
ట్రంప్‌కు ‘హ్యాండ్సాఫ్’ సెగ
ట్రంప్ విధానాలతో విదేశాల ప్రతీకార టారిఫ్‌ల భారం పడిందని అమెరికన్ల ఆగ్రహం
దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగిన ఆందోళనలు
వాషింగ్టన్: మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఆసీనులైన డొనాల్డ్ ట్రంప్ వెనువెంటనే తీసుకున్న అనూహ్య, విపరీత నిర్ణయాలతో అమెరికన్లు విసిగిపోయారు. విదేశాలపై టారిఫ్‌ల బాంబు విసిరితే అది ప్రతీకార టారిఫ్‌ల రూపంలో తిరిగొచ్చి అధిక ధరలు, ద్రవ్యోల్బణానికి బాటలు వేస్తోందన్న ఆగ్రహంతో ప్రజలు నిరసన బాటపట్టారు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నడూలేనిస్థాయిలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ముక్తకంఠంతో నినదిస్తూ ఆందోళనకు దిగిన ‘హ్యాండ్సాఫ్’ ఉద్యమం శనివారం భారీస్థాయిలో కొనసాగుతోంది. అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం ఉద్యమం మొదలైంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక భద్రత విభాగ ఆఫీస్‌లు, పార్కులు, సిటీ హాళ్ల వద్ద ప్రధానంగా పెద్దస్థాయిలో ర్యాలీలు జరిగాయి.
అత్యంత సంపన్నుల చేతుల్లోకి వెళ్లిన పాలనాపగ్గాలను విడిపిస్తామని నినదించారు. ‘‘ మావి ప్రధానంగా మూడు డిమాండ్లు. ప్రభుత్వంపై సంపన్నుల అజమాయిషీ నశించాలి. ప్రభుత్వంలో అవినీతి అంతంకావాలి. మెడికేర్, సోషల్‌సెక్యూరిటీ నిధుల్లో కోత పెట్టొద్దు. వలసదారులు, లింగమార్పిడి వర్గాలు, ఇతరులపై నిర్బంధాల చట్రాలను తొలగించాలి’’ అని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాల్లో ఒకటైన ఇండివిజిబుల్ ప్రకటించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరల్ ఎంప్లాయీస్ సహా చాలా కార్మిక సంఘాల సభ్యులు పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.
50 రాష్ట్రాల్లో 1,400 చోట్ల..
50 రాష్ట్రాల్లో పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, ఎల్‌జీబీటీక్యూ+ మద్దతుదారులు, మాజీ ఫెడరల్ ఉద్యోగులు, మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్నికల సంస్కరణల కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం ఈ ఆందోళనలో భాగస్వాములై ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధానంగా 1,400 ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే చాలా వరకు ర్యాలీలు శాంతియుతంగానే కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అరెస్ట్‌లు జరగలేదు.
మ్యాన్‌హాట్టన్ మిడ్‌టౌన్ మొదలు అలాస్కాలోని యాంకరేజ్‌దాకా ప్రతి ప్రధాన నగరం, పట్టణంలో జనం వీధుల్లోకి వచ్చి హ్యాండ్సాఫ్ అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు.
వ్యయ నియంత్రణ చర్యలు, సమూల సంస్కరణల పేరుచెప్పి హఠాత్తుగా వేల సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించడం, జీడీపీ తగ్గిపోయేలా ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేయడం, వలసలపై ఉక్కుపాదం మోపడం, మానవ హక్కులను కాలరాయడం వంటి చర్యలతో ట్రంప్, ఎలాన్ మస్క్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. అమెరికాలోనేకాదు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్, జర్మనీలోని బెర్లిన్ నగరాల్లోనూ అమెరికా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ‘‘అమెరికాకు ఏమైంది?. ప్రజలను టారిఫ్‌లను ఇబ్బందులు పెట్టడం ఇకనైనా ఆపండి. ట్రంప్ పెద్ద ఇడియట్’’ అని రాసి ఉన్న ప్లకార్డులను లండన్‌లో ప్రదర్శించారు.
నిరసనలపై స్పందించిన శ్వేతసౌధం
ట్రంప్ వ్యతిరేక ర్యాలీలపై అధ్యక్ష భవనం స్పందించింది. ‘‘ ఇన్నాళ్లూ డెమొక్రాట్ల ప్రభుత్వంలో అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులు, వలసదారులు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు, ప్రయోజనాలను అక్రమంగా పొందారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. వీళ్ల వల్ల వాస్తవిక లబ్ధిదారులైన సీనియర్ అమెరికన్లు ఎంతో లబ్దిని కోల్పోయారు. ఆ సంస్కృతికి చరమగీతం పాడి నిజమైన అమెరికన్లకే ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత, వైద్యసాయం, వైద్యసదుపాయాలు అందిస్తున్నాం’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.