తుపాను బాధితులకు మరింత మిరప పొడి
గుంటూరు ఈస్ట్: హుదూద్ తుపాను బాధితులకు మరో 235 టన్నుల మిరప పొడిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటివరకు 415 టన్నుల మిరప పొడిని విశాఖపట్నానికి తరలించామని చెప్పారు. సోమవారం మూడు ట్రక్కుల్లో కూర గాయలు పంపామని చెప్పారు.
మంగళవారం సాయంత్రానికి మరో నాలుగు ట్రక్కుల్లో కూరగాయలు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అందిన వెంటనే సరఫరా చేసేందుకు కందిపప్పును సిద్ధం చేయూలని సూచించారు. పంపిన సరుకులు విశాఖలోని సంబంధిత శాఖలకు అందాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. తుపాను బాధితుల కోసం సహాయ సామగ్రిని పంపుతున్న సంస్థలు, సంఘాలు, వ్యక్తులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్, డీఆర్వో నాగబాబు, ఆర్డీవోలు, జిల్లా స్థారుు అధికారులు పాల్గొన్నారు.