bhusamikarana
-
ప్రజలను నిర్వాసితులను చేస్తే సహించం
- రైతులు, ప్రజల పొట్టగొట్టే ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమం - బందరులో జరిగే ఉద్యమాలకు అండగా ఉంటాం - పది వామపక్ష పార్టీల సమావేశ నిర్ణయం సాక్షి, విజయవాడ: బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమి సమీకరించేలా సోమవారం నోటిఫికేషన్ జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పది వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తీరప్రాంతంలోని మత్స్యకారులు, రైతులు, ప్రజల జీవనాన్ని దెబ్బతీసే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. భూమిని కాపాడుకునేందుకు బందరు ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు జరిపే ఉద్యమాలకు బాసటగా నిలవాలని నిర్ణయించారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకుడు గుర్ర విజయ్‌కుమార్ అధ్యక్షతన పది కమ్యూనిస్టు పార్టీల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. సమావేశ నిర్ణయాలను పది వామపక్షపార్టీల నేతలు పత్రికలకు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణం వల్ల రాష్ర్ట ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఈ నెల 17న విశాఖలో నిర్వహించనున్న జాతీయ సెమినార్‌పై ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను పోలీసులను అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక వాదులంతా నిరసించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. విశాఖలో అరెస్టు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ నర్శింగరావు, నగర కార్యదర్శి బి.గంగారావులతో పాటు 26మంది నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని, పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రచార వాహనాన్ని వెంటనే విడిచిపెట్టాలని కోరారు. సమావేశంలోపి.మధు, వై.వెంకటేశ్వర్లు(సీపీఎం), కె.రామకృష్ణ, ముప్పాళ్లనాగేశ్వరరావు, జెల్లివిల్సన్(సీపీఐ), పి.ప్రసాద్, యు.వెంకటేశ్వర్లు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), హరినాథ్, సత్యనారాయణ(సీపీఐఎంఎల్-లిబరేషన్), పి.రామారావు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), పి.సుందరామరాజు, అజీం పాషా, సుభాష్ చంద్రారెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), కిషోర్(సీపీఐఎంఎల్) హాజరయ్యారు. -
నేరుగా రంగంలోకి బాబు..!
13న రాజధాని గ్రామాల్లో పర్యటించే అవకాశం సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంత గ్రామాల్లో జరుగుతున్న భూసమీకరణ తీరును సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేలు గురువారం రాత్రి గుంటూరులోని జిల్లా పరిషత్ సభా భవనంలో సమీక్షించారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో ఈ నెల 13న సీఎం పర్యటించే అవకాశం ఉందనీ, ఆ లోపు భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనీ ఆదేశించారు. సీఎం ప్రతిరోజూ సంబంధిత అధికారులతో నేరుగా ఉదయం 9.30 నుంచి 10 గంటలలోపు మాట్లాడే అవకాశముందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. సమాచారాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి రెండ్రోజులకో మారు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందనీ ఫోన్లు ఎవరూ స్విచ్ ఆఫ్ చేయకుండా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇలావుండగా రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలు కొన్నిచోట్ల తక్కువగా రావడం, మరికొన్నిచోట్ల అసలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై కమిషనర్, కలెక్టర్లు ఆరా తీశారు. ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజూ 100 నుంచి 200 ఎకరాలకు తగ్గకుండా రైతులను చైతన్యవంతుల్ని చేసి అంగీకారపత్రాలు స్వీకరించాలని సూచించారు. గ్రామాల్లో రైతుల ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత నోటీసులు అందజే యాలన్నారు. ఇతరప్రాంతాల్లో ఉన్నవారు అఫిడవిట్లు, తమ హక్కు పత్రాలను ఆన్లైన్లో ఉంచినా సరిపోతుందని చెప్పారు. అందిన దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 11 నుంచి ఎంజాయ్మెంట్ సర్వేను నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన ప్రచారం నిమిత్తం పెద్దపెద్ద ఫ్లెక్సీలను, బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లిలో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదని వెంటనే ప్రారంభమయ్యే దిశగా అధికారులను నియమిస్తామన్నారు. సీఆర్డీఏ టోల్ ఫ్రీ నంబర్ రైతులకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు సీఆర్డీఏ టోల్ ఫ్రీ నంబర్ 18004258988 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూ సమీకరణకు సంబంధించి మొత్తం 25 ఎస్డీసీ కార్యాలయాలను గుంటూరు మార్కెట్ యార్డులోని మార్కెటింగ్ శాఖ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘దేశం' దౌర్జన్యం
అరండల్‌పేట(గుంటూరు)/తుళ్లూరు: తుళ్లూరులో శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై దౌర్జన్యానికి దిగారు. అదేమంటే రాజధాని రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తాము తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, భూ సమీకరణలో నష్టపోతున్న వారికి అండగా ఉండేందుకే సభ నిర్వహిస్తున్నామని వామ పక్ష నాయకులు చెబుతున్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్ర వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్‌పార్టీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులపై దాడులకు దిగినట్టుగానే పది వామ పక్ష నాయకుల సభను అడ్డుకున్నారు. తుళ్లూరులో శుక్రవారం పది వామపక్షాల నాయకులు నిర్వహించిన బహిరంగసభను అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. అడుగడుగునా సభకు ఆటంకాలు కల్పించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయినా సభను నిర్వహిస్తుండటంతో ఓర్చుకోలేని కార్యకర్తలు వామపక్షాల నాయకులు గోబ్యాక్ అంటూ ఒక్కసారిగా సభావేదిక వద్దకు వచ్చారు. చంద్రబాబునాయుడు జిందాబాద్, టీడీపీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. వారిని వామపక్షాల నాయకులు సైతం ప్రతిఘటించారు. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగారు. అప్పటి వరకు అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కనిపించకుండా పోయారు. గొడవ పెద్దది కావడంతో ఎస్ఐతో పాటు మరికొద్ది మంది పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమివేశారు. మధ్యలోనే వామపక్షాల నాయకులు సభను ముగించి వెళ్లిపోయారు. తుళ్లూరులో ఇతర పార్టీ నాయకులపై వరసగా దాడులు జరుగుతున్నా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ సభ నిర్వహణపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ముందస్తు అనుమతి సైతం తీసుకోలేదని చెబుతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రంగా స్పందించారు. తాము ఇక్కడ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని చెబుతున్నా దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దాడులను తాము ఎన్నో చూశామని, కూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేయడం తప్పు ఎలా అవుతుందన్నారు. కొంతమంది నాయకులతో చంద్రబాబు ఇలా చేయిస్తున్నారని ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాజధాని భూసమీకరణలో నష్టపోతున్న కౌలురైతులు, కూలీలు, చేతివృత్తుల వారికి చట్టప్రకారం రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేకుంటే ప్రజాపోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు సొంత వ్యవహారంలా రాజధాని అంశం మారిపోయిందన్నారు. ప్రజలతో, ప్రతిపక్షాలతో చర్చించకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని కోసం నిధుల సమీకరణకు చంద్రబాబు మన దేశ ప్రధాని వద్దకు వెళ్లకుండా సింగపూర్ ప్రధాని వద్దకు ఎందుకు వెళ్లారన్నారని ప్రశ్నించారు. ఇక్కడ సేకరించే 30వేల ఎకరాల్లో 6 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీకి అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా 30వేల ఎకరాల్లో రాజధానిని నిర్మించలేదన్నారు. ఒక విధానపత్రం విడుదల చేయకుండా ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు, రైతుకూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడేందుకు పోరాటాలు చేస్తామన్నారు. తిరిగి మరోసారి తుళ్లూరు వస్తామాన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ విల్సన్, వామపక్షాల నాయకులు కోటయ్య, రమాదేవి, హరనాధ్, గుర్రం విజయ్‌కుమార్, సింహాద్రి లక్ష్మీనారాయణ, తూమాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
రగిలిన రాయపూడి రణరంగం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణను రాయపూడి గ్రామస్తులు మరో మారు వ్యతిరేకించారు. ఆది నుంచి చెబుతున్నట్టుగానే భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి తుళ్లూరు రైతులు రావడాన్ని ఆక్షేపించారు. ఈ సందర్భంగా రాజుకున్న వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఆగ్రహావేశాలకు లోనైన రెండు గ్రామాల రైతులు ఓ దశలో కుర్చీలు పడదోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు సవాళ్లు ప్రతిసవాళ్ళతో సమావేశం దద్దరిల్లింది. రంగంలోకి దిగిన పోలీసులను చూసి మరింత కోపోద్రిక్తులయ్యారు. పోలీసు బలగాలతో రావాల్సిన అవసరం ఏంటని నిలిదీశారు. రైతుల అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పనివ్వరా? పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారా అంటూ ఒక్కసారిగా రైతులు తిరగబడటంతో వారిని బుజ్జగించడం కమిటీ సభ్యుల వల్ల కాలేదు. దీంతో నన్నపనేని రాజకుమారి అర్ధంతరంగా సమావేశం నుంచి నిష్ర్కమిం చారు. చివరకు పోలీసులను బయటకు పంపినా గ్రామస్తులు శాంతించలేదు. 4రాజధాని భూ సమీకరణకు మంత్రివర్గ ఉపసంఘం శనివారం రాయపూడిరైతులతో సమావేశమయ్యారు. కమిటీ సభ్యుడు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు. 4రాయపూడి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మల్లెల హరేంధ్రనాధ్ చౌదరి నేతృ త్వంలో గ్రామ రైతులు భూములిచ్చేందుకు ససేమిరా వీల్లేదని తేల్చి చెప్పారు. మొన్న మందడంలో రైతులు తిరుగుబాటు చేసినట్టే ఇక్కడా రైతులు సమీకరణను వ్యతిరేకించారు. ప్రజాప్రతినిధులు,అధికారులను నిలదీశారు. 4హరేంధ్రనాధ్ చౌదరి మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి రాయపూడి గ్రా మం నుంచి ఒక్క గజం భూమి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తమ సొసైటీ తరఫున 1100 మంది రైతుల సంతకాలతో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వెల్లడించారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా ఇస్తామని ముందుకు వస్తే నిరభ్యం తరంగా తీసుకోవచ్చని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. 4దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో రైతులను ఒప్పించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మరోమారు కలుస్తామని, భూములు ఇవ్వడానికి ఎందుకు నిరాకరి స్తున్నారో తమకు చెబితే అదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పి బయలుదేరారు. టీడీపీ కార్యకర్తల దాడులు, హెచ్చరికలు... 4భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాలపై టీడీపీ కార్యకర్తల దాడులు, హెచ్చరికలు పెరిగిపోయాయి. భూ సమీ కరణ చేపట్టిన గ్రామాల్లో ప్రజా సంఘాల పర్యటనలకు ఆటంకాలు కలిగిస్తున్నారు. కరపత్రాల పంపిణీని అడ్డుకుంటున్నారు. 4వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ మినహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ,సీపీఐ (ఎంఎల్- న్యూ డెమొక్రసీ) నేతలు, కార్యకర్తల పర్యటనలకు ఆటంకాలు కలిగించారు. 4నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య ఇతర నాయకులు తుళ్లూరులో రైతుల అభిప్రాయ సేకరణకు చేసిన ప్రయత్నాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 4మండల కేంద్రమైన తుళ్లూరులో శనివారం సీపీఐ (ఎంఎల్- న్యూ డెమొక్రసీ) కార్యకర్తలు భూసమీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తుండగా, టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అడ్డుకున్నారు. ఆ కార్యకర్తల వాహనం గాలి తీశారు. 4కరపత్రాలు పంపిణీ చేయడానికి వీలులేదని కార్యకర్తలను దుర్భాషలాడినట్లు పార్టీ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు తెలిపారు. దాడిచేయడాన్ని హేయమైన చర్యగా ఖండించారు.