న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 133 శాతం దూసుకెళ్లి రూ. 7,100 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 3,043 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 25 శాతం ఎగసి రూ. 1,10,600 కోట్లకు చేరింది. ఆటో విభాగంలోనూ మూడు రకాల బిజినెస్‌లూ సానుకూల పనితీరును చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది.
సీజనాలిటీ నేపథ్యంలో ఈ ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరింత మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అంచనా వేసింది. ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల, మెరుగైన సరఫరాలు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. వాణిజ్య వాహన(సీవీ) ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 20,100 కోట్లను తాకింది. దేశీ సీవీ విక్రయాలు 1 శాతం వృద్ధితో 91,900 యూనిట్లకు చేరగా.. ఎగుమతులు 14 శాతం ఎగసి 4,800 యూనిట్లుగా నమోదయ్యాయి.
ప్రయాణికుల వాహన అమ్మకాలు 5 శాతం పుంజుకుని 1,38,600 యూనిట్లకు చేరాయి. ఆదాయం 11 శాతం అధికమై రూ. 12,900 కోట్లను తాకింది. బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్‌ఆర్ ఆదాయం 22 శాతం జంప్‌చేసి 7.4 బిలియన్ పౌండ్లకు చేరింది.
తగ్గిన రుణ భారం
ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ నికర రుణ భారాన్ని రూ. 9,500 కోట్లమేర తగ్గించుకోవడంతో రూ. 29,200 కోట్లకు చేరుకున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్లు రెట్టింపునకుపైగా బలపడి 8.8 శాతాన్ని తాకినట్లు వెల్లడించింది. ప్రణాళికలకు అనుగుణంగా రుణ తగ్గింపు లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
విభిన్న వ్యూహాల ఆధారంగా చేపడుతున్న బిజినెస్ నిర్వహణ సంతృప్తికర ఫలితాలను చూపుతున్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. పూర్తి ఏడాదిని పటిష్ట పనితీరుతో ముగించనున్నట్లు అభిప్రాయపడ్డారు. రానున్న త్రైమాసికాలలోనూ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. మెరుగైన ఫలితాలను కొనసాగించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 879 వద్దే ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment