రోడ్ల నిర్మాణానికి ఊళ్లను ఖాళీ చేయం
తేల్చిచెబుతున్న రాజధాని ప్రాంత ప్రజలు
రెట్టింపు పరిహారం ఇస్తామంటూ మంత్రుల హామీ
రాజధాని ప్రాంత ప్రజలతో భేటీ కావాలని సీఎం నిర్ణయం!
విజయవాడ
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే వరకు గ్రామాల జోలికి వెళ్లేది లేదని నమ్మించారు. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవేల పేరిట ఇళ్లను పెకలించి గ్రామాలనే ఖాళీ చేయించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచిన రాష్ట్ర సర్కారు తీరుపై రాజధాని గ్రామాల ప్రజలు రగిలిపోతున్నారు. వారిని మభ్యపెట్టేందుకు మంత్రులు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ప్రభుత్వమే రాజధాని ప్రాంత గ్రామాల ప్రజల బతుకులను రోడ్డుపాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, రహదారుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూములివ్వని గ్రామాల మధ్య నుంచి హైవేలను ప్రతిపాదించడంతో ఊళ్లకు ఊళ్లే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 200 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేతోపాటు 165 అడుగుల వెడల్పుతో డౌన్‌టౌన్, రహదారులు, 80 అడుగుల వెడల్పుతో రోడ్లను ప్రతిపాదించారు. రాజధానిలోని ఎక్స్‌ప్రెస్ హైవేకు మిగిలిన రోడ్లను అనుసంధానం చేస్తారు.
నిరాశ్రయులను చేస్తారా?
ప్రతీ గ్రామంలో కనీసం మూడు నుంచి నాలుగు రోడ్లను ప్రతిపాదించడంతో ఊళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ల్యాండ్ పూలింగ్‌ను ప్రతిఘటించిన ఉండవల్లి, కృష్ణాయపాలెం, నౌలూరు, నిడమర్రు గ్రామాలతోపాటు అసలు రాజధాని ప్రాంతంలో లేని తాడేపల్లి గ్రామానికి కూడా నష్టం వాటిల్లనుంది. కృష్ణాయపాలెం గ్రామకంఠం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. యర్రబాలెం, ఐనవోలు, వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి గ్రామాలకు రోడ్ల దెబ్బ తప్పదు. ఇప్పటికే భూములు లాగేసుకున్న ప్రభుత్వ రోడ్ల నిర్మాణం పేరిట తమను నిరాశ్రయులను చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.
డిజైన్ల మార్పునకు సీఎం ససేమిరా
రాజధానిలో ప్రతిపాదిత రోడ్ల పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, కొన్ని రోడ్ల డిజైన్లు మారిస్తే బాగుంటుందనే మంత్రుల సూచనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమిరా అన్నారు. రోడ్ల ప్రతిపాదనలపై రాజధాని ప్రాంత ప్రజలతో త్వరలో భేటీ కావాలని ఆయన నిర్ణయంచినట్లు సమాచారం.
మంత్రుల బుజ్జగింపులు
రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఇళ్ల తొలగింపు, స్థల సేకరణ విషయంలో ప్రజలను బుజ్జగించేందుకు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఐనవోలు గ్రామాల్లో పర్యటించిన మంత్రులు ప్రజల నిరసనలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కంటే రెట్టింపు ప్యాకేజీ ఇస్తామని, ఇల్లుకు ఇల్లు, స్థలానికి స్థలం ఇచ్చేలా చూస్తామని మంత్రులు హామీలిస్తున్నారు. ఇప్పటికే సాగు భూములు వదులుకున్నామని, ఇళ్లను కూడా వదులుకోవాలంటే అందుకు సిద్ధంగాలేమని రాజధాని ప్రాంత వాసులు తెగేసి చెబుతున్నారు.