గ్రేటర్ ఆర్టీసీపై పిడుగుపాటు. ఏడాది కాలంలోనే భారీ నష్టాలు సంభవించాయి.
♦ రూ.158.3 కోట్ల నష్టం
♦ ఏడాదిలోనే రూ.వంద కోట్లకు పైగా భారం
♦ 65 శాతానికి పడిపోయిన ఓఆర్
♦ పెరిగిన నిర్వహణ ఖర్చులు
♦ అస్తవ్యస్త పరిపాలన
సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్ ఆర్టీసీపై పిడుగుపాటు. ఏడాది కాలంలోనే భారీ నష్టాలు సంభవించాయి. అనూహ్యంగా పెరిగిన నిర్వహణ ఖర్చు... జీతభత్యాల భారం... బస్సుల నిర్వహణలో వైఫల్యాలు... అధికారుల మధ్య సమన్వయ లోపం... సంస్థ విభజనపై ఏడాదిగానెలకొన్న స్తబ్దత తదితర పరిణామాలు భారీగా దెబ్బతీశాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో రూ.158.3 కోట్ల నష్టాలు భరించాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.354 కోట్ల మేరకు నష్టం వస్తే... అందులో సగానికి పైగా ఒక్క గ్రేటర్ ఆర్టీసీకి సంబంధించినవే. కొంతకాలంగా నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీకి ఇది కోలుకోలేని దెబ్బ.
మరోవైపు ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు నడపకపోవడం... నిత్యం వేలాది ట్రిప్పులు రద్దు కావడం, సిబ్బంది గైర్హాజరు వంటి అంశాలు కూడా ఆర్టీసీ పుట్టి ముంచాయి. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఏసీ బస్సులు ఈ నష్టాలకు మరింత ఆజ్యం పోశాయి. ఒకప్పుడు 72 శాతం ప్రయాణికులతో కిటకిటలాడిన సిటీ బస్సులు ప్రస్తుతం 65.96 శాతం ఆక్యుపెన్సీతో వెలవెలబోతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం... ఏడాదిగా నెలకొన్న స్తబ్దత కూడా నష్టాల బాటలో నడిపించాయి.
ఏడాదిలో రూ.100 కోట్లకు పైగా నష్టం
గ్రేటర్ హైదరాబాద్‌లోని 27 డిపోల పరిధిలో 3850 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇవి నిత్యం 42 వేల ట్రిప్పుల వరకు నడుస్తున్నట్లు అంచనా. కానీ సుమారు నాలుగైదు వేల ట్రిప్పులు రద్దవుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాల వైపు చూడాల్సి వస్తోంది. ఆర్టీసీ అంచనా ప్రకారం 35 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సులను వినియోగించుకుంటున్నారు.
మరోవైపు రోజూ 5 లక్షల మందికి పైగా సకాలంలో బస్సులు లభించక ఇతర వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. దీంతో సంస్థకు నష్టాలు సంభవిస్తున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.44.15 కోట్లు ఉన్న నష్టాలు కేవలం ఏడాదిలో అంటే 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.158.3 కోట్లకు చేరుకోవడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలోనే రూ.వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. రూ.80 కోట్లతో కొనుగోలు చేసి, గత డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన 80 ఏసీ ఓల్వో బస్సులు ఈ నష్టాలను మరింత పెంచాయి. వీటితో పాటు, సీటీ శీతల్, ఎయిర్‌పోర్టుకు నడిచే పుష్పక్ ఏసీ బస్సులన్నింటిపైనా రూ.70 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు అంచనా.