కరుగుతున్న అమెరికా కలలు | How falling rupee is affecting Indian students abroad | Sakshi
Sakshi News home page

కరుగుతున్న అమెరికా కలలు

Published Thu, Sep 20 2018 3:54 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

How falling rupee is affecting Indian students abroad - Sakshi

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో డాలర్‌ విలువ అనూహ్యంగా పెరిగిపోవడం, రూపాయి విలువ పతనంతో అమెరికాలో భారతీయ విద్యార్థుల తిప్పలు అన్నీఇన్నీ కావు. రూపాయి పతనంతో కొందరు మోదీ పాలనపై విరుచుకుపడుతోంటే, మరికొందరు కాంగ్రెస్‌ పార్టీని దూషిస్తున్నారు. రాజకీయ కారణాలను పక్కన పెడితే ఆశల రెక్కలు తొడుక్కుని అమెరికాలోకి అడుగుపెడుతున్న వారిని రూపాయి పతనం కలవరపెడుతోంది. ఆరు నెలల క్రితం డాలర్‌ విలువ రూ.65 స్థాయి నుంచి ఈ నెలలో ఏకంగా రూ.72.54కు పడిపోవడంతో అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల అంచనాలకు, ప్రస్తుత ఖర్చులకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడుతోంది.

రూపాయి విలువను బట్టే ప్రయాణాలు
గతంలో అమెరికాలో వారానికి 3 మూడు రోజులు పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసే వాళ్లు సైతం ప్రస్తుతం నిద్రాహారాలు మానేసి ప్రతిరోజూ పనిచేసేందుకు పరుగులు పెడుతున్నారు. దీంతో అటు పిల్లలూ, వాళ్ళ ఖర్చులకు డబ్బులు పంపాల్సిన తల్లిదండ్రులూ తమతమ అవసరాలను కుదించుకోవడమో, లేదంటే ఖర్చుతో కూడుకున్న ప్రయాణాలను మానుకోవడమో చేస్తున్నారు.  

పిల్లల ఖర్చుల కోసం త్యాగాలు
రూపాయి విలువ పడిపోవడంతో విద్యా రుణాలతో అమెరికా వెళ్లిన భారతీయ యువతీయువకుల అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడి విశ్వవిద్యాలయాలకు చెల్లించాల్సిన ఫీజుల భారీగా పెరగడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ముంబైకి చెందిన ప్రఫుల్ల వేదక్‌ డాలర్‌ విలువ రూ.65గా ఉన్నప్పుడు తమ ఇద్దరు పిల్లల్ని అమెరికాలో చదివించేందుకు బ్యాంకులోన్లూ, ఇతర ఖర్చులపై ప్రణాళిక వేసుకున్నారు. రూపాయి పతనం ప్రారంభం కావడంతో కొద్దికాలం ఎదురుచూశారు. అయినా రూపాయి విలువ పెరగకపోగా మరింత దిగజారింది. దీంతో విశ్వవిద్యాలయానికి చెల్లించాల్సిన ఫీజుతో పాటు జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా అనుకున్న దానికంటే ఎక్కువ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పెద్దకొడుకు స్నాతకోత్సవ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్న వేదక్‌ దంపతులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.  

పెరిగిన విదేశీ ఖర్చు
రూపాయి విలువ పతనంతో ప్రతి సెమిస్టర్‌కు కట్టాల్సిన ఫీజు సగటున రూ.10,000 నుంచి రూ.12000కు పెరిగిపోయింది. 7–9 శాతానికి పైగా అదనపు భారం పడడంతో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన భారతీయ విద్యార్థులు ఒక్క ట్యూషన్‌ ఫీజు విషయంలోనే  రూ.60వేల వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. జీఆర్‌ఈ, టోఫెల్, జీమ్యాట్‌ వంటి ప్రవేశపరీక్షలకు పెడుతున్న ఖర్చు సైతం విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా వర్సిటీల దరఖాస్తుల ఖరీదు సైతం రూ.3,500 నుంచి రూ.14,500 వరకు పెరిగి విద్యార్థులకు చుక్కలు చూపుతున్నాయి. ఒకటికన్నా ఎక్కువ కాలేజీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు భారంగా మారింది. దీంతో అమెరికాను కాదని ఆస్ట్రేలియా, కెనడాల వైపు దృష్టి సారిస్తున్నారు.

గుమ్మడి, సొరకాయ కూర
టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 22 ఏళ్ల అంకుర్‌ వైశంపాయన్‌ మాట్లాడుతూ.. గతంలో సమయం వృధా కాకుండా ఉండేందుకు బయట తినేసే వాళ్లమనీ, ఇప్పుడు రెస్టారెంట్ల వైపు కన్నెత్తికూడా చూడటం లేదని తెలిపారు. ప్రస్తుతం తాముండే గదిలోనే అందరం కలిసి  వండుకుని తింటున్నామని వెల్లడించారు. గతంలో పళ్లు, కూరగాయలపై వెచ్చించే మొత్తాన్ని తగ్గించుకుని, తక్కువ ధరలకు లభించే గుమ్మడి, సొరకాయ వంటివాటిని వారానికి మూడు రోజులు వండుకుని తింటున్నామని చెప్పారు. ఇంటి అద్దె, ఇతరత్రా ఖర్చుల సంగతి సరేసరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement