శ్రీకాంత్ X శ్రీధర్ | Internal clashes between CRDA Commissioner and Guntur JC | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ X శ్రీధర్

Published Sun, Jan 31 2016 8:49 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

శ్రీకాంత్ X శ్రీధర్ - Sakshi

శ్రీకాంత్ X శ్రీధర్

  • గ్రామకంఠాలపై ఎవరి పట్టు వారిదే
  • జేసీ శ్రీధర్ నివేదికను పక్కన పెట్టిన సీఆర్‌డీఏ కమిషనర్
  • మాస్టర్‌ప్లాన్‌ను మార్చలేమంటున్న శ్రీకాంత్
  • కొలిక్కిరాని రాజధాని గ్రామకంఠాల నిర్ధారణ
  • విజయవాడ : రాజధాని గ్రామకంఠాల వ్యవహారం ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య చిచ్చు రేపింది. స్థానిక నాయకుల సూచనలకు అనుగుణంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వీటిపై నివేదిక తయారుచేయగా, మాస్టర్‌ప్లాన్‌ను మార్చేలా ఉన్న దీన్ని తానెలా ఆమోదిస్తానని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఎనిమిది నెలల నుంచి గ్రామకంఠాల నిర్ధారణ ఒక కొలిక్కి రాలేదు.
     
    మంత్రుల అంగీకారం మేరకు...

    భూసమీకరణ తర్వాత గ్రామకంఠాల నిర్ధారణ కోసం సీఆర్‌డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేశాయి. భూసమీకరణ మాదిరిగానే రెవెన్యూ రికార్డుల ఆధారంగా గ్రామకంఠాలను నిర్ధారించడానికి జేసీ శ్రీధర్ మొదట ప్రణాళిక రూపొందించారు. పాతకాలం రికార్డుల్లో ఎలా ఉందో అలాగే గ్రామకంఠాన్ని ఖరారు చేయాలని ప్రయత్నించడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి గ్రామకంఠాలను ఇప్పుడు కూడా అలాగే ఎలా చూస్తారని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయని ఆయా గ్రామాలకు చెందినవారు వాదించారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాటిని మార్చాలని అధికారులు, మంత్రులను నిలదీశారు. చేసేదేమీ లేక మంత్రులు అందుకు అంగీకారం తెలిపినా గుంటూరు జిల్లా యంత్రాంగం ముందుకెళ్లకపోవడంతో కొద్దికాలం ఆ విషయం మరుగునపడింది.
     
    ఈలోపు రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ముంచుకురావడంతో స్థానికులు తమ సమస్యను పరిష్కరించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ సమయంలో జేసీ శ్రీధర్ విదేశీ పర్యటనలో ఉండడంతో మంత్రి నారాయణ ఆయన్ని ఉన్నపళాన వెనక్కి రప్పించి గ్రామకంఠాల నిర్ధారణను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన మళ్లీ అన్ని గ్రామాల్లో తిరిగి స్థానికుల అభ్యంతరాలకు అనుగుణంగా ఒక నివేదిక రూపొందించారు. అయితే అనూహ్యంగా సీఆర్‌డీఏ కమిషనర్ దాన్ని ఆమోదించలేదని తెలిసింది.    
     
    మాస్టర్‌ప్లాన్ మార్పు సాధ్యం కాదంటూ...

    రాజధాని ప్రకటన తర్వాత అనేక మంది గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టారని, వాటన్నింటినీ ఇప్పుడు గ్రామకంఠాల పరిధిలోకి ఎలా చేరుస్తారని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రశ్నించడంతో వాటి నిర్ధారణ పెండింగ్‌లో పడిపోయింది. రాజధాని ప్రకటనకు ముందు డిసెంబర్ ఎనిమిదో తేదీ శాటిలైట్ చిత్రాల ఆధారంగా గ్రామకంఠాలను నిర్ధారించాలని ఆయన మొదటి నుంచి ప్రతిపాదిస్తున్నారు.  అప్పటి చిత్రాలను బట్టి సింగపూర్ కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేశాయని, ఇప్పుడు గ్రామకంఠాలను మారిస్తే ప్లాన్‌ను మార్చాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదని ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. మంత్రుల సూచనల ప్రకారం స్థానిక పరిస్థితులను బట్టి తాను కొద్ది మార్పులతో నివేదిక రూపొందించానని, దానిపై ఇక తానేమీ చేయలేనని జేసీ చేతులెత్తేయడంతో మొన్నటివరకూ గ్రామకంఠాల వ్యవహారం ముందుకు కదల్లేదు.
     
    గ్రామకంఠాల వ్యవహారం మళ్లీ మొదటికేనా?

    ఈ నేపథ్యంలోనే ఇటీవల గుంటూరులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామకంఠాల విషయంపై సీఆర్‌డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం రూపొందించిన నివేదికల మధ్య తేడాలున్నాయని, వాటిని పరిష్కరిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ అధికారులిద్దరూ గ్రామాల్లో కలిసి తిరిగి ఒకే నివేదిక రూపొందించి గ్రామకంఠాలను నిర్ధారించాలని గట్టిగా చెప్పి ఆ విషయాన్ని మీడియాకు సైతం తెలిపారు. ఆ తర్వాత జేసీ శ్రీధర్ గ్రామాల్లో తిరుగుతున్నా కమిషనర్ మాత్రం దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ విషయం మళ్లీ మొదటికొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement