ఏడు వారాల గరిష్ట స్థాయికి రూపాయి.. 61.44 వద్ద క్లోజ్!
అమెరికా ప్రభుత్వ కార్యాలయాల మూసివేత సంక్షోభ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన పథకం అమలు మరింత ఆలస్యమవుతుందనే వార్తలతో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి వరుసగా మూడో రోజు బలపడింది. డాలర్ తో పోల్చితే రూపాయి 29 పైసలు బలపడి 61.44 వద్ద ముగిసింది. స్థానిక మార్కెట్లలో సానుకూలతతో ఎగుమతుదారులు డాలర్ అమ్మకాలు చేపట్టడంతో గత వారం రూపాయి 107 పైసలు లాభపడింది.
ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్సెంజ్ మార్కెట్ లో రూపాయి 61.85 కనిష్టస్థాయిని చేరుకుంది. ఆతర్వాత నష్టాల నుంచి చేరుకున్న రూపాయి ఓ దశలో 61.25 గరిష్ట స్థాయిని చేరుకుని .. . చివరికి 61.44 వద్ద ముగిసింది. బడ్జెట్ విషయంలో రిపబ్లికన్స్, డెమోక్రాట్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా షట్‌డౌన్ వరుసగా నాలుగవ రోజూకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ద్రవ్య మార్కెట్ లో రూపాయి బలపడటం స్థానిక మార్కెట్లలో సానుకూలతకు కారణమైంది.