కంటి తుడుపే | Less amount sanctioned for heavy losses | Sakshi
Sakshi News home page

కంటి తుడుపే

Published Wed, Nov 20 2013 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

Less amount sanctioned for heavy losses

ఒంగోలు కలెక్టరేట్, పర్చూరు, న్యూస్‌లైన్:   గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. నెలరోజుల సగటు వర్షం నాలుగు రోజుల్లోనే నమోదైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. పొలాలు చెరువులయ్యాయి. రోడ్లు వాగులుగా మారాయి. కాలనీలు మునిగిపోయాయి. తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. రూ 850 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. విపత్తు జరిగిన 26 రోజుల తరువాత ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం  నష్టం అంచనాల కోసం జిల్లాలో నేడు కాలుమోపనుంది. అది కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు పర్యటించి తిరిగి హైదరాబాద్ వెళ్లనుంది. భారీ వర్షాల వల్ల అపార నష్టం జరిగినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించలేదు. నష్టం జరిగిన తరువాత కేంద్ర బృందం తీరికగా జిల్లాకు రావడంపై ప్రజలతోపాటు జిల్లా యంత్రాంగం కూడా పెదవి విరుస్తోంది. కాలువలు, కల్వర్టులకే బృందం పరిమితం కానుంది.
 
 వందల కోట్ల నష్టం..
 అక్టోబర్‌లో 206.5 మిల్లీమీటర్ల సగటు వర్షానికిగాను ఆ నెల 22 నుంచి 25వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు 246.9 మిల్లీమీటర్లు నమోదైంది. మూడు మండలాల్లో 400పైగా, 13 మండలాల్లో 300-400, 20 మండలాల్లో 200-300, మరో 20 మండలాల్లో 200 మిల్లీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖకు రూ 120 కోట్లకు పైగా నష్టం జరిగింది. ఉద్యాన, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమ శాఖలకు సంబంధించి దాదాపు రూ 7 కోట్ల మేర నష్టం జరిగింది. ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ 290 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ 250 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. మేజర్ ఇరిగేషన్‌లో కృష్ణా పశ్చిమ డెల్టాకు సంబంధించి దాదాపు రూ 14 కోట్లు, ప్రాజెక్టులకు సంబంధించి రూ 20 కోట్ల వరకు నష్టం జరిగింది. మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి రూ 30 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఒంగోలు నగరంతోపాటు మిగిలిన మునిసిపాలిటీల్లో రూ 90 కోట్లకు పైగా నష్టం జరిగింది. భారీ వర్షాలు 350కి పైగా గ్రామాలపై ప్రభావం చూపాయి. 650కి పైగా ఇళ్లు పూర్తిగా, 700కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మత్స్యకారులు, చేనేత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
 కొన్ని గంటలు, కొన్ని ప్రాంతాలు...
 శంభూసింగ్, ఆర్‌పీసింగ్, కృష్ణప్రసాద్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం జిల్లాలో కొన్ని గంటలు మాత్రమే పర్యటించనుంది. అదికూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం కానుంది. కేంద్ర బృందం పర్యటించనున్న ప్రాంతాల్లో కారంచేడు, స్వర్ణ గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లో పంటలన్నీ తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు తిరిగి సాగు చేపట్టారు. పొగాకు పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. పొగాకు పూర్తిగా దెబ్బతినడంతో తిరిగి పొగనారు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి ఏం తేలుస్తుందో వారికే తెలియాలి. భారీ వర్షాల కారణంగా నష్టం జరిగిన మొదటి మూడు నాలుగు రోజుల్లో పర్యటిస్తే ఎంత నష్టం జరిగిందో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. 26 రోజుల తరువాత వస్తే నష్టం ఆనవాళ్లు కూడా కనిపించవు. కేంద్ర బృందం పర్యటించే ప్రాంతాల్లో పంటలకంటే కల్వర్టులు, కాల్వలనే ఎక్కువగా పెట్టారు. కనీసం వాటిని చూసైనా నష్టం అంచనా తెలుసుకుంటారేమో!
 గత బీభత్సాలకు పరిహారమేదీ..
 గతంలో లైలా, జల్ వంటి తుపాన్లు జిల్లాను వణికించాయి. అప్పుడు కూడా అపార నష్టం సంభవించింది. కేంద్ర బృందాలు వచ్చి వెళ్లడం తప్పితే పూర్తి స్థాయిలో పరిహారం అందించిన దాఖలాల్లేవు. శాఖల వారీగా కొన్నింటికి మాత్రం పరిహారం అందించి ప్రభుత్వం సరిపెట్టుకొంది. దాంతో నష్టం ఏ మేరకు అందించాలన్న వివరాలు లేవు. తాజాగా రానున్న కేంద్ర బృందం కూడా గతంలో మాదిరిగానే రావడం, చూడటం, వెళ్లడం వరకే పరిమితం కానున్నట్లు వారి పర్యటన షెడ్యూల్‌ను చూస్తే స్పష్టమవుతోంది. జిల్లాలో జరిగిన భారీ వర్షాల నష్టంపై యంత్రాంగం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. కనీసం దానిని చూసైనా కేంద్ర బృందం స్పందిస్తుందో లేక మొక్కుబడి పర్యటనతో ముగిస్తుందో వేచి చూడాలి.
 కొమ్మమూరు కాలువపై 60 చోట్ల గండ్లు..
 కొమ్మమూరు కాలువపై జిల్లాలో సుమారు 60 చోట్ల గండ్లు పడ్డాయి. ఒక్క పర్చూరు నియోజకవర్గంలోని 29 చోట్ల గండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల రైతులే స్వచ్ఛందంగా గండ్లు పూడ్చుకుంటున్నారు. గండ్లకు పూర్తిగా మరమ్మతులు చేస్తేనే కొమ్మమూరు కాలువలకు సక్రమంగా నీటి సరఫరా అవుతుంది. వెంటనే గండ్లు పూడ్చాల్సి ఉంది.
 తడిసిన పత్తిని, వరిని కొనుగోలు చేయాలి...
 వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తిపైరు చాలాచోట్ల పీకేశారు. వేరే పైరు సాగుచేయలేని రైతులు పత్తిపైరును అలానే ఉంచారు. తడిసిన కాయల నుంచి తీసిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానాతంటాలు పడాల్సి ఉంటుంది. తడిసిన పత్తిని నిబంధనలు పక్కనపెట్టి సీసీఐ, నాఫెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించాలి. తడిసిన పత్తిని క్వింటా  రూ 4 వేలు, నాణ్యమైన పత్తిని క్వింటా రూ 6వేలకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంది. ఇదే విధంగా వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
 జిల్లాలో పంటనష్టం కేంద్ర బృందానికి వివరిస్తాం: జేడీఏ దొరసాని
 భారీవర్షాల కారణంగా జిల్లాకు జరిగిన పంట నష్టాన్ని కేంద్రబృందానికి విన్నవించనున్నట్లు వ్యవసాయశాఖ జిల్లా జేడీఏ ఎస్.దొరసాని పేర్కొన్నారు. కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్చూరు వచ్చిన ఆమె మంగళవారం స్థానిక ఏడీఏ కార్యాలయంలో విలేకరుతో మాట్లాడారు.  కేంద్ర బృందం బుధవారం పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. వర్షాలకు దెబ్బతిన్న పైర్లను పరిశీలిస్తారని చెప్పారు. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో పత్తిపైర్లను, కారంచేడు మండలం  కుంకలమర్రులో వరిపైరును, ఇంకొల్లు మండలం వంకాయలపాడులో మిర్చిపైరును పరిశీలిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో పంటనష్టం వివరాలు సేకరించామని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ కూడా 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులు పాసుపుస్తకాల జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాల నంబర్లు వెంటనే సంబంధిత వీఆర్వోలకు అందజేయాలని కోరారు. కేంద్ర బృందం నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం ఒంగోల్లో ఫొటోఎగ్జిబిషన్, పవర్‌పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా కేంద్ర బృందానికి నష్టానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వివరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో  దెబ్బతిన్న పత్తిపైరును పీకివేసి  ప్రస్తుతం దాని స్థానంలో పొగాకు, శనగ సాగుచేస్తున్నట్లు తెలిపారు. రాయితీ శనగలు త్వరలోనే అందజేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆమె వెంట ఏడీఏలు జి.రత్నప్రసాద్, సీహెచ్ గణేష్‌బాబు, ఏవో బీ. గౌతమ్‌ప్రసన్న  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement