పోలవరం :రాజధాని నిర్మాణం పేరిట గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంత రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటున్నట్టుగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకం విషయంలోనూ అధికారులు వ్యవహరిస్తారా.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి జలాలను కృష్ణా జిల్లాకు తరలించుకుపోతారా.. అదే జరిగితే భూములను.. జల వనరులను ఎలా కాపాడుకోవాలనే ప్రశ్నలు పోలవరం ప్రాంత రైతులను, ప్రజలను వేధిస్తున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల భూములు కోల్పో యే రైతులైతే ఏం చేయాలో తెలియక దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఉభయగోదావరి జిల్లాల్లోని రైతులు, రైతు సంఘాల నాయకులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టిసీమ వద్ద ఎత్తిపోతలు నిర్మించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది.
ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మించి తీరుతుందని, ఇందుకు అవసరమైన భూములను ఇక్కడి రైతులు లీజుకు ఇస్తే సరేసరి, లేదంటే భూసేకరణ చట్టాన్ని అనుసరించి కచ్చితంగా తీసేసుకుంటామని కలెక్టర్ కె.భాస్కర్ స్పష్టం చేశారు. భూములను లీజుకివ్వడమా లేక భూసేకరణ ద్వారా ప్రభుత్వానికి అప్పగించడమా అనే విషయమై రైతులే చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఇక్కడి రైతుల్లో భయాందోళనలు తీవ్రమయ్యాయి. వివిధ పథకాల వల్ల రైతులు ఇప్పటికే భూములు కోల్పోయారు. వారివద్ద కొద్దిపాటి భూమి మాత్రమే మిగి లింది. ఆ భూముల్లో వరి, చెరకు, పత్తి, కూరగాయలు, కొబ్బరి తోటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి మిగిలిన ఆ కొద్దిపాటి భూమిని కూడా ప్రభుత్వం లాగేసుకుంటే రైతు కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. విధిలేని పరిస్థితుల్లో భూములను కాపాడుకునేందుకు ప్రభుత్వంపై పోరాడటం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదనేది ఇక్కడి రైతుల అంతరంగం.
ఈ పథకం వల్ల కోల్పోయే భూములు సారవంతమైనవి, ఎంతో విలువైనవి కావడంతో వీరి ఆవేదనకు అంతులేకుండా పోతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ భూములకు మరింత విలువ పెరుగుతుందని ఆశించారు. ఊహించని విధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం రూపంలో భూములు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. పట్టిసీమ వల్ల ఎవరి భూములు పోతాయో స్పష్టత లేకపోవడంతో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పథకం పేరుచెప్పి పట్టిసీమ, బంగారమ్మపేట, కృష్ణారావుపేట, పోలవరం ప్రాంతాల్లోని రైతుల ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు పట్టిసీమకు చెందిన తానా వెంకటేశ్వరరావు అనే రైతు కుటుంబ సభ్యులందరికీ చెందిన భూమి ఈ ప్రాంతంలోనే ఉంది. అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లకు సంబంధించి ఎకరం లేదా రెండెకరాల భూమి చొప్పున ఇక్కడ ఉంది. ఈ భూములు కోల్పోతే ఆ కుటుంబాలన్నీ జీవనాధారం కోల్పోతాయి. ఈ పరిస్థితుల్లో భూముల్ని కాపాడుకునేందుకు తామంతా పోరుబాట పట్టక తప్పదని తానా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తమ కుటుంబాలు వీధిన పడకుండా కాపాడుకునేందుకు భూములు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు కప్పల రామచంద్రరావు, తానా శ్రీనివాస్, తెలగంశెట్టి సూర్యచంద్రరావు అంటున్నారు.
మెతుకు లాగేసుకుంటే.. బతుకేం కావాలి!
Published Wed, Mar 4 2015 1:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement