విమానాశ్రయాలపేరుతో భూదందా | Airports Name With Land danda | Sakshi
Sakshi News home page

విమానాశ్రయాలపేరుతో భూదందా

Published Tue, Sep 8 2015 2:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

విమానాశ్రయాలపేరుతో భూదందా - Sakshi

విమానాశ్రయాలపేరుతో భూదందా

కార్పొరేట్లకు అనుకూలంగా వైమానిక విధానం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల పంటభూములు లాక్కొని రైతుల పొట్టగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల పేరుతో సరికొత్త భూదందాకు తెరలేపింది.నిరుపేదల భూములను లాక్కొని ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలకే అంతర్జాతీయ విమానాశ్రయాల కోసమంటూ వైమానిక విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం వేల ఎకరాలు సేకరిస్తామని ఒకసారి, సమీకరిస్తామని మరోసారి చెప్పుకుంటూ వచ్చింది.

దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో భూ సేకరణ ఆర్డినెన్స్‌పై కేంద్రం వెనక్కి తగ్గినా... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం  గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో 5,311 ఎకరాలు, చిత్తూరుజిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో 1,398 ఎకరాలు, కర్నూలుజిల్లా ఓర్వకల్లు, నెల్లూరుజిల్లా దగదర్తిలో 3,407 ఎకరాలు పేదల భూములు కాజేసేందుకు సిద్ధమైంది.

అందులో భాగంగానే భూసేకరణ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగుస్తున్న చివరిరోజు ఆగస్టు 31వ తేదీన ఆఘమేఘాలపై భోగాపురం ఎయిర్‌పోర్టుకు 5,311 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవన్నీ చిన్న, సన్నకార రైతుల భూములే కావడం గమనార్హం.
కార్పొరేట్లకే ప్రయోజనాలు...: రాష్ట్ర ప్రభుత్వం వైమానిక విధానం పేరుతో విడుదల చేసిన విధానపత్రం పూర్తిగా కార్పొరేట్ సంస్థల ప్రయోజకారిగానే ఉంది. ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికి పేదల నుంచి భూములు లాక్కుని, అవసరమైన కేంద్ర అనుమతులన్నీ ప్రభుత్వమే ఇప్పిస్తుంది. అన్నీ సమకూరాక భూములన్నీ బిడ్డర్‌కు అప్పగిస్తుంది. ఇక బిడ్డర్‌దే పెత్తనం. ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన, ముడుపులు ఇచ్చినవారికే ఈ ప్రాజెక్టుకు కట్టబెట్టడానికి బిడ్డర్‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కట్టబెట్టబోతోంది.

అది జపాన్‌కు చెందిన సంస్థ కావచ్చు. సింగపూర్ బిడ్డరయినా కావచ్చు. అందుకు వీలుగానే విధాన పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించారు. గుజరాత్ వైమానిక విధానంలోనూ ఇంత దారుణ పరిస్థితి లేదు. ఆ రాష్ట్రంలో వైమానిక విద్య లేదా సంబంధిత కార్యకలాపాలకు వాడే భూమిని ఆయా సంస్థలకు శాశ్వతంగా బదలాయించకుండా గరిష్టంగా 35 ఏళ్లు వినియోగించుకునే హక్కు మాత్రమే ఇచ్చారు. ‘ఎ’ కేటగిరి అయితే నెలకు రూ.లక్ష రుసుముతోపాటు లాభంలో 12శాతం వాటా... ‘బి’ కేటగిరి అయితే రూ.35 వేల రుసుముతోపాటు లాభంలో ఆరు శాతం ప్రభుత్వపరం చేయాలనే నిబంధన విధించారు.

ఈ రేటును  ఐదేళ్లకోసారి పెంచుతామని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విమానయాన సంస్థలు నిర్వహించే సర్వీసులపైనా షరతులు పెట్టా రు.అంతకు తగ్గితే రాయితీలు కత్తిరిస్తామని, జరిమానా వేస్తామన్నారు. కానీ చంద్రబాబు సర్కారు వీటి జోలికే పోలేదు ... పైగా ఎక్కడాలేని రాయితీలకు సిద్ధపడింది.
 
అయాచితంగా భూమి అప్పగింత... :భూసేకరణ జరపడానికి, విమానాశ్రయాలకు అవసరమైన అనుమతులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్సస్ వెహికిల్-ఎస్పీవీ)ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారులే ఇందులో సభ్యులుగా ఉన్నా, ప్రైవేటు సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి భూముల సేకరణ పూర్తయిన తర్వాత ఎస్పీవీ ఊసే ఉండదు. సేకరించిన భూములను విమాన నిర్మాణ సంస్థ (ప్రైవేటు సంస్థ)కు అప్పగిస్తారు. (ఆ విషయాన్ని పేరా 26లో పేర్కొన్నారు)
 
* బిడ్డర్ చేతికి పెత్తనం వచ్చాక ప్రభుత్వం ఓ మైనార్టీ భాగస్వామిగా మిగిలిపోతుంది.సర్కారు వాటాపై ప్రైవేటు సంస్థతో చర్చించి, నిర్మాణం పూర్తయ్యాక నిర్థారిస్తామన్న క్లాజ్‌ను  మాత్రం చేర్చారు. హాఇక్కడే తిరకాసు కన్పిస్తోంది. రైతు నుంచి భూమి తీసుకునేప్పుడు దాని విలువ తక్కువ. అభివృద్ధి చేశాక కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. అయినప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం కాకుండా, పుస్తకం రేటు ప్రకారమే ప్రభు త్వ వాటాను చెల్లించవచ్చని ప్రభుత్వం విధాన పత్రంలో పేర్కొంది.

నిర్మాణ సంస్థకు ప్రజల సొత్తును నిలువునా దోచిపెడుతున్నారనడానికి ఈ నిబంధన ఓ ఉదాహరణ.హా ఒక్కపైసా స్టాంపు డ్యూటీ కూడా తీసుకోకుండానే ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థకు ఆ భూములను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని రకాల పన్నులను మినహాయిస్తుంది. విద్యుత్ సుంకాన్ని, స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఆస్తి పన్నులను నిర్మాణ సంస్థ తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది. (పేరా 36లో ఉంది). కార్పొరేట్ సంస్థల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడమంటేనే అందులోని ఎవరి ప్రయోజనాలున్నాయో తెలుస్తోంది.

* నిర్మాణ సంస్థకు ఆశించిన రీతిలో ప్రతిఫలం రాకపోయినా ప్రజల సొమ్మును దానికి అప్పగించేలా నిబంధనలు పొందుపరిచింది. (పేరా 15 ఎఫ్). వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) పేరుతో రూ.ఐదు కోట్లు రెడీగా ఉంచింది. అదీ చాలకపోతే అదనపు రాయితీలు కూడా ఇస్తామని (పేరా 31) భరోసా ఇచ్చింది. సాధారణంగా ప్రాజెక్టులకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే ఇలాంటి ఏర్పాటు చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ల జేబులు నింపడానికే ఎక్కడా లేని ప్రేమ చూపింది.

* ఎయిర్‌పోర్టు ప్రభావిత ప్రాంతాలన్నీ నిర్మాణ సంస్థ ఇష్టం. పారిశ్రామిక పార్కులు, విమానయాన సంబంధిత సంస్థల స్థాపన, రిక్రియేషన్ క్లబ్‌లు, సెజ్‌లు ఏవైనా స్థాపించుకునే అధికారాలు (పేరా 17లో) కట్టబెట్టింది. కొన్నింటిని బిడ్డర్ కనుసన్నల్లో విమానాశ్రయ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ధారాదత్తం చేస్తామంది.
 
బజారున పడేయద్దు
భోగాపురం: ఎయిర్‌పోర్టుకు తమ భూములను ఇచ్చేది లేదని భోగాపురం ప్రాంత ప్రజలు పునరుద్ఘాటించారు. భూములు లాక్కొని తమ బతుకులు బజారుపాలు చేయొద్దని కోరుతూ విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తహసీల్దార్‌కు విజ్ఞప్తులు అందజేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వివిధ గ్రామాల నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుని వినతిపత్రాలు  అందజేశారు. అనంతరం ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసి, నినాదాలు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement