
మంబై: దేశంలో కోవిడ్ కేసులు రోజుకో కొత్త గరిష్టాన్ని నమోదు చేస్తున్న తరుణంలోనూ స్టాక్ మార్కెట్ వరుసగా రెండోరోజూ లాభపడింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఆటుపోట్లకు గురైన సూచీలు ఐటీ, ఆర్థిక, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్ల అండతో గురువారం లాభాలతో గట్టెక్కాయి. రూపాయి రికవరీ అవడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 48,804 వద్ద ముగిసింది. నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 14,581 వద్ద నిలిచింది. ఫార్మా, మెటల్, ప్రైవేట్ రంగ షేర్లు కూడా రాణించాయి.
ఆటో, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 877 పాయింట్ల రేంజ్లో కదలాడగా, నిఫ్టీ 245 పాయింట్ల పరిధిలో ట్రేడైంది. మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్ కంపెనీల యాజమాన్యాలు మెరుగైన అవుట్‌లుక్‌ను ప్రకటించడంతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాతో పాటు చైనా మెరుగైన ఆర్థిక గణాంకాలను ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.980 కోట్ల విలువైన షేర్లను కొనగా, సంస్థాగత(దేశీయ) ఇన్వెస్టర్లు రూ.580 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
ఇన్ఫీ.. లాభాల స్వీకరణ...
నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోవడంతో విఫలం కావడంతో ఇన్ఫోసిస్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో ఈ కంపెనీ షేరు 3% నష్టంతో రూ.1361 వద్ద ముగిసింది. ఒకదశలో 6% క్షీణించింది.
‘మహా’ కర్ఫ్యూతో ఆటో షేర్లు రివర్స్...
కరోనా కేసుల కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జనతా కర్ఫ్యూ ప్రభావం ఆటో రంగ షేర్లను నష్టాల బాట పట్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి మే 1 వరకు 144 సెక్షన్ అమల్లోకి ఉంటుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 20%కి పైగా ఆటో ఉపకరణాలు ఈ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతాయి. లాక్ డౌన్ తరహా ఆంక్షలతో ఆటో మొబైల్స్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో స్టాక్ మార్కెట్లో ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐషర్, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్జ్, మారుతీ షేర్లు 3% నష్టపోయాయి. మదర్‌సుమీ, ఎంఆర్ఎఫ్, భాష్ షేర్లు 2% క్షీణించాయి.