సీఆర్‌డీఏ కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(ఏపీ సీఆర్‌డీఏ) కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్ నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న శ్రీధర్‌ను సీఆర్‌డీఏ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తు తం ఆ స్థానంలో ఉన్న నాగులాపల్లి శ్రీకాంత్‌ను సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మేరకు మొత్తం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ముదావతు ఎం.నాయక్‌ను తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(విశాఖపట్నం) సీఎండీగా బదిలీ చేశారు. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
శ్రీధర్ నియామకం చట్టం విరుద్ధం!
సాక్షి, విజయవాడ బ్యూరో: సీఆర్‌డీఏ కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్ నియామకం చట్టవిరుద్ధమని అధికార వర్గాల్లో గుప్పుమంటోంది. సీఆర్‌డీఏ కమిషనర్ (సీఈవో)గా నియమితుడయ్యే అధికారికి అంతకుముందు రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలని 2014 సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 21(1)లో స్పష్టంగా పేర్కొన్నారు. శ్రీధర్ ఇప్పటివరకూ కలెక్టర్‌గా పనిచేయలేదు. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా నేరుగా కమిషనర్‌గా నియమించింది. తాను రూపొందించిన చట్టంలోని నిబంధనలను తానే ఉల్లంఘించి శ్రీధర్‌కు సీఆర్‌డీఏ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది.
వాస్తవానికి నాగులపల్లి శ్రీకాంత్‌ను కమిషనర్‌గా నియమించినప్పుడే జూనియర్‌కు ఆ స్థాయి పోస్టింగ్ ఇవ్వడం ఏమిటని ఐఏఎస్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నియామకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏకంగా చట్టంలోనే ఒక నిబంధనను చేర్చింది. ఆయనకు కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో దాన్నే నిబంధనగా చేర్చింది. కానీ ఇప్పుడు దాన్ని ఉల్లంఘించి అంతకంటే జూనియర్ అధికారిని నియమించడం గమనార్హం.