non stop rains
-
ఆగని వాన
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు, చలివాగు అలుగుపోస్తున్న లక్నవరం, పాకాల చెరువులు 66 చెరువులకు గండ్లు.. నీట మునిగిన పంటలు సహాయక చర్యలు ముమ్మరం సెలవు రోజు కూడా విధుల్లోనే అధికారులు హన్మకొండఅర్బన్ : జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం కూడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం పెద్దగా లేకపోవడంతో యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు వర్షాల ప్రభావంతో నలుగురు మృత్యువాత పడ్డారు. 34 ఇండ్లు పూర్తిగా, 251 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 7వేల మంది వర్షాల కారణగా నిరాశ్రయులయ్యారు. దెబ్బతిన్న రోడ్లను తాత్కాలిక మరమ్మతులతో అధికారులు పునరుద్ధరించారు. 13వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వరదలు పూర్తిగా తగ్గిన తరువాత పంట నష్టం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వదర తాకిడికి 66 చెరువులకు బుంగలు పడ్డాయి. వీటిలో చాలా వాటిని అధికారులు అప్రమత్తమై పూడ్చివేసే పనులు చేపట్టారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం- ధర్మారావుపేట గ్రామాల మధ్యన ఉన్న మోరంచవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగు అవతలకు చెందిన 15 గ్రామాలకు రవాణా సౌకర్యాలు స్తంభించాయి. చిట్యాల మండలంలోని చలివాగు, మానేరు ఉప్పొంగుతున్నాయి. వరదనీటి కారణంగా పత్తి, మిరప, వరి పంటలు నీట మునిగాయి. వరదకు ములుగు మండలంలోని కాశిందేవిపేట-రామయ్యపల్లి సమీపంలోని కెనాల్ కాలువ తెగింది. దీంతో దిగువన ఉన్న పంట పొలాలు కోతకు గురయ్యాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు 34 అడుగులకు చేరి అలుగు పోస్తోంది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు పూర్తి స్థాయి (30.03 ఫీట్లు)లో నిండి అలుగు పారుతోంది. భారీ వర్షానికి పాలకుర్తి మండలంలో వాగులు పొంగి పొర్లడంతో వల్మిడి- ముత్తారం గ్రామాల మధ్య ఉన్న బీటీ రోడ్డు తెగి పోయింది. శుక్రవారం ఉధృతంగా ప్రవహించిన హన్మకొండ నయీంనగర్‌లోని పెద్దమోరీ శనివారం తగ్గుముఖం పట్టింది. వరుస వర్షాలతో భూపాలపల్లి ఏరియాలోని గనులు బురదమయంగా మారాయి. గనుల వద్ద ఉన్న బంకర్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. బొగ్గు లారీల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెలవురోజు విధుల్లోనే... ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ప్రధాన శాఖల అధికారులు ఉద్యోగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూం కొనసాగింపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. -
విధ్వంసమే..!
సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఐదు రోజుల పాటు కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఊహకందని విధ్వంసాన్ని సృష్టించాయి. శనివారం కూడా కొన్ని మండలాల్లో వర్షాలు పడడంతో పంటలు దెబ్బతిని నష్టం మరింత పెరిగింది. కనీవిని ఎరుగని రీతిలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా న ష్టం కలిగించింది. అన్ని శాఖల పరిధిలో రూ 1075.72 కోట్ల నష్టం సంభవించినట్టు రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వర్షాలు అధికంగా ఉండి తీవ్రంగా నష్టం జరిగిన 37 మండలాల్లోని 679 గ్రామాలకు చెందిన గణాంకాలు మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లు, కొట్టుకుపోయిన వ్యవసాయ మోటార్లు, పైపుల విలువ లెక్కిస్తే నష్టం మరింత పెరగనుంది. కోలుకోలేని దెబ్బ.... అన్నదాతల రెక్కల కష్టం నీటిపాలైంది. ఆశలు పెట్టుకున్న పంటలు జల సమాధి అయ్యాయి. జిల్లాలో మొత్తం 5.43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. ఇంత పెద్ద ఎత్తున పంటలు నాశనం కావడం ఇదే మొదటిసారి. ఇందులో అత్యధిక విస్తీర్ణంలో పత్తి చేలు చేతికి రాకుండా పోయాయి. కాయల్లోనే పత్తి గింజలు మొలకె త్తడం నష్టం తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ధాన్యంది కూడా ఇదే పరిస్థితి. 4.35 లక్షల ఎకరాల్లో పత్తి చేతికి రాకుండా పోయింది. వరి 1.03 లక్షల ఎకరాల్లో నీట మునిగిందని పేర్కొన్నారు. మరో ఐదు వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అంతేగాక 880 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. ఈ పంటల మొత్తం విలువ రూ 878.35 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. వాస్తవంగా ఒక్కో ఎకరా సాగుకు సగటున రూ 10 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అప్పు తెచ్చి మరీ సాగుకు ఉపక్రమించారు. తీరా పంటలు చేతికొచ్చే సమయంలో ఉపద్రవం ముంచుకొచ్చి అపార నష్టాన్ని కలిగించింది. దీంతో రైతులు ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి దాపురించింది. అంతేగాక వెయ్యికిపైగా వ్యవసాయ మోటార్లు, పైపులు వరదల్లో కొట్టుకపోయాయి. ఇవన్నీ లెక్కగడితే నష్టం విలువ మరింత పెరగనుంది. గూడు చెదిరింది... జిల్లావ్యాప్తంగా 12,045 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తేల్చారు. నష్టం విలువ అంచనా వేయలేదు. ఆర్అండ్బీ రోడ్లు, భవనాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరదలు పొంగిపొర్లడంతో రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. మరికొన్ని చోట్ల ఎద్దఎత్తున గోతులు ఏర్పడ్డాయి. వీటి ద్వారా ఆ శాఖకు రూ 143 కోట్ల నష్టం వాటిల్లింది. 907 పంచాయతీ రోడ్లు చెడిపోయాయి. 385 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. దీనిద్వారా నీటి పారుదల శాఖకు రూ 34.01కోట్ల నష్టం వాటిల్లింది. 121 గ్రామీణ తాగునీటి పథకాలు చెడిపోగా.. రూ 24.8కోట్ల నష్టం ఏర్పడింది. దీంతో వందల గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అంతేగాక మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, పైప్లైన్లు ధ్వంసమయ్యాయి. వీటిద్వారా రూ 10 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. దాదాపు రూ 2 కోట్ల విలువ చేసే 1771 విద్యుత్ స్తంభాలు, 85 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. ఉపాధి పోయింది.. వృత్తిదారులకూ తీరని నష్టం మిగిలింది. 808 మూగజీవాలు వరదల బారినపడి చనిపోయాయి. 1257బోట్లు, చేపల వలలు గల్లంతయ్యాయి. అంతేగాక 172 పవర్‌లూమ్స్ నీట మునిగి పనికిరాకుండా పోయాయి. ఈ మొత్తం నష్టం విలువ *2.60 కోట్లు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి 14 క్యాంపులు ఏర్పాటు చేశారు. 1934 మందికి పునరావాసం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. -
కన్నీరే మిగిలింది..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వర్షాల ధాటికి జిల్లాలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వేల హెక్టార్లలో పం టలు నీటమునగడంతోపాటు పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు వర్షపునీటితో చెరువులు, కుంటలు అలుగెత్తి కాలనీలను ముంచేశాయి. నీటితాకిడికి పలు చెరువులకు గండ్లు పడగా, కాల్వలు తెగిపోయాయి. జిల్లాలో వర్షాల వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనాలను సిద్ధం చేసేందుకు ఉపక్రమించారు. శుక్రవారం సాయంత్రం నాటికి ప్రాథమికంగా అంచనాలను సేకరించారు. 11,045 ఎకరాల్లో పంటనష్టం వాట్టిల్లిందని గుర్తించారు. ఇందులో 1,795 ఎకరాల్లో పత్తి, 2,337.5 ఎకరాల్లో వరి, 825 ఎకరాల్లో మొక్కజొన్న పంటలతోపాటు పండ్లు, పూలతోటలు, కూరగాయల పంటలున్నాయి. అదేవిధంగా 79 ఇళ్లు పాక్షికంగా మరికొన్ని పూర్తిగా కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే పూర్తిస్థాయి వివరాలు సేకరించేందుకు మరింత సమయం పడుతుందని, నష్టం అంచనాలు పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వర్షపాతం 3.4 సెం.మీ. జిల్లాలో వరుసగా నాలుగో రోజూ భారీ వర్షపాతమే నమోదైంది. అధికార గణాంకాల ప్రకారం గురువారం నుంచి శుక్రవారం ఉదయం నాటి కి జిల్లాలో 3.4 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోైదె ంది. గ్రామీణ మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదు కాగా, తూర్పు డివిజన్లలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. అధికంగా కందుకూరు మండలంలో 11.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యాచారంలో 10.7 సెంటీమీటర్లు, మహేశ్వరంలో 10.3, హయత్‌నగర్‌లో 9.8 ఇబ్రహీంపట్నంలో 8.6, మంచాలలో 8, శంషాబాద్‌లో 5.9 సెంటీమీటర్లు నమోదైంది. జిల్లాలో అత్యల్పంగా తాండూరు మండలంలో 0.5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.