
దేశంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం హాజరయ్యారు. ఈ తరుణంలో భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు ఊపందుకున్నాయి.
దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా - ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ల మధ్యం ఒప్పందం జరిగింది. ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో హెచ్ 125 హెలికాప్టర్‌లను తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. అందుకు సంబంధించిన ఒప్పందాలు సైతం చివరి దశకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య పలు ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఏ320, ఏ350 వంటి కమర్షియల్ జెట్‌ల కోసం ఎయిర్‌బస్‌కు విడిభాగాలను తయారు చేయడానికి, సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. అదనంగా భారత వైమానిక దళం కోసం టాటా, ఎయిర్‌బస్‌లు సీ295 సైనిక రవాణా విమానాన్ని తయారు చేయనున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.