కరోనా దెబ్బతో అతలాకుతలమైన ఏవియేషన్ సెక్టార్‌పై రష్యా - ఉక్రెయిన్ వార్ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది. అంతర్జాతీయ ఉద్రిక్తలతో గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఏవియేషన్ ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. చివరి సారిగా ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో విమానాలు నడిపించడం కత్తిమీద సాములా మారింది.
పెరిగిన ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు సర్వీసు ప్రొవైడర్లకు ఇబ్బందికరంగా మారాయి. విమాన సర్వీసుల నిర్వాహాణలో 40 శాతం వ్యయం కేవలం ఫ్యూయల్‌కే వెళ్తుంది. దీంతో పెరుగుతున్న ధరలు ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంధన పొదుపుకు సంబంధించి ఏం చేయాలనేది వారికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ సీఈవో సంజీవ్ కపూర్‌కి ఆసక్తికరమైన సూచన చేశాడు విశాల్ శ్రీవాత్సవ అనే నెటిజన్.
విమానం నడిపే క్యాబిన్ క్రూలో మీరు ఎందుకు ఎక్కువ మంది మగవాళ్లనే నియమిస్తున్నారు? పురుషులతో పోల్చితే మహిళలు తక్కువ బరువు ఉంటారు. దీంతో తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మీరు లేడీ కేబిన్ క్రూను తీసుకోవడం ద్వారా ప్రతీ ఫ్లైట్‌కి కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతాయి అనుకున్నా.. రోజుకు వంద ఫ్లైట్లు నడిపిస్తారనుకున్నా.. ఏడాదికి కనీసం రూ. 3.5 కోట్ల వ్యయం తగ్గుతుంది కదా ? అంటూ ప్రశ్నించాడు.
విశాల్ శ్రీవాత్సవ సంధించిన ప్రశ్నలకు జెట్ ఎయిర్‌వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందిస్తూ.. మంచి ఐడియా ఇచ్చారు విశాల్. కేవలం కేబిన్ క్రూ విషయంలోనే ఈ నియమం ఎందుకు అమలు చేయాలి ? ప్రయాణికుల్లో కూడా మొత్తం మహిళలే ఉండేలా చూసుకోవడం లేదా కనీసం మగ ప్యాసింజర్లను తగ్గించినా కూడా ఫ్యూయల్ బాగానే ఆదా అవుతుంది కదా అంటూ బదులిచ్చారు.
Extending that logic, imagine the savings if one were to carry only female passengers! Or charge male passengers more! 😉 https://t.co/3GP2YETBnV
— Sanjiv Kapoor (@TheSanjivKapoor) March 22, 2022
మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉన్నా అది దీర్ఘకాలంలో లింగ వివక్షకు దారి తీస్తుంది. అంతే కాదు చట్టపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకునేందుకు మహిళా క్రూ అనేది అంత సబబైన విధానం కాదంటూ వివరణ ఇచ్చారు సంజీవ్ కపూర్. మొత్తంగా పెరుగుతున్న ఫ్యూయల్ ఛార్జీలతో ఏవియేషన్ సెక్టార్ ఎంతగా ఇబ్బంది పడుతుంతో తెలిపేందుకు విశాల్, సంజీవ్ కపూర్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉదాహారణగా నిలుస్తోందంటున్నారు నెటిజన్లు.
చదవండి: నష్టాల ఊబిలో ఏవియేషన్
Comments
Please login to add a commentAdd a comment