ఏ యే రోజు.. ఏమేం చేయాలి? పట్టు దిగుబడికి చక్కని చుక్కాని!
చిన్న తప్పులతోనే భారీ నష్టాలు
అయితే, క్రమశిక్షణ కలిగిన పట్టు రైతుకు నష్టం వచ్చే ప్రసక్తే లేదంటారు పట్టు పురుగుల పెంపకంపై సుదీర్ఘ అనుభవం గడించడంతోపాటు అనేక యంత్రాలను స్వయంగా రూపొందించిన రైతు శాస్త్రవేత్త గాండ్ల గురుమూర్తి(98491 26223). చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు ఆయన స్వగ్రామం. సునిశితమైన పరిశీలనాసక్తి కలిగిన ఆయన దశాబ్దకాలంగా పట్టు పురుగుల పెంపకంలో నికర లాభాలు ఆర్జిస్తున్నారు. కానీ, ఈ రంగంలోకి అడుగుపెట్టిన రైతులు చాలా మంది నష్టపోతుండడం ఆయనను కలచి వేసింది. ఏ పూట ఏం పని చేయాలో ముందే స్పష్టంగా తెలుసుకొని.. మెలకువలను శ్రద్ధగా పాటించగలిగితే నష్టాల ఊసే ఉండదనేది గురుమూర్తికి గట్టి నమ్మకం. రైతులు, అధికారుల నుంచి సైతం ప్రశంసలందుకున్న ఆయన తనకు తెలిసిన మెలకువలను రైతులందరికీ స్పష్టంగా తెలియజెపితే మేలని భావించారు. పట్టు సేద్యంలో ఏడాది పొడవునా ఏ యే పూట ఏమేం పనులు చేయాలో సూచిస్తూ ఒక టైం టేబుల్‌ను రూపొందించారు. కొత్తగా పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులకే కాదు.. తమకు తెలియకుండానే చిన్నా చితకా తప్పులు చేస్తూ భారీగా నష్టపోయే పట్టు రైతులకు కూడా ఈ కాల ప్రణాళిక అపూర్వమైన కరదీపిక వంటిదంటే అతిశయోక్తి కాదు.
ఆలస్యం అమృతం విషం..
సమయపాలన, ఆర్థిక ప్రణాళిక, రోజువారీ వ్యవహారాలను సమన్వయం చేస్తూ రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా రూపొందించారు. అతి చిన్న అంశానికి సైతం ఈ ప్రణాళికలో ప్రాముఖ్యత కల్పించడం విశేషం. మల్బరీ సేద్యం ప్రారంభం నంచి పట్టు గూళ్ల అమ్మకం వరకూ చేయవలసిన పనుల వివరాలు ఇందులో ఉన్నాయి. షెడ్‌లో ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాల విషయంలో అప్రమత్తంగా ఉండటం. ఆకు ఫీడింగ్, నాణ్యత, పనివేళలు, కూలీల సంఖ్య, వర్షం వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు సహా పలు వివరాలు ఇందులో ఉన్నాయి. పట్టు పురుగులకు అర గంట ఆలస్యంగా మేత వేసినా పట్టు పురుగులు స్పందించే తీరులో తేడా వస్తుంది. అందుకే ఫలానా సమయానికి ఫలానా పని చేయాలని స్పష్టంగా సూచించారు.
ప్రతి దశలో పంటలో వచ్చే మార్పులపై రైతుకు కచ్చితమైన అవగాహన ఉండాలంటారు గురుమూర్తి. మల్బరీ సాగులో తలెత్తే ఇబ్బందులు, నివారణ చర్యలు, కొద్ది పాటి నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలు, పని చేసే క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఆదాయం, ఖర్చు, మిగులు.. తదితర అంశాలను నియమిత క్రమంలో ఈ కాల ప్రణాళికలో పేర్కొన్నారు. రాబోయే వారం రోజుల్లో చేయవలసిన పనుల వివరాలు తెలుసుకొని వనరులను సర్దుబాటు చేసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. హడావిడి లేకుండా నిర్ణీత సమయానికి స్థిమితంగా పని పూర్తిచేయటం వీలవుతుంది. తద్వారా నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తి జరుగుతుంది. దిగుబడి పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే రైతు పనిలో అనుకోని అవాంతరాలెదురైనా ఎదుర్కోగలుగుతాడంటారు గురుమూర్తి. పంట తీత పూర్తయ్యాక.. మొత్తం ఖర్చెంత? ఆదాయం ఎంత? నికరంగా మిగిలిందెంత? అనేది రైతుకు అవగాహన కలిగించేలా ప్రణాళికను రూపొందించారు. రైతులు ఎదుర్కొనే అన్ని సమస్యలకూ పరిష్కారాలు ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయి ఆచరణ మాత్రం రైతుకు వల్ల పడటం లేదు. అందువల్లే నష్టపోతున్నాడు. అన్ని పంటలకు సంబంధించీ ఇలాంటి కాల ప్రణాళికలు తయారుచేయడం అవసరం. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ పని చేయగలిగితే రైతులకు మేలు చేసినవాళ్లవుతారని గురుమూర్తి అంటున్నారు.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్