- 13న రాజధాని గ్రామాల్లో పర్యటించే అవకాశం
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంత గ్రామాల్లో జరుగుతున్న భూసమీకరణ తీరును సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేలు గురువారం రాత్రి గుంటూరులోని జిల్లా పరిషత్ సభా భవనంలో సమీక్షించారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో ఈ నెల 13న సీఎం పర్యటించే అవకాశం ఉందనీ, ఆ లోపు భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనీ ఆదేశించారు.
సీఎం ప్రతిరోజూ సంబంధిత అధికారులతో నేరుగా ఉదయం 9.30 నుంచి 10 గంటలలోపు మాట్లాడే అవకాశముందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. సమాచారాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి రెండ్రోజులకో మారు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందనీ ఫోన్‌లు ఎవరూ స్విచ్ ఆఫ్ చేయకుండా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇలావుండగా రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలు కొన్నిచోట్ల తక్కువగా రావడం, మరికొన్నిచోట్ల అసలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై కమిషనర్, కలెక్టర్లు ఆరా తీశారు.
ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజూ 100 నుంచి 200 ఎకరాలకు తగ్గకుండా రైతులను చైతన్యవంతుల్ని చేసి అంగీకారపత్రాలు స్వీకరించాలని సూచించారు. గ్రామాల్లో రైతుల ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత నోటీసులు అందజే యాలన్నారు. ఇతరప్రాంతాల్లో ఉన్నవారు అఫిడవిట్లు, తమ హక్కు పత్రాలను ఆన్‌లైన్‌లో ఉంచినా సరిపోతుందని చెప్పారు.
అందిన దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 11 నుంచి ఎంజాయ్‌మెంట్ సర్వేను నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన ప్రచారం నిమిత్తం పెద్దపెద్ద ఫ్లెక్సీలను, బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లిలో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదని వెంటనే ప్రారంభమయ్యే దిశగా అధికారులను నియమిస్తామన్నారు.
సీఆర్‌డీఏ టోల్ ఫ్రీ నంబర్
రైతులకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు సీఆర్‌డీఏ టోల్ ఫ్రీ నంబర్ 18004258988 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూ సమీకరణకు సంబంధించి మొత్తం 25 ఎస్‌డీసీ కార్యాలయాలను గుంటూరు మార్కెట్ యార్డులోని మార్కెటింగ్ శాఖ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.