నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నెల్లూరులోని పోలీసుపరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో లక్షా 13 వేల కుటుంబాలకు రేషన్‌కార్డులు, 30 వేల మందికి పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. ఏడో విడత కార్యక్రమంలో భాగంగా 4,212 మందికి 5,189 ఎకరాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. రబీ సీజన్‌లో రైతులకు పంట రుణాలుగా రూ.1,520 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సాగురైతు రక్షణ హస్తం పథకం కింద జిల్లాలో ఈ ఏడాది లక్ష మంది రైతులకు రూ.100 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. ఇప్పటివరకు వడ్డీ లేని రుణంగా రూ.5.28 కోట్లు మంజూరు చేశామన్నారు. పావలా వడ్డీ పథకం కింద రూ.1.83 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. పశుక్రాంతి పథకం కింద రూ.5.25 కోట్ల విలువైన పాడి సంపదను రైతులకు పంపిణీ చేశామన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ పథకం కింద రూ.433 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.139.14 కోట్లు రుణం అందజేశామన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా 2,408 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. ఎస్సీ,ఎస్టీలకు చెందిన 22 వేల ఎకరాల భూమిని ఇందిర జలప్రభ పథకం కింద అభివృద్ధి చేశామన్నారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియాన్ని రూ.48.55 కోట్లతో ఆధునికీకరించడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో మినీస్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా 17 మెగా ప్రాజెక్టులను ప్రారంభించి, 35,910 మందికి ఉపాధి కల్పించామన్నారు.
ఉపకరణాల పంపిణీ
డీఆర్‌డీఏ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, ఐకేపీ, ఐటీడీఏ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రూ.3,61,336 విలువైన ఉపకరణాలు పంపిణీ చేశారు. 948 స్వయం సహాయక సంఘాలకు రూ.25.10 కోట్ల బ్యాంకు లింకేజీ రుణం, 20 చిన్నారులకు బంగారుతల్లి పథకం ద్వారా రూ.50 వేలు చొప్పున ప్రోత్సాహకం అందజేశారు. రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా 60 మంది ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ లక్ష్మీకాంతం, ఏజేసీ పెంచలరెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, మధుసూదన్‌రావు, రమణ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతిపథంలో ముందుకు సాగుదాం
Published Sat, Nov 2 2013 5:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement