సాక్షి, కొత్తగూడెం: డాలర్ మంటతో రూపాయి విలువ ఢమాల్ అన్నది. గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. జిల్లా నుంచి అమెరికా వెళ్లే వారికి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిణామం జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐల పంట పండిస్తోంది. జిల్లా నుంచి దాదాపు ఐదు వేల మంది ఎన్‌ఆర్‌ఐలు ఉండటం గమనార్హం.
హైదరాబాద్ మినహా రాష్ట్రంలోనే అత్యధిక మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్న జిల్లాల్లో గుంటూరు, కృష్ణాల తర్వాత ఖమ్మం మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో మాత్రం మొదటి స్థానం. ఇక జిల్లా నుంచి ఉన్న ఎన్‌ఆర్‌ఐలల్లో 80 శాతం మంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటున్నారు. అమెరికా డాలర్ విలువ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో మంటలు మండిస్తోంది. అంటే మనవాళ్లకు ఆదాయం పంట పండుతున్నట్లే లెక్క. గత ఏడాది ఇదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ. 45కు అటూ ఇటూ ఉండగా ఇప్పుడు అది ఇంచుమించు రూ. 65 దరిదాపునకు చేరింది. అంటే మన ఎన్‌ఆర్‌ఐలకు 20 నుంచి 25 శాతం అదనపు ఆదాయం లభిస్తోంది.
ఒక్క ఖమ్మంలోనే రెండువేల నుంచి మూడు వేల మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. సగటున ఒక్కొక్క ఎన్‌ఆర్‌ఐ అన్ని ఖర్చులు పోను ఏటా రూ. 30 లక్షల నుంచి తక్కువలో తక్కువ రూ. 10 లక్షల వరకు ఆదాయం పొందగలుగుతున్నారన్నది అంచనా. ఇప్పుడు రాష్ర్టంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారపరంగా సేఫ్‌జోన్‌గా ఖమ్మానికి పేరుంది. ఒక్కో ఎన్‌ఆర్‌ఐ ఏటా రూ. 10 లక్షల వరకు ఇక్కడికి పెట్టుబడి కోసం పంపిం చినా మొత్తంగా లెక్కిస్తే సుమారు అది రూ. 500 కోట్లకు చేరుతుంది. రూపాయి విలువ పతనం వల్ల రూ. 200 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు వారికి అధిక భారతీయ కరెన్సీ లభిస్తుంది. అధికంగా లభించే ఆదాయం వల్ల ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇళ్లు, ఆపార్ట్‌మెంట్ల కొనుగోళ్లు, కార్ల వంటి వాహనాల కొనుగోళ్లతో పాటు ఏవైనా పరిశ్రమల స్థాపనకు అవకాశం ఏర్పడుతుందని నిపుణుల అంచనా. డాలర్ విలువ పెరగడంతో ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలకు అధిక ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని వ్యాపారం వైపు మరస్తుండటం ఖమ్మం మార్కెట్‌కు బూస్టప్
ఇప్పటికే ఖరీదుగా మారిన ఖమ్మం..
ఇటు హైదరాబాద్, అటు విజయవాడకు మార్గంమధ్యలో ఉండటం, ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ కావడంతో ఇప్పటికే ఇది ఖరీదైన ప్రాంతంగా మారింది. రియల్‌ఎస్టేట్ వ్యాపారం చుట్టు పక్కల జిల్లాల్లో స్తబ్దుగా ఉన్నా.. జిల్లాలో కూడా కాస్త వేగంతగ్గినా స్థిరంగానే కొనసాగుతోంది. ఆటోమొబైల్, పరిశ్రమలు, ప్రపంచ స్థాయి మార్కెట్ ఉన్న పలు రకాల కంపెనీల షోరూమ్‌లతో ఖమ్మం మార్కెట్ నూతన పుంతలు తొక్కుతోంది. రూపాయి మారకపు విలువ పడిపోవడం, ఇది కాస్తా జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలకు కలిసి వస్తుండడంతో.. ఇతర వ్యాపారంపై వారి కుటుంబాలు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మంతో పాటు కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలవారు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రూపాయి విలువ పడిపోవడంతో జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు మరింతగా జిల్లాలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక్కడ పెట్టుబడి పెడితే ప్రయోజనం..:
నూతలపాటి నాగేశ్వరరావు, ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
డాలర్ విలువ పెరగడంతో ఎన్‌ఆర్‌ఐలకు అధిక ఆదాయం వస్తుంది. అది జిల్లాలో పెట్టుబడి పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. వచ్చిన ఆదాయంలో సగానికి పైగా పిల్లలను విదేశాలకు పంపిన తల్లిదండ్రులకు పంపిస్తారు. చదువులో ప్రతిభ చూపించిన పిల్లను ఉన్నత చదువుల కోసం.. మధ్యతరగతి వర్గాల వారు కష్టపడి విదేశాలకు పంపించారు. ఇక్కడే చదివి, ఇక్కడే పరిజ్ఞానం పెంచుకున్న వారు జిల్లా అభివృద్ధికి పాటు పడాలి. ఎన్‌ఆర్‌ఐల సంబంధీకులు నిర్వహించే వ్యాపారాలతో జిల్లా యువతకు కూడా ఉపాధి దొరుకుతోంది.
డాలర్ దెబ్బ.. రూ‘పాయె’..!
Published Mon, Aug 26 2013 5:32 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement