ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం 48 పైసలు బలపడి 69.72 వద్ద ముగిసింది. బుధ, గురు వారాల్లో రూపాయి విలువ 77 పైసలు బలహీనపడి 69.43 నుంచి 70.20కి పడిపోయింది. శుక్రవారం మళ్లీ 48 పైసలు రికవరీతో 70.20 నుంచి 69.72కు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ, ఆరు ప్రధాన దేశాల కరెన్సీలతో డాలర్ ఇండెక్స్ బలహీనధోరణి, ఎగుమతిదారులు, బ్యాంకర్ల డాలర్ అమ్మకాల ఒత్తిడి వంటివి శుక్రవారం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. శుక్రవారం రూపాయి ట్రేడింగ్ పటిష్టంగా 69.95 వద్ద ప్రారంభమైంది. తరువాత 69.66 వరకూ బలపడినా, కొంత వెనక్కుతగ్గి ట్రేడింగ్ చివరకు 69.72 వద్ద ముగిసింది.
అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుత శ్రేణి 2.25 శాతం నుంచి 2.5 శాతం శ్రేణి) పెంపు ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్న ఊహాగానాలు, అమెరికా వృద్ధి అవకాశాలు మందగమనంలోకి జారుకుంటాయన్న విశ్లేషణలు డాలర్ ఇండెక్స్ బలహీనతకూ, రూపాయి సానుకూల సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.ముడి చమురు(క్రూడ్) ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటోంది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 69.90 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ 96.17 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment