ప్రచారమే ఎజెండా | Rachabanda-3 | Sakshi
Sakshi News home page

ప్రచారమే ఎజెండా

Published Sat, Nov 9 2013 3:36 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Rachabanda-3

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, సమస్యలను పట్టించుకోని పాలకులు ఎన్నికలు  సమీపిస్తుండడంతో ప్రజల్లోకి రావటానికి ఎత్తుగడలు ప్రారంభించారు. ఇన్నాళ్లూ ప్రజల ముఖం చూడని  వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి రచ్చబండను వేదికగా ఉపయోగించుకునేందుకు యత్నాలు ప్రారంభించారు. జిల్లాలో ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న మూడోవిడత రచ్చబండ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంగా మారనుంది. ఏ పదవీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే వేదికపై కూర్చోబెట్టి, వారితో ఆస్తులు పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వేదికపైన కూర్చునేవారిని ఎంపిక చేసే అధికారం జిల్లా ఇన్‌చార్జి మంత్రికి ఇచ్చారు.  దీనిపై విస్తృతంగా  ప్రచారం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మండలాలతో పాటూ మున్సిపాల్టీల్లో కూడా రచ్చబండ నిర్వహణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 

పూర్తిగా ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల  సూచన మేరకే కార్యక్రమం జరగాలని ప్రకటించడంతో ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మారనుందని అర్థమవుతోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా... ఇన్‌చార్జి మంత్రి సూచించిన పేర్లనే మండలస్థాయి కమిటీల్లో చేర్చాలని స్పష్టం చేశారు. 3వ విడత రచ్చబండ కార్యక్రమాన్ని ఐదు అంశాలకు మాత్రమే పరిమితం చేశారు. జిల్లా స్థాయిలో డీఆర్‌డీఏ పీడీ, డీఎస్‌ఓ, హౌసింగ్ పీడీ, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల డీడీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పింఛన్‌దారులను ఆకట్టుకోడానికి 20 నుంచి 40 శాతం లోపు వికలాంగత్వం ఉన్నవారి వద్ద నుంచి కూడా మండల కమిటీలు దరఖాస్తులు స్వీకరించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇదంతా  కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
 గత దరఖాస్తుల మాటేంటి ...?
 గత రెండు విడతల్లో ఇచ్చిన  దరఖాస్తులకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించలేదు.  వచ్చిన దరఖాస్తులకు.. మంజూరు చేస్తున్న వాటికి పొంతన లేకుండా పోయింది. రేషన్ కార్డుల కోసం 75 వేల దరఖాస్తులు రాగా ఇప్పుడు జరగనున్న రచ్చబండలో కేవలం 29,047 మందికి తాత్కాలిక కూపన్లు మాత్రమే జారీ చేయనున్నారు. అలాగే  పింఛన్లకు సంబంధించి 50,860 దరఖాస్తులు రాగా, వాటిలో 31,263 అర్హత గలవిగా తేల్చారు.  అందులో కూడా కేవలం 19,307 మందికి మాత్రమే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లక్షా 10 వేలు దరఖాస్తులు రాగా  వాటిలో 87 వేలు అర్హమైనవిగా గుర్తించిన అధికారులు ప్రస్తుతం జరగనున్న కార్యక్రమంలో 31,800 మందికి మాత్రమే మంజూరు పత్రాలు అందజేసేందుకు సిద్ధం చేస్తున్నారు. వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో  కేవలం   30శాతం మందికి మాత్రమే మంజూరు చేశారు.  అధికూడా అధికార పార్టీ నేతలు సూచించిన వారికే మంజూరు చేసి నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
 ఐదు అంశాలకే పరిమితం
 కేవలం రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణ లబ్ధిదారులకు అనుమతి ఉత్తర్వులు జారీ, ఇందిరమ్మ కలల కింద వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవా లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బకాయి ఉన్న విద్యుత్ బిల్లుల చెల్లింపులకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేశారు.
 లబ్ధిదారులతోనే...
 ఈసారి రచ్చబండ కార్యక్రమాన్ని కేవలం లబ్ధిదారులకే పరిమితం చేయనున్నారు.  గతంలో మాదిరిగా ప్రజలంతా తమ సమస్యలను చెప్పుకొనేందుకు ఈసారి అవకాశం లేదు. కేవలం లబ్ధిదారుల మాత్రమే రావాలని, రేషన్‌కార్డు, పింఛన్ మంజూరయినట్టు తెలుపుతూ అధికారిక లేఖలు పంపేందుకు సిద్ధం చేస్తున్నారని సమాచారం. లబ్ధిదారులకు మంజూరు స్లిప్పులు ముందే ఇచ్చి వారిని రచ్చబండ సభల వేదికల వద్దకు తీసుకురావాలని, ఖర్చులను ఆయా విభాగాల రెగ్యులర్ బడ్జెట్  నుంచి భరించాలని ఉత్తర్వులు అందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement