కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
-
విద్యారంగ సమస్యలపై మండిపాటు
-
పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య తోపులాట
ముకరంపుర: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆ«ధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి విద్యార్థులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విద్యార్థి సంఘాల నేతలు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు విధ్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.తిరుపతి, బత్తిని సంతోష్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా విద్యారంగానికి చేసిందేమీ లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న బోజనం ప్రారంభిస్తామని హామీలిచ్చిన మంత్రులు విస్మరించడం శోచనీయమన్నారు. అధికారుల పర్యవేక్షణ లేక హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్‌కుమార్, మారుతి, రజిత, రవీందర్, నాగరాజు, సంతోష్, ప్రశాంత్, విఘ్నేష్, గణేశ్, వంశీ, మాలతి, పూజ, ఆదిత్య, శ్రావణ్‌కుమార్, సంపత్ పాల్గొన్నారు.