
స్టాక్ సూచీలకు మళ్లీ నష్టాలు
ముంబై: ఆరంభ నష్టాల నుంచి తేరుకొన్న స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 466 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ చివరికి 29 పాయింట్ల నష్టంతో 75,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22,945 వద్ద నిలిచింది. దీంతో సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా కాసేపు లాభాల్లో ట్రేడయ్యాయి.
ఇండస్ట్రియల్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెలికం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో మిడ్ సెషన్ కల్లా సెన్సెక్స్ 466 పాయింట్లు క్షీణించి 75,531 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 22,801 వద్ద కనిష్టాన్ని నమోదు చేశాయి.
అయితే మిడ్‌సెషన్ నుంచి ఐటీ, వినిమయ, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన షేర్లు రాణించడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి.డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసలు బలహీనపడి 86.98 వద్ద స్థిరపడింది.
⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% క్షీణించింది. మిడ్ క్యాప్ సూచీ 0.19 శాతం నష్టపోయింది.
రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద
స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్‌ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది.