ముంబై: ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమైన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 898 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ చివరికి 33 పాయింట్ల లాభంతో 55,702 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 268 పాయింట్లు వరకు ర్యాలీ చేసింది. మార్కెట్ ముగిసే సరికి ఐదు పాయింట్ల అతి స్వల్ప లాభంతో 16,683 వద్ద నిలిచింది. దీంతో సూచీలు మూడురోజుల నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఐటీ, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు అరశాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,075 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,229 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 16 పైసలు బలపడి 76.24 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీ ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.
భారీ లాభాల నుంచి ఫ్లాట్‌గా ముగింపు
ఆర్‌బీఐ ఆకస్మిక రెపోరేటు పెంపుతో బుధవారం భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 586 పాయింట్లు పెరిగి 56,255 వద్ద, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 16,855 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో సెన్సెక్స్ 898 పాయింట్లు దూసుకెళ్లి 56,567 వద్ద, నిఫ్టీ 268 పాయింట్లు 16,946 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి అమ్మకాల వెల్లువెత్తడంతో ఆరంభ లాభాల్ని కోల్పోయి ఫ్లాట్‌గా ముగిశాయి.
‘‘ఫెడ్ రిజర్వ్, ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు అంశాలను డిస్కౌంట్ చేసుకున్న ఇన్వెస్టర్లు తొలి సెషన్‌లో కనిష్ట స్థాయిల వద్ద షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దేశీయ సేవా రంగ కార్యకలాపాలు ఏప్రిల్‌లో పుంజుకొని ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అయితే మిడ్‌సెషన్ నుంచి అధిక వెయిటేజీ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. దీనికి తోడు అమెరికా స్టాక్ ఫ్యూచర్లు అనూహ్యంగా నష్టాల్లోకి మళ్లడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీల ఆరంభ లాభాలన్నీ మాయమయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►ఒడిదుడుకుల మార్కెట్లో ఐటీ షేర్లు రాణించాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్ షేర్లు 4% నుంచి 1%లాభపడ్డాయి.
►మార్చి క్వార్టర్‌లో నికరలాభం రెండు రెట్లు పెరగడంతో ఏబీబీ ఇండియా షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 10.5% పెరిగి రూ.2,224 వద్ద స్థిరపడింది.
►ట్రేడింగ్‌లో 12% ర్యాలీ చేసి రూ. 2,251 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది.
►షేర్ల బైబ్యాక్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతుందనే వార్తలతో మాట్రిమోనీడాట్ కామ్ షేరు 5% లాభంతో రూ.729 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment