విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్: కంటిమీద కునుకులేకుండా చేసిన వర్షం సోమవారం శాంతించింది. వారం రోజుల తరువాత సూర్యుడు దర్శనమిచ్చాడు. అయితే బాధితులు కోలుకోలేనిస్థితిలో ఉన్నారు. కష్టం, పెట్టుబడి అన్నీ వర్షార్పణం అవడంతో అన్నదాత గుండెలవి సేలా రోదిస్తున్నాడు. సమస్తం కోల్పోయిన చాలా కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమని గడుపుతున్నాయి. చాలా ఊళ్లు నీళ్లలో తేలుతున్నాయి. నానిపోవడంతో ఎప్పుడు ఏ గోడ కూలిపోతుందో, ఏ ఇల్లు పడిపోతోందనని గ్రామీణులు భీతిల్లుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో పూసపాటిరేగ, భోగాపురం, బొబ్బిలి నియోజకవర్గంలో రామభద్రపురం, ఎస్.కోట నియోజకవర్గంలో జామి, కొత్తవలస మండలాలకు భారీగా నష్టం ఏర్పడింది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భోగాపురంలో 19.8, కొమరాడలో 13, పార్వతీపురంలో 6.9, కురుపాంలో 6.6, పూసపాటిరేగలో 5.2, గుమ్మలక్ష్మీపురంలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో నామమాత్రపు వర్షపాతం నమోదైంది.
జిల్లాకు రూ 113 కోట్లు నష్టం
అల్పపీడన వర్షాలు భారీనష్టాన్ని మిగిల్చాయి. పత్తి, మొక్కజొ న్న, ఉద్యాన రైతులకు తేరుకోలేని నష్టం ఏర్పడింది. అక్టోబర్ నెలలో సాధారణ వర్షపాతం 167.9 మిల్లీమీటర్లు కాగా, 304 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల వల్ల రూ. 113 కోట్ల 60 లక్షల నష్టం వాటిల్లింది. వీటిలో పంటలు నష్టం రూ.24.11 కో ట్లు కాగా, రోడ్లు, మంచినీటి పథకాలు, చెరువులు, భవనాలు, ఇళ్లు కూలడంతో రూ.89.59 కోట్లమేర నష్టం వాటిల్లింది. వరి 7,470 ఎకరాలు, మొక్కజొన్న 3,737, పత్తి 18,979, చెరకు 191, పెసర 680, మినుము 475, వేరుశనగ 471, మిరప 60, రాగి 8, కొర్ర 2.5,కూరగాయలు 1368 ఎకరాలు, అరటి 75, ఉల్లి 57, బొప్పాయి 583 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అధికారుల ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలకుగాను 10.10 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖాధికారులు అంచనావేశారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా నగదు రూపంలో నష్టాన్ని అంచనా వేయలేదు.
వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు వంటి ఖరీఫ్ పంటలకు 13.90 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. పశుసంవర్థక శాఖకు సంబంధించి ఆరు మేకలు, ఒక గేదె చనిపోవడంతో వాటికి గాను 25వేలు, సెరీకల్చర్‌కు సంబంధించి మల్బరి తోటలు, పట్టుపురుగుల గుడ్లు పాడవడంతో రూ. లక్షా 25వేలు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మత్స్యశాఖకు సంబంధించి 81 వలలు దెబ్బతిన్నాయి, 30 టన్నులు చేపలు మృతి చెందాయి, 14 చెరువులకు గండ్లు పడడంతో రూ. 58 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేశారు. గ్రామీణనీటి సరఫరా విభాగానికి సంబంధించి దెబ్బతిన్న ట్యాంకులను మరమ్మతుచేయడానికి 28 లక్షల 40 వేలు అవసరమవుతుందని గుర్తించారు. ఆర్ అండ్‌బీకి సంబంధించి విజయనగరం డివిజన్‌లో 177 కిలోమీటర్ల మేర పాడైన రోడ్లకు గాను 42.83 లక్షలు, ఐటీడీఏ పరిధిలో 36 కిలోమీటర్లకు సుమారు రూ 3 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే మీడియం, మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి మరమ్మతులు చేపట్టడానికి 10 కోట్ల 63 లక్షలు, నేలమట్టమైన ఇళ్ళకు నష్టపరిహారంగా అందించేందుకు రూ 37,95,000 అవసరమని అంచనావేశారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తం గా రోడ్లు, ఇతర పనులుకు గాను 20 కోట్ల రూపాయలు, విజయనగరం మున్సిపాలిటీకీ ఆరు కోట్లు, బొబ్బిలి మున్సిపాలిటీకి 40 లక్షలు, సాలూరు మున్సిపాలిటీకి పది లక్షలు చొప్పు న నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖకు 13.13 లక్షలు నష్టం ఏర్పడింది. 14 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 16 వె నుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల భవనాలు దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించి అంచనాలు రూపొందించవలసి ఉంది.