ప్రముఖ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రిత్యా మరో ఆరు నెలల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ముంబైకి చెందిన జెజె హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా తన శరీరంలో క్యాన్సర్ కారకమయ్యే మాలిగ్నెన్సీ అనే కణతి పెరిగిపోతుందని, వైద్యం కోసం మధ్యంతర బెయిల్ కోరినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
గోయల్ తరపు న్యాయవాది అబద్ పోండా సైతం మెడికల్ రిపోర్టులను కోర్టుకి అందజేశారు. గోయల్ అనారోగ్యానికి చికిత్స తీసుకునేందుకు జైలులో సరైన వసతులు లేవు. ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందే హక్కు ఉందని అన్నారు.
కీమోథెరపీ తర్వాత కోలుకోవడానికి వైద్య చికిత్స, పరిశుభ్రమైన వాతావరణం అవసరం కాబట్టే గోయల్‌కు ఆరు నెలల మెడికల్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. తన క్లయింట్ చికిత్స పొందిన తర్వాత, పరిశుభ్రత సమస్యలు ఉంటాయని, ఫలితంగా అతను ఇతర ఖైదీలతో కలిసి జీవించలేరని పోండా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం పోండా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో చికిత్స పొందవచ్చని, పోలీసు ఎస్కార్ట్ సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపింది. కాగా, ఈ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కుటుంబసభ్యులకు సైతం
మోసం-అవినీతి ఆరోపణలు. వేలాది మందిని రోడ్డున పడేశారన్న అపఖ్యాతి. దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు. కుటుంబానికి దూరమై జైలులో దుర్భర జీవితం. చచ్చిపోతా.. అనుమతించండంటూ కోర్టుకు విజ్ఞప్తులు. ఇదీ.. జెట్ ఎయిర్‌వేస్ అధిపతి నరేశ్ గోయల్ దుస్థితి. నరేష్ గోయల్ తో పాటు ఆయన భార్యకు క్యాన్సర్, కుమార్తెకు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ ఇద్దరి బాగోగులు చూసుకునేందుకు ఎవరూ లేక, జైలు జీవితం అనుభవించ లేక దయచేసి జైల్లోనే చచ్చిపోయేందుకు నాకు అనుమతివ్వండి అంటూ కొద్దిరోజుల క్రితం కోర్టును ప్రాధేయపడ్డారు. ఇప్పుడు నరేష్ సైతం క్యాన్సర్ భారిన పడడం వైద్యం నిమిత్తం బెయిల్ మంజూరు చేయడంపై ఆయన ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఆయన దుర్బర జీవితం గురించి తెసుకున్న వారు సైతం నరేష్ గోయల్ కష్టం... పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు.
రూ.538 కోట్ల మోసం కేసులో
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్‌లో రూ.538 కోట్ల మోసానికి పాల్పడ్డారని నరేశ్ గోయల్, ఆయన భార్య అనితతోసహా ఇతర జెట్ ఎయిర్‌వేస్ మాజీ ఉద్యోగులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగానే మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దాఖలు చేసింది. బ్యాంక్ రుణ నిధులను మళ్లించారని, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్ 1న గోయల్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment