రగిలిన రాయపూడి రణరంగం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణను రాయపూడి గ్రామస్తులు మరో మారు వ్యతిరేకించారు. ఆది నుంచి చెబుతున్నట్టుగానే భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి తుళ్లూరు రైతులు రావడాన్ని ఆక్షేపించారు. ఈ సందర్భంగా రాజుకున్న వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఆగ్రహావేశాలకు లోనైన రెండు గ్రామాల రైతులు ఓ దశలో కుర్చీలు పడదోసుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు సవాళ్లు ప్రతిసవాళ్ళతో సమావేశం దద్దరిల్లింది. రంగంలోకి దిగిన పోలీసులను చూసి మరింత కోపోద్రిక్తులయ్యారు. పోలీసు బలగాలతో రావాల్సిన అవసరం ఏంటని నిలిదీశారు. రైతుల అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పనివ్వరా? పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారా అంటూ ఒక్కసారిగా రైతులు తిరగబడటంతో వారిని బుజ్జగించడం కమిటీ సభ్యుల వల్ల కాలేదు. దీంతో నన్నపనేని రాజకుమారి అర్ధంతరంగా సమావేశం నుంచి నిష్ర్కమిం చారు. చివరకు పోలీసులను బయటకు పంపినా గ్రామస్తులు శాంతించలేదు.
4రాజధాని భూ సమీకరణకు మంత్రివర్గ ఉపసంఘం శనివారం రాయపూడిరైతులతో సమావేశమయ్యారు. కమిటీ సభ్యుడు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.
4రాయపూడి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మల్లెల హరేంధ్రనాధ్ చౌదరి నేతృ త్వంలో గ్రామ రైతులు భూములిచ్చేందుకు ససేమిరా వీల్లేదని తేల్చి చెప్పారు. మొన్న మందడంలో రైతులు తిరుగుబాటు చేసినట్టే ఇక్కడా రైతులు సమీకరణను వ్యతిరేకించారు. ప్రజాప్రతినిధులు,అధికారులను నిలదీశారు.
4హరేంధ్రనాధ్ చౌదరి మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి రాయపూడి గ్రా మం నుంచి ఒక్క గజం భూమి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తమ సొసైటీ తరఫున 1100 మంది రైతుల సంతకాలతో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వెల్లడించారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా ఇస్తామని ముందుకు వస్తే నిరభ్యం తరంగా తీసుకోవచ్చని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
4దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో రైతులను ఒప్పించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మరోమారు కలుస్తామని, భూములు ఇవ్వడానికి ఎందుకు నిరాకరి స్తున్నారో తమకు చెబితే అదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పి బయలుదేరారు.
టీడీపీ కార్యకర్తల దాడులు, హెచ్చరికలు...
4భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాలపై టీడీపీ కార్యకర్తల దాడులు, హెచ్చరికలు పెరిగిపోయాయి. భూ సమీ కరణ చేపట్టిన గ్రామాల్లో ప్రజా సంఘాల పర్యటనలకు ఆటంకాలు కలిగిస్తున్నారు. కరపత్రాల పంపిణీని అడ్డుకుంటున్నారు.
4వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ మినహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ,సీపీఐ (ఎంఎల్- న్యూ డెమొక్రసీ) నేతలు, కార్యకర్తల పర్యటనలకు ఆటంకాలు కలిగించారు.
4నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య ఇతర నాయకులు తుళ్లూరులో రైతుల అభిప్రాయ సేకరణకు చేసిన ప్రయత్నాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
4మండల కేంద్రమైన తుళ్లూరులో శనివారం సీపీఐ (ఎంఎల్- న్యూ డెమొక్రసీ) కార్యకర్తలు భూసమీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తుండగా, టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అడ్డుకున్నారు. ఆ కార్యకర్తల వాహనం గాలి తీశారు.
4కరపత్రాలు పంపిణీ చేయడానికి వీలులేదని కార్యకర్తలను దుర్భాషలాడినట్లు పార్టీ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు తెలిపారు. దాడిచేయడాన్ని హేయమైన చర్యగా ఖండించారు.