ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్ ప్రతాపం చూపింది. ఫలితంగా కొత్త ఏడాదిలో జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడవుతున్న సెన్సెక్స్ గత, 18 నెలల్లో భారీ పతనాన్ని బుధవారం చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు(8.46%)పతనం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆందోళనలు, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం గతేడాది (2023) చైనా ఆర్థిక వృద్ధి నిరాశపరచడం తదితర పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి.
సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్‌ఈలో రూ.4.69 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.370 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా గడిచిన 2 రోజుల్లో రూ.5.73 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
రోజంతా నష్టాల్లోనే ట్రేడింగ్
ఉదయం సెన్సెక్స్ 1,130 పాయింట్ల పతనంతో 71,999 వద్ద, నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో 21,647 వద్ద మొదలయ్యాయి. తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,699 పాయింట్లు క్షీణించి 71,429 వద్ద, నిఫ్టీ 482 పాయింట్లు దిగివచ్చి 21,550 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పడ్డాయి. చివరికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు నష్టపోయి 71,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 460 పాయింట్లు పతనమై 21,572 వద్ద స్థిరపడ్డాయి. 2022 జూన్ 13 తర్వాత సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం.
► చైనా ఆర్థిక వృద్ధి రేటు 2023లో (5.2%) అంచనాలు అందుకోలేకపోవడం, డాలర్ ఇండెక్స్ నెల గరిష్టానికి చేరుకోవడంతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెయిల్ 5%, టాటా స్టీల్, నాల్కో, జిందాల్ స్టీల్ షేర్లు 4% పతనమయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎన్‌ఎండీసీ, వేదాంత, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3%, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో జింక్ షేర్లు 2.5% నుంచి ఒకశాతం చొప్పున నష్టపోయాయి.
హెచ్‌డీఎఫ్‌సీకి.. రూ.1.07 లక్షల కోట్ల నష్టం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరిచాయి. రుణ వృద్ధి, లిక్విడిటీ కవరేజ్ రేషియో(ఎల్‌సీఆర్)లపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్‌ఎస్‌ఏ, మోర్గాన్ స్టాన్లీలు షేరు రేటింగ్ తగ్గించాయి. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు 8.46% నష్టపోయి రూ.1,537 వద్ద ముగిసింది. బ్యాంకు మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.1.07 లక్షల కోట్లు ఆవిరై రూ.11.66 లక్షల కోట్లకు దిగివచి్చంది.
అత్యంత విలువైన పీఎస్‌యూగా ఎల్‌ఐసీ
ఎల్‌ఐసీ కంపెనీ అరుదైన రికార్డు సృష్టించింది. ప్రభుత్వ రంగ లిస్టెడ్ కంపెనీల్లో అత్యంత విలువైనదిగా అవతరించింది. ఈ షేరు ఇంట్రాడేలో 3% లాభపడి రూ.919 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో 1% నష్టంతో రూ.887 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.5.60 లక్షల కోట్లకు చేరింది. ఎస్‌బీఐ షేరు 1.67% తగ్గింది. మార్కెట్ క్యాప్ రూ.5.58 లక్షల కోట్లుగా నమోదై రెండో స్థానానికి దిగివచ్చింది.
కుప్పకూలింది ఇందుకే...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పతన ప్రభావం
అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (8.46%) నష్టం పతనం సూచీల భారీ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460 పాయింట్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటాయే 235 పాయింట్లు కావడం గమనార్హం.
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఆందోళన
యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవడంతో ‘వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమెరికాలో పదేళ్ల కాల పరిమితి కలిగిన బాండ్లపై రాబడులు(4.04%) ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి బాండ్లలోకి తరలిపోతాయనే ఆందోళనలు అధికమయ్యాయి. అలాగే క్రూడాయిల్‌తో పాటు ఇతర కమోడిటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెలరోజుల గరిష్టానికి చేరడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల డీలా
ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా అంచనాలు, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన సంకేతాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్లు 2% క్షీణించి నెల రోజుల కనిష్టానికి దిగివచ్చాయి. యూరప్ మార్కెట్లు 2 శాతం మేర క్షీణించాయి. అమెరికా ఒక శాతానికి పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతన ప్రభావం దలాల్ స్ట్రీట్‌పైనా పడింది.
Comments
Please login to add a commentAdd a comment