ముంబై: ప్రపంచ దేశాలను మళ్లీ మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు, పలు దేశాల రుణ రేట్ల పెంపుతో ప్రపంచ వృద్ధిబాటలోంచి క్షీణతలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో పెట్టుబడులకు తక్షణ మార్గంగా డాలర్ కనబడుతోంది. దీనితోపాటు ఫెడ్ కఠిన ద్రవ్య విధానంతో ప్రపంచవ్యాప్తంగా నిధులు డాలర్లలోకి వస్తున్నాయి. ఈ వార్త రాసే 11 గంటల సమయంలో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 106.50 డాలర్లపైన గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది.
ఈ నేపథ్యంలో భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది. మంగళవారం 38 పైసలు పతనమై 79.33 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 79.38 స్థాయిని కూడా చూసింది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లడం రూపాయి భారీ పతనానికి కారణమవుతోంది. ఈ రెండు స్థాయిలు రూపాయికి ముగింపు, ఇంట్రాడే కనిష్ట స్థాయిలు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ లాభాల బాటన పయనిస్తుండగా, నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 35 డాలర్లు పతనమై (2 శాతం) 1,767కు చేరింది. క్రూడ్ 10 శాతం వరకూ పడిపోయి 100 డాలర్ల దిగువకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment