
టేపరింగ్ భయాలతో రూపాయి డౌన్
ముంబై: అమెరికాలో సహాయక ప్యాకేజీ ఉపసంహరణ (టేపరింగ్) భయాలతో దేశీ స్టాక్‌మార్కెట్ల తరహాలోనే రూపాయి మారకం విలువ కూడా గురువారం పతనమైంది. డాలర్‌తో పోలిస్తే 36 పైసలు క్షీణించి 62.93 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) స్టాక్స్ కొనుగోళ్లు తక్కువ చేయడం, దిగుమతిదారుల (చమురు రిఫైనింగ్ సంస్థలు) నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగటం కూడా రూపాయిపై ప్రభావం చూపిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.57 కన్నా బలహీనంగా 62.85 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరికి 0.58 శాతం క్షీణతతో 62.93 వద్ద ముగిసింది. అమెరికాలో రిటైల్ అమ్మకాల గణాంకాలు మెరుగ్గా ఉండటం డాలర్ బలపడేందుకు తోడ్పడిందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా తెలిపారు.