శ్రీధర్ ఇప్పటివరకూ కలెక్టర్‌గా పనిచేయలేదు. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా నేరుగా కమిషనర్‌గా నియమించింది. తాను రూపొందించిన చట్టంలోని నిబంధనలను తానే ఉల్లంఘించి శ్రీధర్‌కు సీఆర్డీఏ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. వాస్తవానికి నాగులపల్లి శ్రీకాంత్‌ను కమిషనర్‌గా నియమించినప్పుడే జూనియర్‌కు ఆ స్థాయి పోస్టింగ్ ఇవ్వడం ఏమిటని ఐఏఎస్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నియామకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏకంగా చట్టంలోనే ఒక నిబంధనను చేర్చింది. ఆయనకు కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో దాన్నే నిబంధనగా చేర్చింది. కానీ ఇప్పుడు దాన్ని ఉల్లంఘించి అంతకంటే జూనియర్ అధికారిని నియమించడం గమనార్హం. -
శ్రీకాంత్ X శ్రీధర్
గ్రామకంఠాలపై ఎవరి పట్టు వారిదే జేసీ శ్రీధర్ నివేదికను పక్కన పెట్టిన సీఆర్డీఏ కమిషనర్ మాస్టర్‌ప్లాన్‌ను మార్చలేమంటున్న శ్రీకాంత్ కొలిక్కిరాని రాజధాని గ్రామకంఠాల నిర్ధారణ విజయవాడ : రాజధాని గ్రామకంఠాల వ్యవహారం ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య చిచ్చు రేపింది. స్థానిక నాయకుల సూచనలకు అనుగుణంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వీటిపై నివేదిక తయారుచేయగా, మాస్టర్‌ప్లాన్‌ను మార్చేలా ఉన్న దీన్ని తానెలా ఆమోదిస్తానని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఎనిమిది నెలల నుంచి గ్రామకంఠాల నిర్ధారణ ఒక కొలిక్కి రాలేదు. మంత్రుల అంగీకారం మేరకు... భూసమీకరణ తర్వాత గ్రామకంఠాల నిర్ధారణ కోసం సీఆర్డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేశాయి. భూసమీకరణ మాదిరిగానే రెవెన్యూ రికార్డుల ఆధారంగా గ్రామకంఠాలను నిర్ధారించడానికి జేసీ శ్రీధర్ మొదట ప్రణాళిక రూపొందించారు. పాతకాలం రికార్డుల్లో ఎలా ఉందో అలాగే గ్రామకంఠాన్ని ఖరారు చేయాలని ప్రయత్నించడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి గ్రామకంఠాలను ఇప్పుడు కూడా అలాగే ఎలా చూస్తారని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయని ఆయా గ్రామాలకు చెందినవారు వాదించారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాటిని మార్చాలని అధికారులు, మంత్రులను నిలదీశారు. చేసేదేమీ లేక మంత్రులు అందుకు అంగీకారం తెలిపినా గుంటూరు జిల్లా యంత్రాంగం ముందుకెళ్లకపోవడంతో కొద్దికాలం ఆ విషయం మరుగునపడింది. ఈలోపు రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ముంచుకురావడంతో స్థానికులు తమ సమస్యను పరిష్కరించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ సమయంలో జేసీ శ్రీధర్ విదేశీ పర్యటనలో ఉండడంతో మంత్రి నారాయణ ఆయన్ని ఉన్నపళాన వెనక్కి రప్పించి గ్రామకంఠాల నిర్ధారణను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన మళ్లీ అన్ని గ్రామాల్లో తిరిగి స్థానికుల అభ్యంతరాలకు అనుగుణంగా ఒక నివేదిక రూపొందించారు. అయితే అనూహ్యంగా సీఆర్డీఏ కమిషనర్ దాన్ని ఆమోదించలేదని తెలిసింది. మాస్టర్‌ప్లాన్ మార్పు సాధ్యం కాదంటూ... రాజధాని ప్రకటన తర్వాత అనేక మంది గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టారని, వాటన్నింటినీ ఇప్పుడు గ్రామకంఠాల పరిధిలోకి ఎలా చేరుస్తారని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రశ్నించడంతో వాటి నిర్ధారణ పెండింగ్‌లో పడిపోయింది. రాజధాని ప్రకటనకు ముందు డిసెంబర్ ఎనిమిదో తేదీ శాటిలైట్ చిత్రాల ఆధారంగా గ్రామకంఠాలను నిర్ధారించాలని ఆయన మొదటి నుంచి ప్రతిపాదిస్తున్నారు. అప్పటి చిత్రాలను బట్టి సింగపూర్ కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేశాయని, ఇప్పుడు గ్రామకంఠాలను మారిస్తే ప్లాన్‌ను మార్చాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదని ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. మంత్రుల సూచనల ప్రకారం స్థానిక పరిస్థితులను బట్టి తాను కొద్ది మార్పులతో నివేదిక రూపొందించానని, దానిపై ఇక తానేమీ చేయలేనని జేసీ చేతులెత్తేయడంతో మొన్నటివరకూ గ్రామకంఠాల వ్యవహారం ముందుకు కదల్లేదు. గ్రామకంఠాల వ్యవహారం మళ్లీ మొదటికేనా? ఈ నేపథ్యంలోనే ఇటీవల గుంటూరులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామకంఠాల విషయంపై సీఆర్డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం రూపొందించిన నివేదికల మధ్య తేడాలున్నాయని, వాటిని పరిష్కరిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ అధికారులిద్దరూ గ్రామాల్లో కలిసి తిరిగి ఒకే నివేదిక రూపొందించి గ్రామకంఠాలను నిర్ధారించాలని గట్టిగా చెప్పి ఆ విషయాన్ని మీడియాకు సైతం తెలిపారు. ఆ తర్వాత జేసీ శ్రీధర్ గ్రామాల్లో తిరుగుతున్నా కమిషనర్ మాత్రం దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ విషయం మళ్లీ మొదటికొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇసుక ధరలకు కళ్లెం
సాక్షి, గుంటూరు : ఇసుక కృత్రిమ కొరత, అధిక ధరలకు కళ్లెం వేసే దిశగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రత్యేక దృష్టి సారించారు. ఇసుక అక్రమ రవాణా, ధరల నియంత్రణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇసుక విధానంలో సమూల మార్పులకు జేసీ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఇసుక కొనుగోళ్లు పారదర్శకంగా ఉండేలా నవంబరు 26వ తేదీ నుంచి మీ-సేవకు అప్పగించారు. ఈ విధానం రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రారంభించారు. ఇసుక కావాలని బుక్ చేసుకోగానే కొనుగోలుదారు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా ఓ విధానానికి రూపకల్పన చేశారు. రీచ్ నుంచి ఇసుక లారీ బయలు దేరగానే కొనుగోలుదారు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. లారీ ఏ సమయంలోగా రానుందో, కొనుగోలుదారు ఇంటికి ఇసుక చేరిన తరువాత లారీ వచ్చినట్టుగా కూడా మెసేజ్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుక తవ్వే విధంగా మార్గదర్శకాలు రూపొందించారు. రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు. గతంలో గుంటూరులో 6 క్యూబిక్ మీటర్ల ఇసుక లారీ ధర రూ.15 వేలు ఉండగా దాన్ని ఇప్పుడు రూ. 6,412లకే కొనుగోలుదారుకు చేరేలా చర్యలు తీసుకొన్నారు. అలాగే ఇసుక కోసం లారీలు రీచ్‌ల వద్ద మూడురోజులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితిని అధిగమించి త్వరితగతిన నింపే ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఆరు ఇసుక రీచ్‌లు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తుండగా, మరో తొమ్మిది పాట ద్వారా నడుస్తున్నాయి. ఇవి కూడా జనవరి నెలాఖరుకు డ్వాక్రా సంఘాల పరిధిలోకి రానున్నాయి. రెండవ దశలో... ఇసుక కొత్త పాలసీని పటిష్టంగా అమలు చేసే చర్యల్లో భాగంగా జిల్లాలో ప్రయోగాత్మకంగా వేబ్రిడ్జిలు, తేమశాతం కొలిచే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నిర్ధేశించిన ప్రమాణాల్లో ఇసుక కొనుగోలుదారుకు చేరనుంది. ఇసుక రవాణా చేసే వాహనాలను జీపీఎస్ విధానానికి అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల ఇసుక లారీ ఎక్కడ ఉంది, నిర్ధేశిత మార్గంలో వస్తుందా లేదో కూడా తెలుసుకోవచ్చు. వాహనాన్ని దారి మళ్లిస్తే వెంటనే జిల్లా ఎస్పీ ,ఆర్డీఓకు మెసేజ్ వెళుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమవుతారు. ప్రస్తుతం రోజుకు జిల్లాలో దాదాపు 12వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయిస్తున్నారు. క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ. 650గా నిర్ణయించారు. ఇసుక బుక్ చేసుకొనేందుకు వీలుగా అన్ని వివరాలతో ప్రత్యేకంగా సమాచారాన్ని మీసేవా కేంద్రంలో పొందుపరిచారు. ఏవైనా సందేహాలు, ఫిర్యాదుల కోసం 18001212020 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇసుక ధరల నియంత్రణలో జేసీ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తనదైన శైలిలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.