బిజీ లైఫ్‌లో కాస్త ఊరట కోసం.. ఒత్తిడితో కూడిన జీవన విధానంలో కొంత మార్పుకోసం.. మానవ జీవితంతో ముడిపడిన అద్భుతమే ప్రక్రియ పర్యాటకం. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పలు ప్రదేశాల వీక్షణకు ప్రస్తుతం మరోసారి అవకాశం లభించనుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎకో టూరిజానికి కరోనా తర్వాత తిరిగి అనుమతి లభించడంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు.
సాక్షి, వరంగల్: కరోనా కారణంగా నిలిచిన ఎకో టూరిజం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. గత రెండేళ్ల క్రితం ఏటూరునాగారం అభయారణ్యం తాడ్వాయిలో పర్యాటకుల ఆనందం కోసం ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఆన్‌లైన్ ద్వారా ఈ ఎకో టూరిజం కోసం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో సైకిల్ ట్రాకింగ్, చిల్ర్డన్ ప్లే ఏరియా, వాక్ కెనాపిను వన కుటీరం ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం నుంచి కరోనా కారణంగా ఎకో టూరిజం నిలిచిపోయింది. మళ్లీ ఎకో టూరిజం ఆన్‌లైన్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ వారంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ఎకో టూరిజం అందుబాటులోకి రానుంది.
చిల్ర్డన్స్ ప్లే ఏరియా
తెరుచుకోనున్న అధ్యయన కేంద్రం
ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ గురించి తెలిపేలా.. పర్యావరణ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశారు. అభయారణ్యంలో ఉండే పక్షలు, అటవీ జంతువుల, చెట్లు బొమ్మలను కళ్లకు కట్టినట్లుగా చూపారు. వాక్ కెనాపీని మరమ్మతులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రెకింగ్ సైకిళ్లు మరమ్మతులకు రావడంతో కొత్త సైకిళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వన కుటీరాల్లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
పర్యావరణ అధ్యయన కేంద్రం
కొత్త సఫారి
పర్యాటకులు అడవుల్లో నేరుగా పర్యటించేందుకు కొత్తగా సఫారీ ఏర్పాటు చేయనున్నారు. తాడ్వాయి ఆర్చి నుంచి గ్రాస్ ప్లాంట్ దారి గుండా హైవే రోడ్డు అడవిలో నుంచి మేడారం మార్గంలోకి.. తాడ్వాయి సమీపంలోని సారలమ్మ గుడి నుంచి కామారం సమీపాన రాక్షస గుహలను సందర్శించి, అక్కడి నుంచి చిన్నబోయినపల్లి నుంచి కొండాయి మీదుగా కొండేటి వాచ్‌టవర్ వ్యూ పాయింట్ వరకు అటవీ మార్గాన పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు చేస్తున్నాం
ఎకో టూరిజం ఆన్‌లైన్ సేవలకు ఏర్పాట్లు చేస్తున్నాం. తాడ్వాయి వన కుటీరాల నుంచి ఆరు కిలోమీటర్లు అడవి మార్గం గుండా పర్యాటకులు సైకిల్ ట్రాకింగ్ నిర్వహించేలా ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నాం. ఈ వారంలో ఎకో టూరిజం సేవలను ప్రారంభిస్తాం.
– చౌకాట్ హుసేన్, వైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారి
బొగత వద్ద ట్రెక్కింగ్..
ములుగు జిల్లా వాజేడు మండల మరిధిలోని బొగత జలపాతం వద్ద కొత్తగా ఏర్పాట్లను చేపట్టనున్నారు. కరోనా కాలంలో బొగత జలపాతం పర్యాటకుల సందడి లేక వెల వెల బోయింది. ఎకో టూరిజం కూడా దూరంగా ఉండటంతో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గింది. మళ్లీ ఎకో టూరిజానికి పర్యాటక శాఖ ఉత్తర్వులతో జలపాతం వద్ద కొత్త హంగులను ఏర్పాటు చేయనున్నారు. గతంలో 2 కిలో మీటర్ల వరకు ట్రెక్కింగ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం రహదారి సౌకర్యం లేకుండాపోయింది. దానిని అభివృద్ధి చేయడానికి ఉన్నతాధికారుల అనుమతులకు నివేదికలను పంపగా అనుమతులు వచ్చాయి.
సైక్లింగ్ ప్రారంభిస్తున్న అటవీ శాఖ అధికారులు
కొత్తగా 1.50 కిలో మీటర్ల పరిధిలో సఫారీ ట్రావెలింగ్‌కు అనుమతులను కోరగా ఆమోదం లభించింది. వీటిని త్వరలోనే అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, గతంలో ఉన్న సైక్లింగ్ ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడంతో దానిని మరమ్మతులు చేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. జిఫ్ లైన్ సైతం దెబ్బ తిన్నప్పటికీ దానిని మరమ్మతులు చేసి పర్యాటకుల ఉత్సాహ పర్చడానికి వీలుగా అందించనున్నారు. బొగత వద్ద ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలను చేపడుతున్నారు.
లక్నవరం
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పరి ధిలోని లక్నవరం సరస్సు సందర్శనకు పర్యాటక శాఖ అనుమతి లభించింది. కరోనా కాలంలో ఆపేసిన పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కాజేట్‌లో ఉండేందుకు కరోనా కాలంలో అనుమతి నిరాకరించిన అధి కారులు ప్రస్తుతం అనుమతిస్తున్నారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జింకల పార్క్ తిరిగి ప్రా రంభించారు. సస్పెన్షన్ బ్రిడ్డిల నుంచి తూముల వరకు సైక్లింగ్, సమీపంలోని గుట్టలపై ట్రెక్కింగ్‌కు ఒక్కరికి రూ.100చొప్పున ప్రారంభించా రు. మరో పది రోజుల్లో నైట్ క్యాంపింగ్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో లక్నవరం ప్రాంతంలో వండర్ లా ను తలపించే విధంగా స్విమింగ్ ఏర్పాట్లను చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment