వర్ధన్నపేట శివారులో ఆకేరు వాగు ఉధృతి
- ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు, చలివాగు
- అలుగుపోస్తున్న లక్నవరం, పాకాల చెరువులు
- 66 చెరువులకు గండ్లు.. నీట మునిగిన పంటలు
- సహాయక చర్యలు ముమ్మరం
- సెలవు రోజు కూడా విధుల్లోనే అధికారులు
హన్మకొండఅర్బన్ : జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం కూడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం పెద్దగా లేకపోవడంతో యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు వర్షాల ప్రభావంతో నలుగురు మృత్యువాత పడ్డారు. 34 ఇండ్లు పూర్తిగా, 251 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 7వేల మంది వర్షాల కారణగా నిరాశ్రయులయ్యారు.
దెబ్బతిన్న రోడ్లను తాత్కాలిక మరమ్మతులతో అధికారులు పునరుద్ధరించారు. 13వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వరదలు పూర్తిగా తగ్గిన తరువాత పంట నష్టం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వదర తాకిడికి 66 చెరువులకు బుంగలు పడ్డాయి. వీటిలో చాలా వాటిని అధికారులు అప్రమత్తమై పూడ్చివేసే పనులు చేపట్టారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం- ధర్మారావుపేట గ్రామాల మధ్యన ఉన్న మోరంచవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగు అవతలకు చెందిన 15 గ్రామాలకు రవాణా సౌకర్యాలు స్తంభించాయి.
చిట్యాల మండలంలోని చలివాగు, మానేరు ఉప్పొంగుతున్నాయి. వరదనీటి కారణంగా పత్తి, మిరప, వరి పంటలు నీట మునిగాయి. వరదకు ములుగు మండలంలోని కాశిందేవిపేట-రామయ్యపల్లి సమీపంలోని కెనాల్ కాలువ తెగింది. దీంతో దిగువన ఉన్న పంట పొలాలు కోతకు గురయ్యాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు 34 అడుగులకు చేరి అలుగు పోస్తోంది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు పూర్తి స్థాయి (30.03 ఫీట్లు)లో నిండి అలుగు పారుతోంది. భారీ వర్షానికి పాలకుర్తి మండలంలో వాగులు పొంగి పొర్లడంతో వల్మిడి- ముత్తారం గ్రామాల మధ్య ఉన్న బీటీ రోడ్డు తెగి పోయింది. శుక్రవారం ఉధృతంగా ప్రవహించిన హన్మకొండ నయీంనగర్‌లోని పెద్దమోరీ శనివారం తగ్గుముఖం పట్టింది. వరుస వర్షాలతో భూపాలపల్లి ఏరియాలోని గనులు బురదమయంగా మారాయి. గనుల వద్ద ఉన్న బంకర్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. బొగ్గు లారీల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సెలవురోజు విధుల్లోనే...
ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ప్రధాన శాఖల అధికారులు ఉద్యోగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కంట్రోల్ రూం కొనసాగింపు
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు.