కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు
మూసివేసిన హాస్టళ్లను తక్షణమే తెరవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
విజయనగరం క్రైం : సంక్షేమ వసతిగృహాలను మూసివేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తారా? అని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నించారు. జిల్లాలో మూతపడిన హాస్టళ్లను తెరిపించాలని, మెస్ చార్జీలను పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్న విద్యార్థులు.. ప్రధాన గేటు ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. డీఆర్‌ఓ బయటకు వచ్చి విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫలితం లేకపోవడంతో రహదారిపై బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా విజయనగరం వన్‌టౌన్ సీఐ వి.వి.అప్పారావు, టూటౌన్ సీఐ జి.దుర్గాప్రసాద్‌లు విషయాన్ని డీఆర్‌ఓ జితేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు డీఆర్‌ఓ విద్యార్థుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాని హామీ ఇవ్వడంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన విరమించారు.
పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తున్న చంద్రబాబు
ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఒక వైపు ‘బడి పిలుస్తోంది’ అంటూనే మరో వైపు బడులు, హాస్టళ్లు మూసివేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం ప్రధానమైనదని, దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను తక్షణమే ప్రారంభించాలని, మెస్‌చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు.
జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. గురుకుల, కేజీబీవీ, రెసిడెన్సియల్స్ పాఠశాలల సమస్యలు పరిష్కరించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీని ప్రారంభించి క్లాసులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న విజయవాడలో మహాధర్నా తలపెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి.రామ్మోహన్, లక్ష్మణ్, సాయి, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.