29 అడుగులు దాటిన లక్నవరం నీటిమట్టం
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు నీటిమట్టం 29 అడుగులు దాటింది. ఆదివారం మధ్యాహ్నం సరస్సులో 29 అడుగుల 3 అంగుళాల నీరుంది. ఈ మేరకు సరస్సు ప్రధాన కాల్వల్లోని నర్సింహుల, రంగాపురం కాల్వల కోసం నీటిని సద్దిమడుగులోకి వదిలారు. తర్వాత అక్కడి నుంచి కాల్వలకు నీటిని వదిలారు. ఇదిలా ఉండగా, సరస్సు తూముల వద్ద 24 అడుగుల ఎత్తులో రాళ్ల మధ్య నుంచి నీరు ఎక్కువగా లీకవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నీటిని విడుదల చేయాల్సిన సమయంలో కూడా నీటిపారుదల శాఖ అధికారులు రాకుండా స్థానిక గ్యాంగ్‌మెన్లతోనే పనులు చేయించడం గమనార్హం. పదివేల ఎకరాలకు సాగునీరందిస్తూ, పర్యాటక ప్రాంతంగా ప్రభు త్వానికి ఆదాయం సమకూరుస్తున్న సరస్సుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.