సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఐదు రోజుల పాటు కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఊహకందని విధ్వంసాన్ని సృష్టించాయి. శనివారం కూడా కొన్ని మండలాల్లో వర్షాలు పడడంతో పంటలు దెబ్బతిని నష్టం మరింత పెరిగింది. కనీవిని ఎరుగని రీతిలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా న ష్టం కలిగించింది. అన్ని శాఖల పరిధిలో రూ 1075.72 కోట్ల నష్టం సంభవించినట్టు రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వర్షాలు అధికంగా ఉండి తీవ్రంగా నష్టం జరిగిన 37 మండలాల్లోని 679 గ్రామాలకు చెందిన గణాంకాలు మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లు, కొట్టుకుపోయిన వ్యవసాయ మోటార్లు, పైపుల విలువ లెక్కిస్తే నష్టం మరింత పెరగనుంది.
కోలుకోలేని దెబ్బ....
అన్నదాతల రెక్కల కష్టం నీటిపాలైంది. ఆశలు పెట్టుకున్న పంటలు జల సమాధి అయ్యాయి. జిల్లాలో మొత్తం 5.43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. ఇంత పెద్ద ఎత్తున పంటలు నాశనం కావడం ఇదే మొదటిసారి. ఇందులో అత్యధిక విస్తీర్ణంలో పత్తి చేలు చేతికి రాకుండా పోయాయి. కాయల్లోనే పత్తి గింజలు మొలకె త్తడం నష్టం తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ధాన్యంది కూడా ఇదే పరిస్థితి. 4.35 లక్షల ఎకరాల్లో పత్తి చేతికి రాకుండా పోయింది. వరి 1.03 లక్షల ఎకరాల్లో నీట మునిగిందని పేర్కొన్నారు. మరో ఐదు వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
అంతేగాక 880 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. ఈ పంటల మొత్తం విలువ రూ 878.35 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. వాస్తవంగా ఒక్కో ఎకరా సాగుకు సగటున రూ 10 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అప్పు తెచ్చి మరీ సాగుకు ఉపక్రమించారు. తీరా పంటలు చేతికొచ్చే సమయంలో ఉపద్రవం ముంచుకొచ్చి అపార నష్టాన్ని కలిగించింది. దీంతో రైతులు ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి దాపురించింది. అంతేగాక వెయ్యికిపైగా వ్యవసాయ మోటార్లు, పైపులు వరదల్లో కొట్టుకపోయాయి. ఇవన్నీ లెక్కగడితే నష్టం విలువ మరింత పెరగనుంది.
గూడు చెదిరింది...
జిల్లావ్యాప్తంగా 12,045 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తేల్చారు. నష్టం విలువ అంచనా వేయలేదు. ఆర్‌అండ్‌బీ రోడ్లు, భవనాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరదలు పొంగిపొర్లడంతో రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. మరికొన్ని చోట్ల ఎద్దఎత్తున గోతులు ఏర్పడ్డాయి. వీటి ద్వారా ఆ శాఖకు రూ 143 కోట్ల నష్టం వాటిల్లింది. 907 పంచాయతీ రోడ్లు చెడిపోయాయి. 385 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. దీనిద్వారా నీటి పారుదల శాఖకు రూ 34.01కోట్ల నష్టం వాటిల్లింది.
121 గ్రామీణ తాగునీటి పథకాలు చెడిపోగా.. రూ 24.8కోట్ల నష్టం ఏర్పడింది. దీంతో వందల గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అంతేగాక మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, పైప్‌లైన్లు ధ్వంసమయ్యాయి. వీటిద్వారా రూ 10 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. దాదాపు రూ 2 కోట్ల విలువ చేసే 1771 విద్యుత్ స్తంభాలు, 85 ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయి.
ఉపాధి పోయింది..
వృత్తిదారులకూ తీరని నష్టం మిగిలింది. 808 మూగజీవాలు వరదల బారినపడి చనిపోయాయి. 1257బోట్లు, చేపల వలలు గల్లంతయ్యాయి. అంతేగాక 172 పవర్‌లూమ్స్ నీట మునిగి పనికిరాకుండా పోయాయి. ఈ మొత్తం నష్టం విలువ *2.60 కోట్లు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి 14 క్యాంపులు ఏర్పాటు చేశారు. 1934 మందికి పునరావాసం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
విధ్వంసమే..!
Published Mon, Oct 28 2013 4:09 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement