ముంబై: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు ఆకాశాన్నంటుతుండటం, రూపాయి పతనమవడం వంటి అంశాలు దేశీ విమానయాన సంస్థల రికవరీ ప్రక్రియకు పెను సవాలుగా పరిణమించే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక జెట్ ఎయిర్‌వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుండటం, ఆకాశ ఎయిర్ సర్వీసులు మొదలుపెట్టడం వంటివి ఎయిర్‌లైన్స్ మధ్య పోటీని మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది.
సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 45 శాతం దాకా ఉంటుంది. నిర్వహణ వ్యయాల్లో 35–40 శాతం భాగం అమెరికా డాలర్ మారకంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ రేట్లు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వంటివి ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలతో ఏటీఎఫ్ రేట్లు ఆగస్టులో ఏకంగా 77 శాతం ఎగిశాయి.
‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రూపాయి క్షీణత వల్ల పరిశ్రమ ఆదాయాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. సీజనల్‌గా ఉండే ప్రయాణాల ధోరణుల కారణంగా జూన్‌తో పోలిస్తే జులైలో ప్రయాణికుల సంఖ్య 7 శాతం తగ్గినట్లు ఇక్రా పేర్కొంది. టికెట్ చార్జీలు పెరుగుతుండటం కూడా విహార యాత్రల ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. ఆగస్టు 31 నుంచి చార్జీలపై పరిమితులు ఎత్తివేస్తున్నందున .. విమానయాన సంస్థలు వ్యయాల భారాన్ని రేట్ల పెంపు రూపంలో ప్రయాణికులకు బదలాయించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా పేర్కొంది. అయితే, పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నందున ఎకాయెకిన చార్జీల పెంపు భారీగా ఉండకపోవచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment