+786 నుంచి –511 వరకూ... | Sensex falls 1300 points from highs as 2 cases of coronavirus reported in India | Sakshi
Sakshi News home page

+786 నుంచి –511 వరకూ...

Published Tue, Mar 3 2020 5:04 AM | Last Updated on Tue, Mar 3 2020 5:07 AM

Sensex falls 1300 points from highs as 2 cases of coronavirus reported in India - Sakshi

సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ను తలపించింది. స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడి, చివరి అరగంటలో ఈ లాభాలన్నింటినీ కోల్పోయి భారీగా నష్టపోయి, మళ్లీ ఈ నష్టాల్లో మూడో వంతు వరకూ రికవరీ చేసుకొని ఓ మోస్తరు నష్టాల్లో ముగిసింది. వేల్యూ బయింగ్‌కు తోడు షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. ముడి చమురు ధరలు 2.2 శాతం తగ్గడం, కుంటుపడుతున్న అంతర్జాతీయ వృద్ధిని గాడిన పడేయడానికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు రేట్లను తగ్గిస్తాయని, ఉద్దీపన చర్యలు తీసుకుంటాయనే అంచనాలు...సానుకూల ప్రభావం చూపాయి. అయితే చివరి అరగంటలో సీన్‌ మారిపోయింది. భారత్‌లో తాజాగా రెండు కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ కేసులు వెలుగుచూడటంతో ఈ లాభాలన్నీ ఆవిరయ్యాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 153 పాయింట్లు పతనమై 38,144 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పతనమై 11,133 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు  ఏడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఆర్థిక, ఉక్కు, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు భారీగా పడ్డాయి. ఐటీ, టెక్నాలజీ సూచీలు మినహా మిగిలిన సూచీలు నష్టాల్లో ముగిశాయి.  

1,297 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌..
గత ఆరు రోజుల నష్టాల కారణంగా తీవ్రంగా పతనమై ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు (వేల్యూ బయింగ్‌)జోరుగా జరిగాయి. కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ ధాటికి విలవిలలాడుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు  ఉద్దీపన చర్యలు తీసుకోగలవన్న అంచనాలు, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు సానుకూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 786 పాయింట్ల లాభంతో 39,083 పాయింట్ల వద్దకు చేరింది. నిఫ్టీ కూడా 231 పాయింట్ల లాభంతో 11,433 పాయింట్లకు పెరిగింది. అయితే భారత్‌లో తాజాగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించడంతో సూచీలు కుప్పకూలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 511 పాయింట్ల నష్టంతో 37,786 పాయింట్లకు, నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 11,036 పాయింట్లను తాకాయి.

ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 1,297 పాయింట్లు, నిఫ్టీ 397 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్టానికి ఎగసిన భారత తయారీ రంగ వృద్ధి ఫిబ్రవరిలో ఒకింత మందగించినా ఆరంభంలో కొనుగోళ్లు జోరుగానే సాగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను ఫిచ్‌ సొల్యూషన్స్‌ సంస్థ 5.1 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించడం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో సూచీలు చెప్పుకోదగ్గ లాభాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. చివరకు మిశ్రమంగా ముగిశాయి.  

► ఎస్‌బీఐ అనుబంధ కంపెనీ, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌  పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఆరంభమైన నేపథ్యంలో ఎస్‌బీఐ  షేర్‌ 5% నష్టంతో రూ.287 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. సెన్సెక్స్‌ 153 పాయింట్ల నష్టంలో మూడో వంతు వాటా (55 పాయింట్లు) ఈ షేర్‌దే.  

► 400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, గెయిల్‌ ఇండియా, హీరో మోటోకార్ప్, హిందాల్కో, హిందుస్తాన్‌ జింక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మ్యారికో, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఆయిల్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, వేదాంత, ఏసీసీ, అపోలో టైర్స్, ఆశోక బిల్డ్‌కాన్, జిల్లెట్‌ ఇండియా, థెర్మాక్స్, లుపిన్, రేమండ్, భెల్, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, టాటా పవర్, విప్రో తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

► ఫిబ్రవరిలో వాహన అమ్మకాలు పుంజుకోవడంతో ఎస్కార్ట్స్‌ షేర్‌ 8 శాతం లాభంతో రూ.843 వద్ద ముగిసింది.  

► నేడు(మంగళవారం) బోర్డ్‌ మీటింగ్‌ జరగనున్న నేపథ్యంలో మిధాని షేర్‌ ఇంట్రాడేలో 13 శాతం లాభంతో ఆల్‌టైమ్‌ హై, రూ.278ను తాకింది. చివరకు 3 శాతం నష్టంతో రూ.238 వద్ద ముగిసింది. ఈ సమావేశంలో కంపెనీ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం.


పుల్‌బ్యాక్‌ ర్యాలీకి బ్రేక్‌!
గత ఆరు రోజులుగా 7 శాతం మేర నష్టపోయిన మార్కెట్లో ఈ వారం పుల్‌బ్యాక్‌ ర్యాలీ ఉండొచ్చని అంచనాలున్నాయని షేర్‌ఖాన్‌ బై బీఎన్‌పీ పారిబా అనలిస్ట్‌ గౌరవ్‌ దువా పేర్కొన్నారు. ఈ అంచనాలకనుగుణంగానే పుల్‌బ్యాక్‌ ర్యాలీ వచ్చినప్పటికీ, కొత్తగా నమోదైన కరోనా కేసులు ఈ పుల్‌బ్యాక్‌ ర్యాలీని ఆరంభంలోనే నిలువరించాయని వ్యాఖ్యానించారు.  ప్రపంచ మార్కెట్లు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్లో పతనం తప్పలేదని వివరించారు.

ఏడు రోజుల నష్టాల కారణంగా రూ.13 లక్షల కోట్లు మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌రూ.13 లక్షల కోట్లు తగ్గి రూ.145.80 లక్షల కోట్లకు పడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement