N srikanth
-
శ్రీకాంత్ X శ్రీధర్
గ్రామకంఠాలపై ఎవరి పట్టు వారిదే జేసీ శ్రీధర్ నివేదికను పక్కన పెట్టిన సీఆర్డీఏ కమిషనర్ మాస్టర్‌ప్లాన్‌ను మార్చలేమంటున్న శ్రీకాంత్ కొలిక్కిరాని రాజధాని గ్రామకంఠాల నిర్ధారణ విజయవాడ : రాజధాని గ్రామకంఠాల వ్యవహారం ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య చిచ్చు రేపింది. స్థానిక నాయకుల సూచనలకు అనుగుణంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వీటిపై నివేదిక తయారుచేయగా, మాస్టర్‌ప్లాన్‌ను మార్చేలా ఉన్న దీన్ని తానెలా ఆమోదిస్తానని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఎనిమిది నెలల నుంచి గ్రామకంఠాల నిర్ధారణ ఒక కొలిక్కి రాలేదు. మంత్రుల అంగీకారం మేరకు... భూసమీకరణ తర్వాత గ్రామకంఠాల నిర్ధారణ కోసం సీఆర్డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేశాయి. భూసమీకరణ మాదిరిగానే రెవెన్యూ రికార్డుల ఆధారంగా గ్రామకంఠాలను నిర్ధారించడానికి జేసీ శ్రీధర్ మొదట ప్రణాళిక రూపొందించారు. పాతకాలం రికార్డుల్లో ఎలా ఉందో అలాగే గ్రామకంఠాన్ని ఖరారు చేయాలని ప్రయత్నించడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి గ్రామకంఠాలను ఇప్పుడు కూడా అలాగే ఎలా చూస్తారని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయని ఆయా గ్రామాలకు చెందినవారు వాదించారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాటిని మార్చాలని అధికారులు, మంత్రులను నిలదీశారు. చేసేదేమీ లేక మంత్రులు అందుకు అంగీకారం తెలిపినా గుంటూరు జిల్లా యంత్రాంగం ముందుకెళ్లకపోవడంతో కొద్దికాలం ఆ విషయం మరుగునపడింది. ఈలోపు రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ముంచుకురావడంతో స్థానికులు తమ సమస్యను పరిష్కరించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ సమయంలో జేసీ శ్రీధర్ విదేశీ పర్యటనలో ఉండడంతో మంత్రి నారాయణ ఆయన్ని ఉన్నపళాన వెనక్కి రప్పించి గ్రామకంఠాల నిర్ధారణను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన మళ్లీ అన్ని గ్రామాల్లో తిరిగి స్థానికుల అభ్యంతరాలకు అనుగుణంగా ఒక నివేదిక రూపొందించారు. అయితే అనూహ్యంగా సీఆర్డీఏ కమిషనర్ దాన్ని ఆమోదించలేదని తెలిసింది. మాస్టర్‌ప్లాన్ మార్పు సాధ్యం కాదంటూ... రాజధాని ప్రకటన తర్వాత అనేక మంది గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టారని, వాటన్నింటినీ ఇప్పుడు గ్రామకంఠాల పరిధిలోకి ఎలా చేరుస్తారని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రశ్నించడంతో వాటి నిర్ధారణ పెండింగ్‌లో పడిపోయింది. రాజధాని ప్రకటనకు ముందు డిసెంబర్ ఎనిమిదో తేదీ శాటిలైట్ చిత్రాల ఆధారంగా గ్రామకంఠాలను నిర్ధారించాలని ఆయన మొదటి నుంచి ప్రతిపాదిస్తున్నారు. అప్పటి చిత్రాలను బట్టి సింగపూర్ కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేశాయని, ఇప్పుడు గ్రామకంఠాలను మారిస్తే ప్లాన్‌ను మార్చాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదని ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. మంత్రుల సూచనల ప్రకారం స్థానిక పరిస్థితులను బట్టి తాను కొద్ది మార్పులతో నివేదిక రూపొందించానని, దానిపై ఇక తానేమీ చేయలేనని జేసీ చేతులెత్తేయడంతో మొన్నటివరకూ గ్రామకంఠాల వ్యవహారం ముందుకు కదల్లేదు. గ్రామకంఠాల వ్యవహారం మళ్లీ మొదటికేనా? ఈ నేపథ్యంలోనే ఇటీవల గుంటూరులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామకంఠాల విషయంపై సీఆర్డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం రూపొందించిన నివేదికల మధ్య తేడాలున్నాయని, వాటిని పరిష్కరిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ అధికారులిద్దరూ గ్రామాల్లో కలిసి తిరిగి ఒకే నివేదిక రూపొందించి గ్రామకంఠాలను నిర్ధారించాలని గట్టిగా చెప్పి ఆ విషయాన్ని మీడియాకు సైతం తెలిపారు. ఆ తర్వాత జేసీ శ్రీధర్ గ్రామాల్లో తిరుగుతున్నా కమిషనర్ మాత్రం దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ విషయం మళ్లీ మొదటికొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రగతిపథంలో ముందుకు సాగుదాం
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నెల్లూరులోని పోలీసుపరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో లక్షా 13 వేల కుటుంబాలకు రేషన్‌కార్డులు, 30 వేల మందికి పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. ఏడో విడత కార్యక్రమంలో భాగంగా 4,212 మందికి 5,189 ఎకరాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. రబీ సీజన్లో రైతులకు పంట రుణాలుగా రూ.1,520 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సాగురైతు రక్షణ హస్తం పథకం కింద జిల్లాలో ఈ ఏడాది లక్ష మంది రైతులకు రూ.100 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. ఇప్పటివరకు వడ్డీ లేని రుణంగా రూ.5.28 కోట్లు మంజూరు చేశామన్నారు. పావలా వడ్డీ పథకం కింద రూ.1.83 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. పశుక్రాంతి పథకం కింద రూ.5.25 కోట్ల విలువైన పాడి సంపదను రైతులకు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ పథకం కింద రూ.433 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.139.14 కోట్లు రుణం అందజేశామన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా 2,408 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. ఎస్సీ,ఎస్టీలకు చెందిన 22 వేల ఎకరాల భూమిని ఇందిర జలప్రభ పథకం కింద అభివృద్ధి చేశామన్నారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియాన్ని రూ.48.55 కోట్లతో ఆధునికీకరించడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో మినీస్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా 17 మెగా ప్రాజెక్టులను ప్రారంభించి, 35,910 మందికి ఉపాధి కల్పించామన్నారు. ఉపకరణాల పంపిణీ డీఆర్డీఏ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, ఐకేపీ, ఐటీడీఏ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రూ.3,61,336 విలువైన ఉపకరణాలు పంపిణీ చేశారు. 948 స్వయం సహాయక సంఘాలకు రూ.25.10 కోట్ల బ్యాంకు లింకేజీ రుణం, 20 చిన్నారులకు బంగారుతల్లి పథకం ద్వారా రూ.50 వేలు చొప్పున ప్రోత్సాహకం అందజేశారు. రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా 60 మంది ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ లక్ష్మీకాంతం, ఏజేసీ పెంచలరెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, మధుసూదన్‌రావు, రమణ తదితరులు పాల్గొన్నారు.